Aditi Swami: పదిహేడేళ్లకే.. ఆర్చరీలో ప్రపంచ ఛాంపియన్!

ఇటీవలే ముగిసిన ‘ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌’లో బంగారు పతకం కైవసం చేసుకున్న అదితీ స్వామి.. ‘అతిపిన్న ప్రపంచ ఛాంపియన్‌’గా అవతరించింది. అంతేకాదు.. ఈ టోర్నీలో ‘వ్యక్తిగత కాంపౌండ్‌’ విభాగంలో పసిడి గెలుచుకున్న తొలి భారతీయురాలిగానూ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ యువ ఆర్చర్‌ స్ఫూర్తి ప్రయాణం మీకోసం..!

Published : 08 Aug 2023 18:31 IST

చాలామంది ఆటలంటూ కొట్టిపారేస్తారు కానీ.. పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడలో ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారు. తాజాగా ఇదే విషయం నిరూపించింది మహారాష్ట్రకు చెందిన అదితీ స్వామి. చిన్నతనం నుంచే విలువిద్యపై మక్కువ చూపిన అదితిని.. తన తండ్రి ఇదే దిశగా ప్రోత్సహించారు. ఒకానొక దశలో ఆర్చరీ కిట్‌ కొనడానికి, టోర్నమెంట్లకు హాజరవడానికి డబ్బులు సరిపోక.. రుణం తీసుకొని మరీ అదితిని ప్రోత్సహించారాయన. ఇలా తన తండ్రి కష్టానికి, తన కృషికి ప్రతిఫలంగా తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది అదితి. ఇటీవలే ముగిసిన ‘ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌’లో బంగారు పతకం కైవసం చేసుకున్న ఆమె.. ‘అతిపిన్న ప్రపంచ ఛాంపియన్‌’గా అవతరించింది. అంతేకాదు.. ఈ టోర్నీలో ‘వ్యక్తిగత కాంపౌండ్‌’ విభాగంలో పసిడి గెలుచుకున్న తొలి భారతీయురాలిగానూ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ యువ ఆర్చర్‌ స్ఫూర్తి ప్రయాణం మీకోసం..!

మహారాష్ట్రలోని సతారా జిల్లాకు దగ్గర్లోని ఓ గ్రామంలో పుట్టింది అదితి. ఆమె తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వోద్యోగులే! అదితి తండ్రి గోపీచంద్‌ అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు ఆటలంటే చాలా ఇష్టం. ఇదే ఆసక్తి తన కూతురిలోనూ ఉందన్న విషయం గ్రహించారాయన. ఈ క్రమంలోనే ఆమెకు నచ్చిన క్రీడాంశంలో ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు.

అలా ఆర్చరీపై కన్నుపడింది!

అయితే అదితిని ఆటల్లో ప్రోత్సహించాలంటే.. మంచి క్రీడా నైపుణ్యాలు అందించే స్పోర్ట్స్‌ అకాడమీలో చేర్పించాలి. కానీ గ్రామంలో ఈ సౌకర్యాలేవీ ఉండవు. అందుకే తామున్న గ్రామం నుంచి సతారా జిల్లాకు తన తండ్రి మకాం మార్చారంటోంది అదితి.

