close
ఇంటర్వ్యూ
ఒక్క ప్రేమలేఖా రాలేదు

జాతీయస్థాయి కీర్తి

కన్ను గీటితే... శశిరేఖ, కంట నీరొలికితే... పార్వతి, కంట నీరు తెప్పిస్తే... సుమంగళి...  పాత్ర ఏదైనా ఆమెకు ఆమే సాటి. నటిగా సావిత్రిది ఎవరెస్టు స్థాయి... అంతటి మహానటి పాత్రలో ఒదిగి, నటిగా ఎంతో ఎదిగిన కీర్తి సురేష్‌ ఇప్పుడు జాతీయ అవార్డుతో మరోస్థాయిని అందుకున్నారు.  ఈ సందర్భంగా ఆమెను పలకరిస్తే... ఎన్నో కబుర్లు చెప్పారు.

* నేను పుట్టి పెరిగింది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో. అమ్మ మేనక మంచి నటి. నాన్న సురేష్‌కుమార్‌ నిర్మాత. మా అక్క రేవతి ప్రస్తుతం ఈ రంగానికి సంబంధించి అకాడమీ బాధ్యతలను నిర్వహిస్తోంది.
* మలయాళం, తమిళ చిత్రాల్లో నటించిన అమ్మ తెరపైనే నటి. ఇంటి ముందు ముగ్గు పెట్టడం నుంచి మా ఆలనాపాలనా వరకు అంతా ఆమే చూసేది. స్కూల్‌ ఫస్ట్‌ వచ్చేయాలి, వందకు వంద మార్కులు తెచ్చుకోవాలని ఇబ్బంది పెట్టేది కాదు. జీవితానికి చదువు ముఖ్యం. చదువే జీవితం కాకూడదు అనేది. 70శాతం మార్కులు తెచ్చుకునే వాళ్లం.
* జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైనట్లు తెలిసినప్పుడు అమ్మ, నాన్న దగ్గరే ఉన్నాను. చాలా సంతోషమేసింది. తెరపై అమ్మ నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె నటించిన ‘ఓ పోల్‌’ (తోబుట్టువు) చిత్రంలో ఆమె పాత్ర జాతీయ ఉత్తమ నటి అవార్డుకు నామినేట్‌ అయ్యింది. అయితే చివరి ఎంపికలో అమ్మ పేరు లేదు. ఆ సందర్భంలో తనకు కలిగిన నిరుత్సాహం అమ్మ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు నాకు దక్కిన ఈ గౌరవాన్ని అమ్మకు అంకితమిస్తున్నా.
* మహానటి ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడు ముందుగా అమ్మ చాలా భయపడింది. సహజసిద్ధమైన నటన ఉంటేనే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతాం అంది. నిర్మాతలు, దర్శకుడు ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేశా.
* ముందుగా మాయాబజార్‌ సినిమాలోని షాట్‌ చిత్రీకరించారు. చాలా టేక్స్‌ తీసుకున్నా. దానికి ముందుగా చాలాసార్లు రిహార్సల్స్‌ చేశాం. ఎడమ కంటి నుంచి రెండు నీటి బొట్లు, కుడి కంటిలో ప్రేమ కనిపించే సీన్‌ కోసం రెండు గంటలపాటు ప్రయత్నించాను.
* మహానటి చిత్రం పూర్తిగా భావోద్వేగాలమయం. మనసులోని భావాలు ముఖంపై ప్రతిఫలించాలి. ఆమె నడక, తలకట్టు, దుస్తులు అన్నింటిలో ఆమెలా మారిపోతేనే పాత్ర పరిపుష్టి అవుతుంది. దాదాపు వంద రకాలకు పైగా దుస్తులను ధరించా. మొదటి రోజు మేకప్‌కు నాలుగు గంటలకు పైగా పటింది. ఏడాదికి పైగా ఆ పాత్రలో లీనమైపోయా. చాలారోజులు నిద్రపట్టేది కాదు. పగలు షూటింగ్‌లో ముఖం వాడినట్లు కనిపిస్తుందని భయం. ఇలా ఎన్నో ఇబ్బందులకు గురయ్యేదాన్ని.
* మహానటి చిత్రం విడుదలైన తరువాత అభిమానులే కాదు, విమర్శకులూ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో గౌరవాన్ని అందుకోబోతున్నా. దీనికి సహకరించిన టెక్నీషియన్స్‌ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొంటున్నా. అలాగే ఈ చిత్రంలోని కొన్ని సంఘటనలు, సన్నివేశాల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారిని క్షమాపణలు కోరుకుంటున్నా.
* మరో బయోపిక్‌ ఒప్పుకొంటారా అని చాలామంది అడుగుతుంటారు. ఇదే మొదటిది, చివరిది అని చెబుతుంటా. ఎందుకంటే మహానటి లాంటి పాత్రలో నటించి మరో పాత్ర చేయాలని లేదు. అంతగా ఈ పాత్రకు ప్రభావితురాలినయ్యా. షూటింగ్‌ పూర్తయ్యే 10 రోజుల ముందు నుంచే మనసులో ఏదో బాధ మొదలైంది. చిత్రీకరణ పూర్తయిన తరువాత ఏడ్చేశా. ఏదో వదిలివెళుతున్నట్లే అనిపించింది. పెద్దనాన్న పాత్రలో చేసిన రాజేంద్రప్రసాద్‌ షూటింగ్‌ ముగిసి, వెళ్లిపోతుంటే కళ్లల్లో నీళ్లు కారిపోయాయి. ఆయనను గట్టిగా హత్తుకుని ఏడ్చేశా. అందుకే నేను అంటుంటా... ‘మహానటి ఓ మహాద్భుతం...ఓ ప్రయాణం. మనషులనే కాదు, మనసులను కూడా కట్టిపడేసే మాయాజాలం ఆ చిత్రం’ అని.
* హాలీవుడ్‌లో టామ్‌క్రూస్‌ అభిమానిని. బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్‌, దీపికా పదుకోణే, ఆలియాభట్‌ అంటే చాలా ఇష్టం. నయనతార డ్రెస్‌ సెన్స్‌, సిమ్రాన్‌ డ్యాన్స్‌ అంటే ఫిదా అయిపోతా.

