Updated : 12/02/2022 12:53 IST

94 ఏళ్ల వయసులో ఎన్నికలకు ‘సై’ అంటోంది!

చాలామంది నలభై ఏళ్లు దాటగానే ‘ఈ వయసులో కొత్తగా ఏం చేస్తాంలే’ అని నీరసపడిపోతుంటారు. కానీ, కొంతమంది చేసే పనికి, వయసుకు సంబంధమే లేదని నిరూపిస్తుంటారు. చెన్నైకి చెందిన కామాక్షీ సుబ్రమణియన్‌ ఈ కోవకే చెందుతారు. ఆమె 94 ఏళ్ల వయసులో చైన్నై స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ వేశారు. తద్వారా ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసిన అత్యంత పెద్ద వయస్కురాలిగా ఘనత సాధించారు.

ఇటీవలే చెన్నై స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 94 ఏళ్ల కామాక్షీ సుబ్రమణియన్‌ 174వ వార్డు(బీసెంట్‌ నగర్‌, అడయార్‌ ప్రాంతం)కి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. తద్వారా చెన్నై చరిత్రలోనే ఈ తరహా ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసిన వృద్ధ మహిళగా నిలిచారామె.

ఉద్యోగం చేయకపోయినా..!

కామాక్షి చెన్నై తంజావూరులోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆమె భర్త ప్రభుత్వోద్యోగి. దాంతో వారు రాష్ట్రపతి భవన్‌కు సంబంధించిన కాంప్లెక్సులోనే నివసించేవారు. అలా దాదాపు 30 సంవత్సరాల పాటు వారు దిల్లీలోనే ఉన్నారు. ఆమె భర్త బ్యూరోక్రసీకి సంబంధించిన విషయాల గురించి రోజూ ఆమెతో చర్చించేవారట. అలా ఈ మూడు దశాబ్దాల కాలంలో ప్రభుత్వ విధి విధానాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కామాక్షి. 1977లో నీలం సంజీవ రెడ్డి రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆమె భర్త పదవీ విరమణ పొందారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

సమాజ సేవ కోసం ‘స్పార్క్‌’!

భర్త రిటైర్‌మెంట్‌ తర్వాత చెన్నై బీసెంట్‌ నగర్‌లోని ఫోర్త్‌ ఎవెన్యూకి మకాం మార్చారు కామాక్షి దంపతులు. ఆమెకు సమాజ సేవ చేయడమంటే ముందు నుంచే ఇష్టం. ఈ క్రమంలో భర్త చనిపోయాక దీనిపై దృష్టి సారించారామె. గత 40 సంవత్సరాలుగా బీసెంట్‌ నగర్‌లోని పలు సామాజిక సమస్యలపై పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే 2012లో మెరైన్‌ బయాలజిస్ట్‌ అయిన టీడీ బాబు సహకారంతో ‘స్పార్క్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు కామాక్షి. స్థానికంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి చేపట్టే వివిధ పనుల్లోని లోపాల్ని గుర్తించి.. వాటిని సవరించడం, ఆయా పనుల్లోని నాణ్యతను పర్యవేక్షించడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం.

ఆ కట్టడానికి పూర్వ వైభవం!

ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో ఎంతో చురుగ్గా ఉండే ఆమె.. తను నివసించే ప్రాంతంలో ఏ పని మొదలుపెట్టినా దగ్గరుండి పనులు చేయిస్తుంటారు. ఒకసారి ఆమె ఉంటోన్న వీధిలో తారు రోడ్డు వేస్తున్నారు. అయితే రోడ్డు వేసే వారు చుట్టుపక్కల నీళ్లు పోవడానికి దారి లేకుండా పరిమితికి మించి తారు వేయడం ఆమె గమనించారు. వారికి ఎంత ఎక్కువ తారు వేస్తే అన్ని డబ్బులు వస్తాయన్న కక్కుర్తితోనే ఇలా చేస్తున్నారని తెలుసుకున్న ఆమె.. స్వయంగా దగ్గరుండి మరీ సక్రమంగా ఆ పని పూర్తి చేయించారు. ఇలా ఆమె చూపిన చొరవ వల్లే సునామీ వచ్చినా కూడా ఆ రోడ్డు చెక్కు చెదరదని ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్థానికులు. మరోవైపు శిథిలావస్థకు చేరుకున్న అక్కడి షమిత్‌ మెమోరియల్‌ అనే చారిత్రక కట్టడానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు కామాక్షి. అంతేకాదు.. స్థానికంగా ఉన్న మురుగు నీటి సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్‌ తీగల్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చేలా చర్యలు తీసుకున్నారు. ఇలా అక్కడి ప్రజలకు ఆపద్భాందవిగా నిలుస్తోన్న ఆమెను అక్కడి ప్రజలు ప్రేమతో కామాక్షి పాటి(అమ్మమ్మ) అని పిలుస్తుంటారు.

అది శక్తిమంతమైన ఆయుధం..

94 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ ఎవరి సహాయం తీసుకోకుండా స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడుతుంటారు కామాక్షి. భర్త చనిపోయాక కొంతకాలం ప్రైవేటు కంపెనీలో పని చేసిన ఆమె.. ప్రస్తుతం భర్త పెన్షన్‌తోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఓ సందర్భంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసని అడిగారట. దానికి ఆమె ‘మీరు రేపు ఏ పని చేస్తారో నాకు తెలుసు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల పాటు బ్యూరోక్రసీ పనులను దగ్గర్నుంచి చూశాను’ అని సమాధానమిచ్చారట. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం మాత్రం ఇప్పటిది కాదంటారామె. ఎప్పట్నుంచో పోటీ చేయాలనుకున్నా గత పది సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. దాంతో ప్రస్తుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కామాక్షి. ‘ప్రజలు వారి శక్తిని గుర్తించలేకపోతున్నారు. వారి దగ్గర ఉన్న ఓటు హక్కు ఎంతో శక్తిమంతమైన ఆయుధం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి’ అంటూ చెబుతున్నారామె. అయితే ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తన సేవ మాత్రం ఆగదంటున్నారీ బామ్మ. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 19న జరగనున్నాయి.

మరి, ముదిమి వయసులోనూ ప్రజలకు సేవ చేయాలన్న మంచి సంకల్పంతో ఉన్న ఈ బామ్మ ఎన్నికల్లో గెలవాలని, తద్వారా తన సేవల్ని మరింత విస్తరించాలని మనమూ కోరుకుందాం!

ఆల్‌ ది బెస్ట్‌ కామాక్షి పాటి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని