పెట్టుడు కాలే.. అయినా ఆగని పరుగు! 

‘పెద్దయ్యాక ఏదేదో కావాలని చిన్నప్పుడు కలలు కంటాం.. వాటిని చేరుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన జీవితం’ అంటున్నారు అమెరికాకు చెందిన అమీ పాల్మెరో వింటర్స్. చిన్నతనంలో కారు ప్రమాదంలో తన ఎడమ కాలిని పోగొట్టుకున్న ఆమె.. ‘నా తలరాత ఇంతే!’ అని బాధపడలేదు. పడిలేచిన కెరటంలా పరుగును తన ఆరో ప్రాణంగా మార్చుకుంది. పెట్టుడు కాలితోనే పలు మారథాన్‌లలో పాల్గొని పదికి పైగా ప్రపంచ రికార్డులు తన పేరిట లిఖించుకుంది.

Updated : 17 Aug 2021 19:59 IST

(Photo: Guinness world records)

‘పెద్దయ్యాక ఏదేదో కావాలని చిన్నప్పుడు కలలు కంటాం.. వాటిని చేరుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన జీవితం’ అంటున్నారు అమెరికాకు చెందిన అమీ పాల్మెరో వింటర్స్. చిన్నతనంలో కారు ప్రమాదంలో తన ఎడమ కాలిని పోగొట్టుకున్న ఆమె.. ‘నా తలరాత ఇంతే!’ అని బాధపడలేదు. పడిలేచిన కెరటంలా పరుగును తన ఆరో ప్రాణంగా మార్చుకుంది. పెట్టుడు కాలితోనే పలు మారథాన్‌లలో పాల్గొని పదికి పైగా ప్రపంచ రికార్డులు తన పేరిట లిఖించుకుంది. ఇప్పుడు అదే పరుగుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించి అవయవ లోపం విజయానికి అడ్డు కాదని నిరూపించింది. ఆమె గెలుపు కథే ఇది!

పెన్సిల్వేనియాలోని మెడ్‌విల్లేలో 1972లో జన్మించింది అమీ. చిన్నతనం నుంచి పరుగునే తన ఆరో ప్రాణంగా భావించిన ఆమె.. పెరిగి పెద్దయ్యే కొద్దీ అందులోనే ఆరితేరింది. యుక్త వయసు నుంచే పలు పరుగు పోటీల్లో పాల్గొన్న ఆమెకు తన 22 ఏళ్ల వయసులో అనుకోని ప్రమాదం ఎదురైంది. బైక్‌పై వెళ్తున్న తనను కారు వేగంగా ఢీకొట్టడంతో తన ఎడమ కాలు నుజ్జునుజ్జయింది. మోకాలి కింది భాగాన్ని పూర్తిగా కోల్పోయిన ఆమె.. మూడేళ్ల పాటు మంచానికే పరిమితమైంది.

పరిగెత్తలేవన్నారు!

సాఫీగా, మనం అనుకున్నట్లుగా సాగితే అది జీవితం ఎందుకవుతుందంటోంది అమీ. ‘బాల్యంలో ఉన్నప్పుడు మన ముందు ఎన్నో ఆప్షన్లుంటాయి. పోలీసాఫీసర్‌ కావాలని, మిలిటరీలో చేరాలని, ఒలింపియన్‌గా పేరు తెచ్చుకోవాలని, గిన్నిస్‌ రికార్డు సాధించాలని.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కల గంటారు. అలా నేను పరుగంటే ప్రాణం పెంచుకున్నా. కానీ ఎప్పుడైతే నేను కారు ప్రమాదానికి గురయ్యానో అప్పుడు నా కలలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి.

పరుగుపై నాకున్న తపన చూసి వైద్యులు కూడా నా కాలు తిరిగి తీసుకు రావాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ అదృష్టం కలిసిరాలేదు. ఇక నేను పరిగెత్తలేనని తేల్చి చెప్పారు. అలా మూడేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యా. ఈ క్రమంలో 25 పైగా ఆపరేషన్లయ్యాయి. ఫిజికల్‌ థెరపీ, రీహ్యాబిలిటేషన్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించడానికి చికిత్సలు తీసుకున్నా. బహుశా నాలో ఉన్న తపనే తిరిగి నేను నడిచేలా చేసిందేమో అనిపిస్తోంది..’ అంటోంది అమీ.

పెట్టుడు కాలితో ట్రాక్ పైకి..!

ప్రమాదవశాత్తూ ఎడమ కాలిని కోల్పోయిన ఆమె మూడేళ్ల పాటు మంచానికే పరిమితమైనా పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది. తనలో ఉన్న తపనతో తిరిగి నెమ్మదిగా నడవడం మొదలుపెట్టిన అమీ.. ఈ క్రమంలో ప్రోస్థటిక్‌ కాలిని ఎంచుకుంది. పెట్టుడు కాలితోనే మారథాన్స్‌, ట్రయథ్లాన్స్‌, పారా ట్రయథ్లాన్స్‌, అల్ట్రా మారథాన్స్‌, ఐరన్‌మ్యాన్‌ ట్రయథ్లాన్స్‌.. వంటి పోటీల్లో పాల్గొంది.

పదికి పైగా ప్రపంచ రికార్డులు!

అవయవ లోపం తన విజయానికి అడ్డు కాదని తెలుసుకున్న అమీ.. ఆపై తనకు అనువుగా, సౌకర్యవంతంగా ఉండేలా మరో ప్రోస్థటిక్‌ కాలిని తయారుచేయించుకుంది. ఆ కాలిని ధరించే పదికి పైగా ప్రపంచ రికార్డులు తన పేరిట లిఖించుకుందీ అమెరికన్‌ మామ్‌. 2006లో న్యూయార్క్‌ సిటీ మారథాన్‌, చికాగో మారథాన్‌లలో తక్కువ సమయంలో లక్ష్యాన్ని చేరుకొని చరిత్ర సృష్టించిన ఆమె.. అదే సమయంలో అల్ట్రామారథాన్‌లకు ఉన్న డిమాండ్‌ను గ్రహించి తన దృష్టిని అటు వైపు మళ్లించింది.

అలా గిన్నిస్‌కెక్కింది!

2010లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 123.99 మైళ్లు పరిగెత్తి మహిళల విభాగంలో 18వ స్థానంలో నిలిచిన అమీ.. అదే ఏడాది ‘వెస్ట్రన్‌ స్టేట్స్ ఎండ్యురన్స్ రన్‌’లో వంద మైళ్ల రన్నింగ్‌ రేస్‌ పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన తొలి యాంప్యూటీగా రికార్డు సృష్టించింది. ‘బ్యాడ్‌వాటర్‌ అల్ట్రా మారథాన్‌’, ‘మారథాన్‌ డెస్‌ సేబుల్స్‌’.. వంటి పోటీల్ని పూర్తిచేసిన తొలి మహిళా యాంప్యూటీగానూ పలు రికార్డులు కైవసం చేసుకుంది.

ఇలా పెట్టుడు కాలితో పరుగులో ఇప్పటికే అనితర సాధ్యమైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న అమీ.. ఇటీవలే అత్యుత్తమమైన గిన్నిస్‌ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వంద మైళ్ల (160 కిలోమీటర్ల) దూరాన్ని 21:43:29 గంటల పాటు ట్రెడ్‌మిల్‌పై.. వేగంగా, అదీ ప్రోస్థటిక్‌ కాలితో పరిగెత్తి గిన్నిస్‌ రికార్డు (Impairment Records Initiative విభాగంలో)ను తన వశం చేసుకుంది అమీ. మధ్యమధ్యలో హెల్దీ డ్రింక్స్‌, కార్బోహైడ్రేట్స్‌, ఎనర్జీ బార్స్‌ తీసుకుంటూ శక్తిని కూడగట్టుకుంటూ ముందుకు సాగిందామె. కండరాల నొప్పులు, డీహైడ్రేషన్‌.. వంటి సమస్యలు వేధిస్తున్నా తన పట్టుదలతో వాటన్నింటినీ అధిగమించి తాజాగా గిన్నిస్కెక్కిందీ అమెరికన్‌ అథ్లెట్.

సేవలోనూ మిన్నే!

ప్రమాదం తర్వాత పరుగు ప్రారంభించిన కొన్నేళ్లకు ‘వన్‌ స్టెప్‌ ఎహెడ్‌ ఫౌండేషన్‌’ను స్థాపించిన అమీ.. దీని ద్వారా అవయవ లోపాలున్న చిన్నారులు అథ్లెటిక్స్‌లో రాణించేందుకు కృషి చేస్తోంది. తన ప్రతిభకు గుర్తింపుగా 2010లో ‘జేమ్స్‌ ఇ. సులివన్‌ అవార్డు’, ‘ఈఎస్‌పీవై అవార్డు’.. వంటి ఎన్నో పురస్కారాల్ని సైతం అందుకుందామె.

ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లైన అమీ.. తన 48వ ఏట తాజాగా సాధించిన గిన్నిస్‌ రికార్డుతో మరోసారి వార్తల్లో నిలిచింది. ‘వయసు విజయానికి అడ్డు కాదు.. అది కేవలం సంఖ్య మాత్రమే!’ అంటూ అందరి చేతా ప్రశంసలందుకుంటోందీ రన్నింగ్‌ క్వీన్.

హ్యాట్సాఫ్‌ అమీ!

ఆ రికార్డు తనదే!

* 2004లో ఐదు నెలల గర్భంతో ‘సిల్వర్‌ స్ట్రాండ్‌ మారథాన్‌’లో పాల్గొన్న ఆమె.. ఆ పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆ మరుసటి ఏడాది న్యూయార్క్‌లో నిర్వహించిన ట్రయథ్లాన్‌ పోటీల్లో మూడోస్థానంలో, హవాయ్‌లో జరిగిన ‘ట్రయథ్లాన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో విజేతగా నిలిచింది. ఈ విజయాలు తనకు కొత్త ఉత్సాహాన్ని అందించాయని.. అప్పట్నుంచి పరుగుపై మరింత దృష్టి పెట్టానంటోందీ గ్రేట్‌ అథ్లెట్.

* ఏడాది కాలంలో (2009-10 మధ్యలో) సుమారు పదికి పైగా అల్ట్రామారథాన్‌లలో పాల్గొంది అమీ. 2009లో ‘హార్ట్‌ల్యాండ్‌ 100 మైల్‌’ ఈవెంట్‌లో మహిళల్లో తొలి స్థానం దక్కించుకున్న ఆమె.. అదే ఏడాది ‘అరిజోనా రోడ్‌ రేసర్స్‌ రన్‌’, ‘ఫ్యూచర్‌ ట్వంటీ ఫోర్‌ అవర్‌ రేస్‌’లలో మొత్తంగా (స్త్రీపురుషులిద్దరిలో) మొదటి స్థానం దక్కించుకుంది. ఇలా అవయవ లోపంతో అల్ట్రా మారథాన్‌ గెలిచిన తొలి వ్యక్తిగా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది అమీ. తన అత్యుత్తమ ప్రదర్శనకు గుర్తుగా ఇంటర్నేషనల్‌ అసోసియేషన్ ఆఫ్‌ అల్ట్రా రన్నర్స్‌ (IAU).. ‘IAU 24 Hour Ultramarathon World Championships’లో పాల్గొనబోయే యూఎస్‌ అల్ట్రా రన్నింగ్‌ టీమ్‌కు అమీ పేరు పెట్టి గౌరవించింది. ఈ ఘనత దక్కించుకున్న తొలి యాంప్యూటీ కూడా అమీనే కావడం విశేషం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్