అనారోగ్యమే ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది..!

పిల్లలు పుట్టిన తర్వాత వారి బాగోగులు చూసుకోవడం కోసం చాలామంది మహిళలు ఇంటికే పరిమితమవుతుంటారు. కానీ, కొంతమంది అటు ఆఫీసు పనిని ఇటు పిల్లల బాధ్యతలను బ్యాలన్స్‌ చేసుకుంటూ తీరిక లేకుండా గడుపుతుంటారు. కానీ, ఇద్దరు పిల్లలకు తల్లైన ప్రీతి మాత్రం 45 ఏళ్ల వయసులో....

Published : 30 Jun 2022 12:09 IST

(Photos: Instagram)

పిల్లలు పుట్టిన తర్వాత వారి బాగోగులు చూసుకోవడం కోసం చాలామంది మహిళలు ఇంటికే పరిమితమవుతుంటారు. కానీ, కొంతమంది అటు ఆఫీసు పనిని ఇటు పిల్లల బాధ్యతలను బ్యాలన్స్‌ చేసుకుంటూ తీరిక లేకుండా గడుపుతుంటారు. కానీ, ఇద్దరు పిల్లలకు తల్లైన ప్రీతి మాత్రం 45 ఏళ్ల వయసులో ఒకవైపు మారథాన్‌లు.. మరోవైపు సైక్లింగ్‌ చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే లేహ్ (లడాఖ్‌) నుంచి మనాలీ (హిమాచల్‌ ప్రదేశ్‌) వరకు 55 గంటల్లో సైక్లింగ్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. ఈ క్రమంలో ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...

అనారోగ్యమే మలుపు తిప్పింది...

పుణేకు చెందిన ప్రీతికి చిన్నప్పటి నుంచి ఆటలంటే మక్కువ. పాఠశాలలో చదివేటప్పుడే ఆమె జాతీయ స్థాయిలో హాకీ, జిల్లా స్థాయిలో బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొంది. పెళ్లైన తర్వాత కుటుంబం, పిల్లల బాగోగులు చూసుకోవడం కోసం ఆటలకు స్వస్తి చెప్పి పూర్తిగా ఇంటికే పరిమితమైంది. అలా దాదాపు 20 సంవత్సరాలు గడిచాయి. 2015లో ప్రీతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దానివల్ల ఆమె రెండు సంవత్సరాల పాటు పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. అప్పటినుంచి మళ్లీ ఏదైనా ఆటపై దృష్టి సారించాలని అనుకుంది. ఈ క్రమంలోనే 2017లో రన్నింగ్‌ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె వయసు 40 సంవత్సరాలు. అలా రన్నింగ్‌ చేయడం ప్రారంభించిన మూడు సంవత్సరాల్లోనే ప్రీతి ఐదు ఫుల్‌ మారథాన్‌లు, 30 హాఫ్‌ మారథాన్‌లతో పాటు రెండు అల్ట్రా 100K మారథాన్‌లు, నాలుగు అల్ట్రా 42K మారథాన్‌లను పూర్తి చేసింది. ఈ క్రమంలో 2017లో మలేషియాలో జరిగిన ఏషియా పసిఫిక్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో రెండు బంగారు పతకాలను కూడా కైవసం చేసుకుంది. ప్రీతికి 22 ఏళ్ల అమ్మాయి, 15 ఏళ్ల అబ్బాయి ఉన్నారు.

ఇక సైక్లింగ్‌ వంతు...!

రన్నింగ్‌ చేయడం ప్రారంభించిన కొద్ది రోజులకే ప్రీతి సైక్లింగ్‌ చేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజులకే దూరప్రాంతాల నడుమ సైక్లింగ్‌ చేయడంపై మక్కువ పెంచుకుంది. ఈ క్రమంలో పలు రికార్డులను నమోదు చేసింది. 2019లో ప్రీతి మరో ఇద్దరితో కలిసి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 17 రోజుల 17 గంటల పాటు సైక్లింగ్‌ చేసి వరల్డ్ రికార్డు సాధించింది. అదే సంవత్సరం అమృత్‌సర్ (పంజాబ్‌) నుంచి నాసిక్ (మహారాష్ట్ర) వరకు దాదాపు 1600 కిలోమీటర్ల దూరాన్ని 5 రోజుల 5 గంటల్లో పూర్తి చేసి ఒంటరిగా ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2021లో స్వర్ణ చతుర్భుజిలో భాగంగా ఉన్న హైవేలపై 6000 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేసి గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది. పుణె, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, దిల్లీ, రాజస్థాన్‌ నుంచి ముంబయి మీదుగా మళ్లీ పుణేకు చేరుకుంది. ఈ యాత్రను 24 రోజుల 6 గంటల సమయంలోనే పూర్తి చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.

రెండుసార్లు ఆక్సిజన్‌ పెట్టుకుని...

ఇన్ని రికార్డులు సాధించినా సరే.. ఎప్పటికప్పుడు కొత్త రికార్డుల కోసం ప్రయత్నించడంలో ముందుంటుంది ప్రీతి. తాజాగా ఆమె మరో గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. భిన్న వాతావరణ పరిస్థితులు ఉండే లేహ్ (లద్దాఖ్‌) నుంచి మనాలీ (హిమాచల్‌ ప్రదేశ్‌) వరకు 55 గంటల 13 నిమిషాల్లో సైక్లింగ్‌ చేసి రికార్డు సాధించింది. ఈ క్రమంలో ప్రీతి 430 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేసింది. తద్వారా మరోసారి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించే క్రమంలో ఆమె దేశంలోనే వాహనాలు వెళ్లగలిగే రెండో ఎత్తైన మార్గాన్ని దాటింది. ఈ మార్గంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు సరిపడ ఆక్సిజన్‌ కూడా లభించదు. ప్రీతికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ ప్రయాణంలో ఆమెకు సరిపడ ప్రాణవాయువు లభించకపోవడంతో రెండుసార్లు ఆక్సిజన్‌ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. తాను ఈ రికార్డులను సాధించడానికి భర్తతో పాటు పిల్లల సహకారం కూడా ఎంతో ఉందని చెప్పుకొచ్చింది.

‘నలభైల్లో నా రెండో ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టాను. నేను వయసును ఒక సంఖ్యగానే భావిస్తాను. ఏదైనా సాధించాలంటే మొదట మనల్ని మనం నమ్ముకోవాలి. ఇలా చేస్తే మనల్ని ఎవరూ ఆపలేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడను తమ జీవితంలో భాగం చేసుకోవాలి. దానివల్ల కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం’ అంటోంది ప్రీతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్