‘అప్పుడు నాకు 12 ఏళ్లు. సతారాలో స్థిరపడ్డాక తరచూ నాన్న నన్ను అక్కడి షాహూ స్టేడియంకు తీసుకెళ్లేవారు. అక్కడ చాలామంది పిల్లలు ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, క్రికెట్‌ తదితర ఆటలాడుతూ కనిపించేవారు. మరోవైపు కొన్ని క్రీడల్లో చిన్నారులు శిక్షణ తీసుకుంటుంటే ఆసక్తిగా గమనించేదాన్ని. అలా స్టేడియం ఓ మూలన ఓ బృందం విలువిద్య సాధన చేయడం చూశా. లక్ష్యానికి గురిపెట్టి బాణం వేయడం, వాళ్ల ఏకాగ్రతను చూసి ముగ్ధురాలినయ్యా. నేనూ ఆర్చరీ నేర్చుకుంటానని నాన్నకు చెప్పా. అయితే నేను ముందు నుంచీ కాస్త సన్నగా ఉంటా. అందుకే శారీరక దారుఢ్యంతో సంబంధం లేకుండా ఈ క్రీడలోనైతే నేను బాగా రాణించగలననిపించింది..’ అంటోన్న ఈ యువ ఆర్చర్‌.. తన తండ్రి ప్రోత్సాహంతో అక్కడి ‘దృష్టి ఆర్చరీ అకాడమీ’లో శిక్షణలో చేరింది.

రూ. 10 లక్షల రుణంతో..!

అకాడమీ కోచ్‌ ప్రవీణ్‌ సావంత్‌ శిక్షణలో ఆరితేరిన అదితి.. అటు స్కూల్ మిస్సవ్వకుండానే ఇటు ఆర్చరీ సాధన చేసేది. ‘రోజూ స్కూల్‌ పూర్తయ్యాక మూడు గంటలు, వారాంతాల్లో ఐదు గంటలు విలువిద్య సాధన చేసేదాన్ని. మరోవైపు నాన్న కూడా ప్రముఖ ఆర్చర్లకు సంబంధించిన వీడియోలు చూపించి నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచారు. అయితే అడ్వాన్స్‌డ్‌ శిక్షణ కోసం ప్రొఫెషనల్‌ కిట్‌ కావాల్సి వచ్చింది. దీనికి సుమారు రూ. 3 లక్షలకు పైగా ఖర్చవుతుంది. అంత డబ్బు నాన్న దగ్గర లేకపోవడంతో బ్యాంకులో రుణం తీసుకున్నారు. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడానికీ మరో రూ. 7 లక్షల దాకా రుణాలు తీసుకోవాల్సి వచ్చింది..’ అంటోన్న అదితి.. కరోనా సమయంలోనూ తన ఇంటి ఆవరణలోనే విలువిద్య సాధన చేయడానికి కావాల్సిన సకల సదుపాయాలు సమకూర్చుకొని మరీ సాధన చేసింది.

ఒక్క టోర్నీ.. రెండు ఘనతలు!

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీ పడుతూ.. పలు పతకాలు సాధించిన అదితి.. తన ఆర్చరీ నైపుణ్యాల్నీ క్రమంగా పెంచుకుంటూ పోయింది. రెండు నెలల క్రితం ‘జూనియర్‌ వరల్డ్‌ టైటిల్‌’ నెగ్గిన ఆమె.. ఇటీవల ముగిసిన ‘ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌’లోనూ సత్తా చాటింది. ఈ పోటీల్లో పసిడి నెగ్గి.. అతిపిన్న వయసులో ‘ప్రపంచ ఛాంపియన్‌’గా అవతరించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిందామె. అంతేకాదు.. ఈ టోర్నీలో ‘వ్యక్తిగత కాంపౌండ్‌’ విభాగంలో పసిడి నెగ్గిన తొలి భారతీయురాలిగానూ గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఇదే టోర్నీలో ‘విమెన్స్‌ కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌’లోనూ బంగారు పతకం సాధించింది అదితి. దీంతో ఈ పోటీల్లో రెండు పసిడి పతకాల్ని తన ఖాతాలో వేసుకుందీ యువ ఆర్చర్.

‘అమ్మానాన్నలు నా క్రీడా కెరీర్‌ కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ల కష్టాన్ని వమ్ము చేయకుండా.. ఆర్చరీలో నా శాయశక్తులా రాణించడానికి కృషి చేస్తా.. దేశానికీ పేరు తీసుకొస్తా. నా తర్వాతి లక్ష్యం ఆసియా క్రీడలే!’ అంటోంది అదితి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని