Published : 01/01/2022 20:26 IST

నెరిసిన జుట్టుతో ‘సిల్వర్‌’ స్టార్‌ అయిపోయింది!

(Photo: Instagram)

ఒక్క తెల్ల వెంట్రుక కనిపిస్తేనే ఉసూరుమంటాం.. వెంటనే రంగేసుకొని నలుగురికీ కనిపించకుండా దాచేస్తుంటాం. పదమూడేళ్లుగా తానూ ఇదే చేశానంటోంది రాజస్థాన్‌కు చెందిన అంజనా దుబే. పన్నెండేళ్ల వయసులో నెరిసిన జుట్టుతో ఆత్మన్యూనతకు గురైన ఆమె.. అప్పట్నుంచి హెయిర్‌ కలర్‌తోనే ఆ విషయాన్ని దాచే ప్రయత్నం చేసింది. అయితే ‘లేటుగానైనా లేటెస్ట్‌గా చెప్పినట్లు’.. కాస్త ఆలస్యంగానైనా ‘జుట్టుకు రంగు ఎందుకెయ్యాలి? ఇలా ఉంటే తప్పేంటి?’ అన్న విషయం గ్రహించిందామె. అలా గత మూడేళ్లుగా తెల్ల జుట్టుతో దిగిన ఫొటోలు పోస్ట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఎన్నో విమర్శల్ని సైతం ఎదుర్కొంది అంజన. అప్పుడే తనలా ప్రతికూలతలు ఎదుర్కొంటోన్న వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటుచేసి ‘ఎలా ఉన్నా తమను తాము ప్రేమించుకోవాల’న్న సందేశాన్ని చాటుతోంది. మరి, ఈ ‘గ్రే హెయిర్‌ బ్యూటీ’ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోయిన వాళ్లను చాలామందిని చూస్తుంటాం. అయితే ఇందుకు పోషకాహార లోపం, మెలనిన్‌ స్థాయులు తగ్గిపోవడమే కారణం అనుకుంటాం. కానీ జన్యుపరంగానూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉందంటున్నారు అంజన. ఇందుకు తానే ఉదాహరణ అని చెబుతున్నారు.

12 ఏళ్లు కూడా నిండకముందే..!

‘అప్పుడు నాకు 12 ఏళ్లుంటాయనుకుంటా.. నల్లగా నిగనిగలాడుతూ ఉండాల్సిన నా కేశాలు క్రమక్రమంగా నెరిసిపోవడం గమనించాను. ఆ సమయంలో నాకు తెలిసిందల్లా ఒక్కటే.. వృద్ధాప్యంలో తెల్ల జుట్టు రావడం సహజం. కానీ ఇంత చిన్న వయసులో ఈ సమస్య వచ్చిందంటే నాలో ఏదో లోపం ఉందని అనుకునేదాన్ని. ఆత్మ న్యూనతకు గురయ్యేదాన్ని. నన్నిలా చూసి ఈ సమాజం అంగీకరించదని.. దాన్ని హెన్నాతో దాచే ప్రయత్నం చేశా. నిజానికి హెన్నా వల్ల కొంత ఉపశమనమైతే పొందగలిగా.. కానీ సంతృప్తి మాత్రం కలగలేదు. అందుకే కొన్నాళ్ల తర్వాత కలర్‌ వేసుకోవడం ప్రారంభించా. అలా సుమారు 13 ఏళ్ల పాటు హెయిర్‌ కలర్‌తోనే ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించకుండా జాగ్రత్తపడేదాన్ని.

కారణమదేనని గ్రహించా!

ఇలా ఎంతసేపూ ఇతరుల మాటల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నించానే తప్ప.. అసలు ఈ సమస్యకు కారణమేంటన్న ఆలోచన చేయలేదు. నాకు తెలిసినంత వరకు పోషకాహార లోపం, శరీరంలో మెలనిన్‌ స్థాయులు తగ్గిపోవడం వల్ల తెల్ల జుట్టు వస్తుందని నమ్మాను. అయితే ఇది జన్యుపరంగా/వంశపారంపర్యంగా కూడా వస్తుందన్న విషయం ఆ తర్వాత గానీ నాకు తెలియలేదు. మా నాన్నకు కూడా చిన్న వయసులోనే ఈ సమస్య ఎదురైందట! ఆ జీన్సే నాకు వచ్చాయనుకుంటా! ఇలా కృత్రిమ రంగుతో జుట్టును దాచుకోవడంతోనే 13 ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఈ అలవాటుతో నాకు విసుగొచ్చిందో లేదంటే బోర్‌ కొట్టిందో తెలియదు గానీ.. మూడేళ్ల క్రితం ఉన్నట్లుండి ఒక రోజు.. ‘జుట్టుకు రంగేసుకోవడం ఆపేస్తే ఏమవుతుంది?’ అన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా దాన్ని ఆచరణలో పెట్టాను. ఒకటి కాదు, రెండు కాదు మూడుసార్లు ఇలా ఆపేయడం, ధైర్యం చాలక తిరిగి వేసుకోవడం.. చేశాను.

