Updated : 04/01/2022 21:04 IST

గ్రాడ్యుయేట్ ట్రైనీ నుంచి సీఎండీగా..!

(Photo: Twitter)

కొన్ని సంవత్సరాల క్రితం వరకు మహిళా సాధికారత అంటే ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే  ఉండేది. కానీ, రోజులు మారుతున్నాయి.  ఇంకా పూర్తిస్థాయిలో మహిళలకు సమాన అవకాశాలు దక్కకపోయినా చాలామంది మహిళలు విభిన్న రంగాల్లో గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అతి పెద్ద గ్యాస్‌, చమురు సరఫరాదారైన ఓఎన్‌జీసీ సంస్థకు అల్కా మిత్తల్ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా (సీఎండీ) నియమితులయ్యారు. ఆమె ఈ పదవిలో ఆరు నెలలు లేదా సాధారణ నియామకం జరిగేంత వరకు కొనసాగుతారు. తద్వారా 65 సంవత్సరాల సంస్థ ప్రస్థానంలో ఈ పదవి దక్కించుకున్న మొదటి మహిళగా ఘనత సాధించారు. అలాగే ఈ రంగంలో సీఎండీగా ఎంపికైన రెండో మహిళగా నిలిచారు. అంతకుముందు 2014లో నిషి వాసుదేవ హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థకు సీఎండీగా వ్యవహరించారు.

అలా సీఎండీగా...

ప్రస్తుతం అల్కా ఓఎన్‌జీసీ మానవ వనరుల డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె ఈ పదవిలో ఆరు నెలలు లేదా సాధారణ నియామకం జరిగేంత వరకు కొనసాగుతారు. 2021 మార్చి 31న శశి శంకర్‌ పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఓఎన్‌జీసీకి శాశ్వత సీఎండీని నియమించలేదు. కంపెనీ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా పనిచేస్తున్న సుభాష్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. గత నెల 31న ఆయన కూడా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో అల్కా మిత్తల్కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ క్రమంలో అల్కా మిత్తల్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం...

* మిత్తల్‌ 1983లో డెహ్రాడూన్లోని M.K.P.P.G కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ పట్టా పొందారు.

* ఆమె 1985లో ఓఎన్‌జీసీ సంస్థలో గ్రాడ్యుయేట్ ట్రైనీగా చేరి తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

* అల్కా మిత్తల్‌ 2001లో బిజినెస్/కామర్స్లో డాక్టరేట్‌ పొందారు.

* ఆమె నవంబర్‌ 27, 2018లో ఓఎన్‌జీసి బోర్డులో సభ్యురాలిగా నియమితురాలయ్యారు. తద్వారా ఈ సంస్థలో పూర్తిస్థాయి డైరెక్టర్గా నియమితులైన మొదటి మహిళగా నిలిచారు. ఈ క్రమంలో ఆమె మానవ వనరుల విభాగానికి డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఓఎన్‌జీసీలో సీఎండీతో పాటు ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు. సంస్థకు సంబంధించిన ప్రతి విషయాన్ని వీరే చూసుకుంటారు. ఆమె ఇటు డైరెక్టర్గా తన విధులు నిర్వర్తిస్తూనే అటు సీఎండీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

* ఓఎన్‌జీసీ ప్రస్తుత బోర్డులో అత్యంత సీనియర్‌ సభ్యురాలు అల్కానే కావడం విశేషం.

* ఈ సంస్థలో డైరెక్టర్గా నియమితురాలు కాక ముందు ఆమె సీఎస్‌డీ (చీఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌) ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ని తీసుకొచ్చి దాదాపు 5000 అప్రెంటిస్‌ల నియామకంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో ఎక్కువ శాతం మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.

* మానవ వనరుల విభాగ నిపుణురాలిగా ఆమె ఈ రంగంలో వివిధ హోదాల్లో సేవలందించారు. ఓఎన్‌జీసీలో మహిళాభివృద్ధి విభాగానికి నేతృత్వం వహించారు.

* ఆమె ఆగస్టు 2015 నుండి ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (OMPL) బోర్డులో సైతం నామినీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని