తాబేళ్లను సంరక్షిస్తూ ‘ఎర్త్‌ హీరో’ అయ్యింది!

‘ఒక పని పూర్తి చేసే క్రమంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ లక్ష్యం గొప్పదైనప్పుడు వీటిని అధిగమించడం పెద్ద విషయం కాదం’టోంది ఉత్తరప్రదేశ్‌కి చెందిన అరుణిమా సింగ్‌. పర్యావరణం, జలచరాల సంరక్షణ అంటే ప్రాణం పెట్టే ఆమె.. తన జీవితాన్ని ఇలాంటి సముద్ర జీవుల పరిరక్షణకే అంకితం చేసింది.

Updated : 19 Nov 2021 18:41 IST

(Photo: Instagram)

‘ఒక పని పూర్తి చేసే క్రమంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ లక్ష్యం గొప్పదైనప్పుడు వీటిని అధిగమించడం పెద్ద విషయం కాదం’టోంది ఉత్తరప్రదేశ్‌కి చెందిన అరుణిమా సింగ్‌. పర్యావరణం, జలచరాల సంరక్షణ అంటే ప్రాణం పెట్టే ఆమె.. తన జీవితాన్ని ఇలాంటి సముద్ర జీవుల పరిరక్షణకే అంకితం చేసింది. ఈ క్రమంలోనే తాబేళ్లు, మొసళ్లు, డాల్ఫిన్లు అంతరించిపోకుండా, వాటి అక్రమ రవాణాకు అడ్డుపడుతూ ఎన్నో మూగ జీవాల ప్రాణాలు నిలుపుతోంది. ఇలా తన కృషిని గుర్తించిన ‘నాట్‌వెస్ట్ గ్రూప్‌ ఇండియా’ ఇటీవలే అరుణిమను ‘ఎర్త్‌ హీరో’ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో ఈ నేచర్‌ లవర్‌ తన లక్ష్యం గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

అరుణిమా సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని మలిహాబాద్‌. అక్కడికి దగ్గర్లోనే గోమతి నది ఉంది. పచ్చని ప్రకృతిపై ప్రేమతో, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి.. చిన్నతనంలో తరచూ తన గ్రాండ్‌ పేరెంట్స్‌తో కలిసి ఆ నది వద్దకు వెళ్లేదామె. అందులోని తాబేళ్లు, మొసళ్లు, ఇతర జలచరాలను దగ్గర్నుంచి గమనించేది. ఈ క్రమంలోనే తనకు తెలియకుండానే వాటిపై ఇష్టాన్ని పెంచుకుంది అరుణిమ. అయితే ఒకదశలో అవి అంతరించిపోతున్నాయని గుర్తించిన ఆమె.. ఎలాగైనా వాటిని సంరక్షించాలని నిర్ణయించుకుంది.

పార్ట్‌టైమ్‌గా మొదలై..!

‘2010లో లైఫ్‌ సైన్స్‌ విభాగంలో మాస్టర్స్‌ చదివేటప్పుడు జలచరాల సంరక్షణ దిశగా తొలి అడుగు వేశాను. ఈ క్రమంలోనే Turtle Survival Alliance (TSA) లో చేరి పలు సేవా కార్యక్రమాల్లో భాగమయ్యాను. వన్యప్రాణి సంరక్షణపై లక్నో యూనివర్సిటీ వేదికగా ఏర్పాటుచేసిన ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాను. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ అటవీ శాఖతో మమేకమై.. ఈ విషయాన్ని టీచర్లు, విద్యార్థులు, ప్రజల్లోకీ తీసుకెళ్లాను. జలచరాల సంరక్షణ గురించి పలు స్కూళ్లు, గ్రామాలు, నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. మరోవైపు మత్స్యకారులు, పోలీసు శాఖ వారినీ ఈ సెషన్స్‌లో భాగం చేసే వాళ్లం.. ఇలా తొలుత అటు చదువుకుంటూ.. ఇటు పార్ట్‌టైమ్‌గా మొదలైన ఈ సేవ.. రాన్రానూ ఫుల్‌టైమ్‌గా మారిపోయింది..’ అంటోంది అరుణిమ. ప్రస్తుతం TSA ఇండియా ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌గా కొనసాగుతోన్న ఆమె.. లక్నో యూనివర్సిటీలో ‘టర్టల్‌ ఎకాలజీ’ విభాగంలో పీహెచ్‌డీ చేస్తోంది.

వాటికి పునర్జన్మనిచ్చింది!

టీమ్‌ వర్క్‌తోనే ఏదైనా సాధ్యమంటోంది అరుణిమ.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ కో-ఆర్టినేటర్‌గా తన బృందంతో కలిసి ఎన్నో జలచరాల అక్రమ రవాణాను అడ్డుకొన్న ఆమె.. మరెన్నో సముద్ర జీవులకు ప్రాణ దానం చేసింది. ‘నేను, నా టీమ్‌తో కలిసి స్మగ్లింగ్‌కి గురైన ఎన్నో తాబేళ్లను కాపాడగలిగాను. ఇటీవలే సుమారు 300 పైచిలుకు తాబేళ్లను స్మగ్లర్లు గోమతి నది నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేశారు. వాటిని కాపాడి తొలుత నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో విడిచిపెట్టాం. ఆ తర్వాత మా పునరావాస కేంద్రంలో వాటికి పరీక్షలు నిర్వహించి.. తిరిగి గోమతి నదిలో వదిలిపెట్టాం. ఇలా ఇప్పటివరకు సుమారు 28 వేల తాబేళ్లు, 20 కి పైగా గంగానదిలోని డాల్ఫిన్లు, పదుల సంఖ్యలో మొసళ్లను సంరక్షించగలిగాం.. ఇదంతా టీమ్‌ వర్క్‌తోనే సాధ్యమైంది..’ అంటూ చెప్పుకొచ్చింది అరుణిమ.

‘ప్రకృతి రత్న’.. ‘ఎర్త్‌ హీరో’!

సుమారు దశాబ్ద కాలంగా జలచరాల సంరక్షణ కోసం పాటుపడుతోన్న అరుణిమను పలు అవార్డులు వరించాయి. ఆమె సేవల్ని గుర్తించిన ‘పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ’.. 2018లో నిర్వహించిన ‘నేచర్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ కాన్ఫరెన్స్‌’ వేదికగా ‘ప్రకృతి రత్న’ అవార్డుతో సత్కరించింది. ఇక తాజాగా ‘నాట్‌వెస్ట్‌ గ్రూప్‌ ఇండియా’.. ‘Save the Species’ విభాగంలో ‘ఎర్త్‌ హీరో’ పురస్కారాన్ని అందించింది.

ఇలా తన చేతలతోనే కాదు.. ‘జలచరాల్ని స్మగ్లర్ల నుంచి విడిపించే క్రమంలో పలు సవాళ్లు, బెదిరింపులు కూడా ఎదురయ్యేవి.. అయినా నేను అలాంటి వాటికి బెదరను. ఎందుకంటే ఎంచుకున్న లక్ష్యం గొప్పదైనప్పుడు.. ఇలాంటి సవాళ్లను ఎదిరించడం నాకో లెక్క కాదు..’ అంటూ తన మాటలతోనూ అందరిలో స్ఫూర్తి నింపుతోందీ ఎర్త్‌ హీరో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్