వాళ్లిద్దరే నా బూస్టర్స్!

ఇక ఆఖరికి ఏదైతే అదైందని జుట్టుకు రంగేసుకోవడం ఆపేశాను. ఈ క్రమంలోనే జుట్టు నెరిసిపోయినా నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన కొంతమంది మహిళల కథలను చదివాను. అప్పుడు నాకు మరింత ధైర్యమొచ్చింది. అయితే ఇది నేను కావాలని చేసుకున్నది కాదు.. అలాంటప్పుడు ఎవరో ఏదో అంటారని భయపడి నన్ను నేను నిందించుకోవడంలో అర్థం లేదనిపించింది. ఈ క్రమంలోనే నన్ను నేను ప్రేమించుకోవడం, ఎలా ఉన్నా అంగీకరించడం నేర్చుకున్నా. నిజానికి తమ లోపాల్ని ప్రత్యేకతలుగా భావించి.. అంగీకరించుకోవడమంటే ఎంత కష్టమో అప్పుడు నాకు తెలిసింది. నాలో ఈ మార్పు రావడానికి మా వారి మద్దతు కూడా ఉంది. ఇక నా కూతురైతే.. ‘అమ్మా.. నీ జుట్టు నాకు నచ్చింది.. నన్ను నీలా రడీ చేయవూ!’ అనేది.. తన ముద్దుముద్దు మాటలు విని ఒక్కోసారి నవ్వొచ్చినా.. నాపై నాకు నమ్మకం మరింతగా పెరిగేది.

‘రంగేసుకో.. చూడలేకపోతున్నాం..’ అనే వారు!

ఇలా నన్ను నేను అంగీకరించడం మొదలుపెట్టాక.. నెరిసిన జుట్టుతోనే నా చుట్టూ ఉన్న వారితో కలవడం, ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ప్రారంభించా. అయితే కొంతమంది నన్ను ప్రశంసిస్తే.. మరికొంతమంది మాత్రం విమర్శించేవారు. ‘జుట్టు నెరిసిపోయే వయసు కాదు మీది.. రంగేసుకోండి!’, ‘ముందు మీ జుట్టుకు డై వేసుకోండి.. ఇలా చూడలేకపోతున్నాం!’ అంటూ.. ఇదేదో నా తప్పైనట్లు మాట్లాడేవారు. ముందు కాస్త బాధగా అనిపించినా.. ఆ తర్వాత అలాంటి మాటలు పట్టించుకోవడం మానేశా. ఇలా నేనొక్కదాన్నే కాదు.. ఈ విషయంలో చాలామంది సమాజం నుంచి ఒత్తిళ్లు, విమర్శల్ని ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకున్నా. అందుకే వారిలో స్ఫూర్తి నింపడానికి, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి ‘Sparkling Silvers’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించా.

నెరిసిన జుట్టుతోనూ మెరిసిపోవచ్చు!

ఈ పేరుతో ప్రస్తుతం వెబ్‌సైట్‌, ఇన్‌స్టా పేజీ, యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నా. నెరిసిన జుట్టుతో ఇబ్బందులు పడుతోన్న మహిళలెవరైనా సరే.. తమ కథను ఈ వేదికగా పంచుకోవచ్చు.. తద్వారా ఇతరుల్లో స్ఫూర్తి నింపచ్చు. అంతేకాదు.. నల్లగా నిగనిగలాడే జుట్టుంటేనే ఎలాంటి హెయిర్‌స్టైల్‌ వేసుకున్నా అందంగా ఉంటారనుకుంటారు చాలామంది. కానీ తెల్ల జుట్టుతోనూ విభిన్న హెయిర్‌స్టైల్స్‌ ప్రయత్నించి మెరిసిపోవచ్చు..’ అంటూ చెప్పుకొచ్చింది అంజన. తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ వేదికగా నెరిసిన జుట్టు సంరక్షణ చిట్కాలు చెబుతూనే.. ఇలాంటి ఎంతోమంది మహిళలతో మాట్లాడుతూ, వాళ్ల ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ.. ఇతర మహిళల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోందామె. మరోవైపు ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణిగానూ తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తోంది అంజన.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని