మొటిమలు, మచ్చలు పోవాలంటే..

ఇంట్లో సహజసిద్ధంగా లభించే శెనగపిండితో రకరకాల చర్మ సమస్యల్ని తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా?....

Updated : 24 Nov 2022 16:29 IST

ఇంట్లో సహజసిద్ధంగా లభించే శెనగపిండితో రకరకాల చర్మ సమస్యల్ని తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా?

మొటిమల నివారణకు..

మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? అయితే మీకు తెలిసిన ఏవో క్రీములు తెచ్చుకుని వాడకుండా ఇది ప్రయత్నించి చూడండి.. కాస్త శెనగపిండిని చందనం పేస్ట్‌లో కలుపుకొని మొటిమలపై రాస్తే సమస్య నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమంలో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల ముఖంపై మచ్చలేవైనా ఉంటే తొలగిపోతాయి.

చర్మతత్వాన్ని బట్టి..

జిడ్డు చర్మతత్వం గల వారికి ఎన్నిసార్లు ముఖం కడుక్కున్నా మళ్లీ కాసేపటి తర్వాత జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు.. నాలుగు చెంచాల శెనగపిండిలో ఒక చెంచా రోజ్‌వాటర్, రెండు చెంచాల తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిపోయే వరకు అలాగే ఉంచుకుని తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు.

కొంతమంది పొడి చర్మతత్వం గల వారు ఎన్ని మాయిశ్చరైజింగ్ క్రీములు రాసినా కాసేపటి తర్వాత తిరిగి పొడిగా తయారవుతుంది. మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. కాస్త శెనగపిండిలో మీగడ వేసి పేస్ట్‌లాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసుకుని కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది. ఈ మిశ్రమంలో ఆలివ్ నూనె లేదా బాదం నూనెను కూడా కలుపుకోవచ్చు.

మచ్చలు, ముడతలు మాయం..

వయసు పైబడుతున్న కొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడడం సహజం. అలాగే మొటిమల ద్వారా నల్లటి మచ్చలు పడడం కూడా కామనే. మరి ఈ సమస్యల్ని నివారించాలంటే ఏం చేయాలి? అని ఆలోచిస్తున్నారా.. ఆరు బాదం పప్పులను కొన్ని పాలలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ బాదం, పాలు రెండింటినీ మెత్తగా నూరుకోవాలి. దీనికి కాస్త శెనగపిండి, కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే క్రమంగా ముఖంపై ఉండే మచ్చలు మాయమవుతాయి.

చర్మం శుభ్రపడుతుంది..

ముఖ వర్ఛస్సును పెంపొందించి, మృదువైన చర్మాన్ని సొంతం చేయడంలో శెనగపిండి పాత్ర ఎంతో ఉంది. కాస్త శెనగపిండిని తీసుకుని అందులో కొద్దిగా పచ్చి పాలు, కాస్త నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల ముఖం కాంతివంతమవడంతో పాటు మృదువుగా మారుతుంది. అలాగే చర్మంపై పడిన దుమ్ము, ధూళి కూడా తొలగిపోయి శుభ్రపడుతుంది. ఈ మిశ్రమంలో పాలకు బదులుగా పెరుగు కూడా ఉపయోగించవచ్చు.

బిగుతైన చర్మానికి..

ఒక కోడిగుడ్డులోని తెల్లసొనని తీసుకుని దాన్ని బాగా కలపాలి. దీనిలో రెండు చెంచాల శెనగపిండి కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మం బిగుతుగా మారి నవయవ్వనంగా కనిపించే అవకాశం ఉంది.

అవాంఛిత రోమాలు తగ్గడానికి..

కొంతమందికి చర్మంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి శెనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీన్ని శరీరానికి పట్టించి కాసేపటి తర్వాత స్నానం చేస్తే క్రమంగా సమస్య తగ్గుతుంది.

ట్యాన్‌ను తొలగించుకోండిలా..

కాస్త శెనగపిండిలో చిటికెడు పసుపు, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల ట్యాన్ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అలాగే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్