చనుమొనల వద్ద ఇన్ఫెక్షన్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
పిల్లలకు పాలివ్వడం వల్ల రొమ్ముల్లో నొప్పి, చనుమొనలు ఎరుపెక్కడం, దురదగా అనిపించడం.. వంటివి చాలామంది తల్లులు ఎదుర్కొనే సమస్యలే! అయితే నిరంతరాయంగా పాలివ్వడం వల్లే ఇలా జరుగుతుందనుకుంటారు చాలామంది. కానీ ఇందుకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఓ కారణం కావచ్చంటున్నారు.....
పిల్లలకు పాలివ్వడం వల్ల రొమ్ముల్లో నొప్పి, చనుమొనలు ఎరుపెక్కడం, దురదగా అనిపించడం.. వంటివి చాలామంది తల్లులు ఎదుర్కొనే సమస్యలే! అయితే నిరంతరాయంగా పాలివ్వడం వల్లే ఇలా జరుగుతుందనుకుంటారు చాలామంది. కానీ ఇందుకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఓ కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో రొమ్ములు-చనుమొనల వద్ద ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్షన్‌గా అనుమానించడంలో తప్పు లేదంటున్నారు. మరి, ఇంతకీ ఏంటీ ఇన్ఫెక్షన్? దీనికి కారణమేంటి? ఈ సమయంలో పిల్లలకు పాలివ్వడం మంచిదా? కాదా? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
పాలిచ్చే తల్లుల్లో హార్మోన్ల ప్రభావం వల్ల శారీరకంగా, మానసికంగా వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఈ వర్షాకాలంలో రొమ్ముల్లో నొప్పి, చనుమొనలు ఎరుపెక్కి దురద పెట్టడం.. వంటి సమస్యలు వీరిలో ఎక్కువగా వస్తుంటాయి. దీనికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. అందులోనూ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. ఈ సీజన్‌లో హ్యుమిడిటీ స్థాయులు ఎక్కువగా ఉండడం, వాతావరణం తడిగా ఉండడం వల్ల ఈ తరహా ఇన్ఫెక్షన్ దాడి చేసే అవకాశం ఎక్కువంటున్నారు. అలాగే శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయులు పెరగడం, గర్భ నిరోధక మాత్రలు, రక్తహీనత.. వంటివి కూడా ఇన్ఫెక్షన్ రావడానికి దోహదం చేస్తాయట!
ఈ లక్షణాలతో గుర్తించచ్చు!
పాలిచ్చే తల్లులు ఈ లక్షణాలతో సమస్యను గుర్తించచ్చంటున్నారు నిపుణులు.
❖ చనుమొనలు దురదగా అనిపించడం, మంట పుట్టడం..
❖ ఆ భాగంలో చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పగుళ్లు రావడం..
❖ బిడ్డకు పాలిచ్చే క్రమంలో తీవ్రమైన నొప్పి..
❖ రొమ్ములు సున్నితంగా మారి నొప్పి పుట్టడం..
ఇలా మీరు ఇన్ఫెక్షన్‌తోనే పాపాయికి పాలివ్వడం వల్ల అది వారి నోటిలోకీ ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో బిడ్డ నాలుకపై తెల్లటి పొరలాగా ఏర్పడడం, పెదాలు-బుగ్గల లోపలి భాగంలో తెల్లటి చుక్కల్లా కనిపించడం, జననేంద్రియాల వద్ద ఎరుపు రంగు ర్యాషెస్‌లా ఏర్పడడం.. వంటి లక్షణాల్ని గుర్తించచ్చు.
హానికరం కాకపోయినా..!
అయితే ఇది తల్లీపిల్లలిద్దరిలో హానికరమైన ఇన్ఫెక్షన్ కాకపోయినా.. సకాలంలో డాక్టర్‌ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలంటున్నారు నిపుణులు. దాంతో పాటు పలు జాగ్రత్తలు కూడా పాటించడం ముఖ్యమంటున్నారు.
❖ పాలివ్వడానికి ముందు, పాలిచ్చాక రొమ్ముల్ని శుభ్రపరచుకోవాలి.. అలాగే ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
❖ ఒకవేళ బ్రెస్ట్ పంప్ వాడినట్లైతే దాన్ని వేడి నీళ్లతో శుభ్రంగా కడగడం మంచిది.
❖ పాలిచ్చే ముందు, తర్వాత.. పాపాయికి డైపర్ మార్చే ముందు, తర్వాత.. చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవాలి.
❖ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రొమ్ములకు గాలి తగిలేలా, వదులుగా-సౌకర్యవంతంగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
❖ అలాగే వేసుకునే దుస్తుల్ని కూడా వేడి నీళ్లు, బ్లీచ్‌తో శుభ్రం చేయాలి.
❖ పిల్లలు నోట్లో పెట్టుకునే ప్యాసిఫైయర్స్, బొమ్మలు ఎప్పటికప్పుడు వేడి నీళ్లతో శుభ్రం చేయాలి. అలాగే వీటిని రెండు వారాలకోసారి మార్చడం మరీ మంచిది.
వీటితో పాటు ఇన్ఫెక్షన్ తగ్గే దాకా మీరు, మీ పాపాయి నిర్ణీత వ్యవధుల్లో నిపుణుల వద్ద చెకప్స్ చేయించుకోవడం కూడా ముఖ్యమే. తద్వారా తల్లీబిడ్డలిద్దరూ సమస్య నుంచి త్వరగా బయటపడగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.