క్రేజీగా

ఓసారి ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఓ అభిమాని నావద్దకు వచ్చి కానుకిచ్చి వెళ్లాడు. అదేంటంటే నా ఫొటోలన్నింటినీ పొందుపరిచిన అల్బంలాంటిది. వాటితోపాటు ఒక ఉత్తరం కూడా ఉంది. నన్ను ప్రపోజ్‌ చేస్తూ రాసిన ఆ లేఖను ఉంచుకున్నా. ఎందుకంటే కాలేజీ రోజుల్లో ఒక్క ప్రేమలేఖా రాలేదు కాబట్టి.

సామాజిక సేవలో

గతేడాది కేరళలో వరద బాధితులకు చేయూత అందించాలనుకున్నా. ఒక బృందంతో కలిసి ఆయా ప్రాంతాలన్నీ చుట్టివచ్చి, ఇబ్బందులన్నీ తెలుసుకున్నా. వెంటనే స్థానిక ప్రభుత్వ కాలేజీలో కొన్ని రోజులు బృందంతో కలిసి ఉండి ఫ్యామిలీ కిట్‌లు తయారుచేసి పంపిణీ చేశాం. ఆ కిట్‌లో బియ్యం, పప్పు, ఉప్పు, వంట సరుకులు, కూరగాయలు వంటివన్నీ ఉండేలా దగ్గరుండి చూసుకున్నా. అలాగే మహిళలకు కావాల్సిన శానిటరీ న్యాప్‌కిన్స్‌ నుంచి లోదుస్తుల వరకు అందేలా కృషి చేశా. అమ్మ నుంచి ఇవన్నీ నేర్చుకున్నా. 

తరగతులెగ్గొట్టి

సినీ రంగంలోకన్నా కాలేజీ స్నేహితులే నాకు ఎక్కువ. తరగతులు ఎగ్గొట్టి చాలా సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు బిజీ అవడంతో వారందరినీ కలవలేకపోతున్నా. దుస్తుల్లో పార్టీవేర్‌ కన్నా సాదాసీదా అవుట్‌ఫిట్స్‌ అంటే ఇష్టపడతా. ఆకుపచ్చ రంగంటే ఇష్టం. నేను చదివిన కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ కోర్సును నా వృత్తిలో ఉపయోగిస్తూ ఉంటా.
- సీహెచ్‌ వసుంధరాదేవి

Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.