టీనేజీ అమ్మాయిల్లో మొటిమలు ఎందుకొస్తాయ్?

యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అవాంఛిత రోమాలు, స్తనాల్లో పెరుగుదల, నెలసరి మొదలవడం, మొటిమలు రావడం.. మొదలైనవి. అయితే ఇలా ఉన్నట్లుండి వచ్చిన మార్పులు వారిని కొంత అసౌకర్యానికి గురి చేసినా ఇవి సర్వసాధారణమే అంటున్నారు నిపుణులు. ఇందుకు వారి శరీరంలోని హార్మోన్లలో జరిగే మార్పులే కారణమని చెబుతున్నారు. 

Updated : 08 Sep 2022 17:03 IST

యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అవాంఛిత రోమాలు, స్తనాల్లో పెరుగుదల, నెలసరి మొదలవడం, మొటిమలు రావడం.. మొదలైనవి. అయితే ఇలా ఉన్నట్లుండి వచ్చిన మార్పులు వారిని కొంత అసౌకర్యానికి గురి చేసినా ఇవి సర్వసాధారణమే అంటున్నారు నిపుణులు. ఇందుకు వారి శరీరంలోని హార్మోన్లలో జరిగే మార్పులే కారణమని చెబుతున్నారు. ఏదేమైనా ఈ వయసులో వచ్చే మొటిమల వల్ల చాలామంది అమ్మాయిలు ఒకింత అసహనానికి గురవుతుంటారు. ఒకసారి ఈ సమస్య వచ్చిందంటే ఇక తగ్గనే తగ్గదన్న భ్రమలో ఉండిపోతారు. వారి బ్యూటీ రొటీన్‌లో ఏవేవో మార్పులు చేసుకుంటారు. వేడి శరీరం, నూనె పదార్థాలు తినడం వల్లే ఇవి వస్తాయనుకుంటారు. మరి, వీటిలో ఎంతవరకు నిజముంది? టీన్‌ యాక్నే గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..
యుక్త వయసులోకి అడుగుపెట్టిన అమ్మాయిల్లో ఆండ్రోజన్‌ హార్మోన్‌ (సెక్స్‌ హార్మోన్‌) స్థాయులు పెరుగుతాయి. ఇవి చర్మంలోని నూనె గ్రంథులు అధికంగా స్పందించేలా చేస్తాయి. తద్వారా నూనె/సీబమ్‌ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది చర్మ రంధ్రాలను బ్లాక్‌ చేసి క్రమంగా మొటిమలు రావడానికి దారితీస్తుంది. ఈ క్రమంలో ఆ ప్రదేశంలో ఎరుపెక్కడం, నొప్పి, వాపు.. వంటివి రావడం కామనే! ఇక వయసు పెరుగుతున్న కొద్దీ గర్భనిరోధక మాత్రలు వాడడం, నెలసరి, గర్భం ధరించడం.. వంటి పలు కారణాల వల్ల హార్మోన్లలో కలిగే మార్పులు మొటిమలు రావడానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు.


ఇలా దూరం చేసుకోవచ్చు!
టీనేజ్‌లో వచ్చే మొటిమల సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!
* శరీరంలో జింక్‌ లోపమున్నా మొటిమలొస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. అందుకే నిపుణుల సలహా మేరకు ఈ సప్లిమెంట్‌ను తీసుకోవడం మంచిది. ఇది చర్మంలో కొత్త కణాలు పుట్టుకురావడానికి, జీవక్రియల పనితీరుకు, రోగనిరోధక శక్తికి ఎంతో అవసరం. అలాగే జింక్‌ అధికంగా లభించే నట్స్‌, బీన్స్, చికెన్ వంటి పదార్థాలు తీసుకోవాలి.
* చేప నూనెలో Eicosapentaenoic Acid (EPA) and Docosahexaenoic Acid (DHA) అనే రెండు రకాల ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఇవి చర్మంపై వాపును తగ్గించి మొటిమల సమస్యను దూరం చేయడానికి తోడ్పడతాయి. కాబట్టి నిపుణుల సలహా మేరకు చేప నూనె సప్లిమెంట్స్‌ వాడడం మంచిది. లేదంటే వాల్‌నట్స్‌, సబ్జా గింజలు, అవిసె గింజలు, చేపలు.. వంటి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని రోజువారీ మెనూలో చేర్చుకోవాలి.
* ఎక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మంలో సీబమ్‌ ఉత్పత్తి పెరిగిపోతుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. కాబట్టి పాలు, చిలగడదుంప, నట్స్‌, పప్పుధాన్యాలు.. వంటి తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.


* మొటిమలు రావడానికి ఒత్తిడి కూడా ఓ కారణమే! కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి వ్యాయామం, యోగా, ధ్యానం, సుఖ నిద్ర, శ్వాస సంబంధిత వ్యాయామాలు మేలు చేస్తాయి.
* వీటితో పాటు సౌందర్య నిపుణుల సలహాలు తీసుకొని ఇంటి చిట్కాలు సైతం ప్రయత్నించచ్చు. అయితే సమస్య అదుపులో ఉన్నంత వరకే ఈ చిట్కాలు పనిచేస్తాయి. అలాకాకుండా ఒకవేళ మరీ ఎక్కువ మొటిమలు వస్తే గనుక ఆలస్యం చేయకుండా చర్మవ్యాధి నిపుణుల్ని సంప్రదించి తగిన పరిష్కార మార్గాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

కొన్ని అపోహలు-వాస్తవాలు! 
యుక్త వయసులో వచ్చే మొటిమల సమస్యపై కొంతమంది అమ్మాయిల్లో పలు అపోహలు సైతం ఉన్నాయి. అవేంటి? వాటి గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..!
* రోజూ స్క్రబ్‌ చేసుకుంటే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.
స్క్రబ్‌ చేసుకోవడం చర్మ ఆరోగ్యానికి మంచిదే అయినా రోజూ చేయడం మాత్రం సరికాదు. ఎందుకంటే రోజూ ఈ ప్రక్రియ చేయడం వల్ల చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది. తేమ తగ్గిపోయి కళ తప్పుతుంది. కాబట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు స్క్రబ్‌ చేసుకుంటూ.. రోజుకు రెండుసార్లు శుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
* నూనె పదార్థాలు తింటే మొటిమలొస్తాయి.
నూనె పదార్థాలు, ఫ్రైడ్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌.. వంటివి తీసుకుంటే మొటిమలొస్తాయన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఏ అధ్యయనంలోనూ ఈ విషయం రుజువు కాలేదు. అలాగని వీటిని ఎక్కువ మొత్తంలో తినడమూ మంచిది కాదు. కాబట్టి వీటిని తినాలనిపించినప్పుడు మితంగా తీసుకోవాలి. అయితే గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉండే వైట్‌ బ్రెడ్‌, శీతల పానీయాలు, కేక్స్‌, క్యాండీస్‌.. వంటివి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.
* శరీరంలో వేడెక్కువైతే మొటిమలొస్తాయి.
ఇది పూర్తిగా అపోహే! ఎందుకంటే మొటిమలు రావడానికి ప్రధాన కారణం ఆండ్రోజన్‌ హార్మోన్ల స్థాయులు పెరగడం. ఒత్తిడి, ఆందోళనలు, యాంగ్జైటీ, నూనె ఆధారిత సౌందర్య ఉత్పత్తులు.. వంటివి ఈ హార్మోన్‌ స్థాయులు పెరగడానికి కారణమవుతాయి. తద్వారా మొటిమలొస్తాయే తప్ప వేడి వల్ల కాదు.
* వాతావరణ కాలుష్యమే ఈ సమస్యకు కారణం.
వాతావరణంలోని దుమ్ము-ధూళి.. వంటివే కాదు.. వ్యాయామం తర్వాత ముఖాన్ని శుభ్రపరచుకోకపోయినా ఈ సమస్య తలెత్తుతుంటుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఈ క్రమంలో నిపుణుల సలహా మేరకు యాక్నే క్లెన్సర్లు కూడా వాడచ్చు. ఈ క్రమంలో చర్మ రంధ్రాల్లో చేరిన మలినాలు, చెమట.. వంటివి తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. తద్వారా మొటిమలు రావడానికి ఆస్కారమే ఉండదు.

ఇక కొంతమంది అమ్మాయిలు మొటిమలు త్వరగా తగ్గిపోవాలన్న ఉద్దేశంతో పదే పదే వాటిని గిల్లుతూ ఉంటారు. దానివల్ల సమస్య ఎక్కువవడం, ఆ చోట నల్లటి మచ్చ ఏర్పడడం.. తప్ప మరే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ అలవాటును మానుకోండి. అలాగే ఈ సమస్యను తగ్గించుకునే క్రమంలో మీరు ఏ ఉత్పత్తి వాడినా ఓసారి నిపుణుల సలహా తీసుకోవడం, వాడే ముందు ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్