Cannes Jury: దీపిక కంటే ముందు ఇంకెవరు?

కేన్స్‌ వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో రెడ్‌ కార్పెట్‌పై అలా నడవడమే ఓ అదృష్టమనుకుంటారు చాలామంది తారలు. అలాంటిది ‘గోల్డెన్‌ పామ్‌’ వంటి మేటి అవార్డుకు ఎంపికయ్యే చిత్రమేదో నిర్ణయించే జ్యూరీలో భాగమయ్యే అవకాశం వస్తే..? తాజాగా అలాంటి అరుదైన అవకాశాన్ని తన సొంతం చేసుకుంది....

Updated : 05 Jan 2024 15:19 IST

కేన్స్‌ వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో రెడ్‌ కార్పెట్‌పై అలా నడవడమే ఓ అదృష్టమనుకుంటారు చాలామంది తారలు. అలాంటిది ‘గోల్డెన్‌ పామ్‌’ వంటి మేటి అవార్డుకు ఎంపికయ్యే చిత్రమేదో నిర్ణయించే జ్యూరీలో భాగమయ్యే అవకాశం వస్తే..? తాజాగా అలాంటి అరుదైన అవకాశాన్ని తన సొంతం చేసుకుంది బాలీవుడ్‌ అందాల తార దీపికా పదుకొణె. మేలో జరగబోయే ఈ సినిమా పరేడ్‌ కోసం ఎంపిక చేసిన 8 మంది జ్యూరీ సభ్యుల్లో దీపిక ఒకరు. దీంతో ఈ అరుదైన ఆహ్వానం అందుకున్న ఈ ముద్దుగుమ్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో 75 ఏళ్ల కేన్స్‌ చరిత్రలో జ్యూరీలో భాగమైన భారతీయ సోయగాలెవరో తెలుసుకుందాం రండి..

దీపికా పదుకొణె

ఏటా కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొని.. రెడ్‌కార్పెట్‌పై తన ఫ్యాషన్‌ పరిమళాలు వెదజల్లే బాలీవుడ్‌ అందం దీపికా పదుకొణె.. ఈసారి మరో అడుగు ముందుకేసింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవ జ్యూరీలో సభ్యురాలిగా ఎంపికైంది. మే 17-28 వరకు జరగనున్న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా.. 21 చిత్రాలు పోటీ పడే ప్రతిష్టాత్మక ‘గోల్డెన్‌ పామ్‌’ పురస్కారాన్ని చిత్రోత్సవం ముగింపు సందర్భంగా ఏ చిత్రానికి ఇవ్వాలో నిర్ణయించి, వీరు అందిస్తారు. ఇదే విషయాన్ని అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించిన చిత్రోత్సవ నిర్వాహకులు.. నటిగా, నిర్మాతగా, సమాజ సేవకురాలిగా, బిజినెస్‌ ఉమన్‌గా దీపిక దేశానికి చేస్తోన్న సేవల్ని కొనియాడారు. హాలీవుడ్‌లోనూ తన ప్రతిభను నిరూపించుకొని దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన తీరును మరోసారి ప్రస్తావిస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఇటు దేశవ్యాప్తంగానూ చిత్రపరిశ్రమకు ఆమె చేస్తోన్న సేవల్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. ఇక తన ముద్దుల భార్య కేన్స్‌ జ్యూరీలో పాలుపంచుకోనుండడంతో రణ్‌వీర్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘వావ్‌’ అంటూ చప్పట్ల ఎమోజీని పోస్ట్‌ చేస్తూ ఆమెను ఛీర్‌ చేశాడీ హ్యాండ్‌సమ్‌ హబ్బీ. ప్రస్తుతం దీప్స్‌ షారుఖ్ సరసన ‘పఠాన్‌’, హృతిక్‌తో ‘ఫైటర్‌’తో పాటు ప్రభాస్‌తో మరో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.


విద్యా బాలన్

తన నటనతోనే కాదు.. అందం, సంప్రదాయ వస్త్రధారణతో అంతర్జాతీయంగా అభిమానుల్ని సంపాదించుకుంది బబ్లీ బ్యూటీ విద్యా బాలన్‌. ఎలాంటి సందర్భమైనా, వేడుకైనా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే డ్రస్సింగ్‌తో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. 2013 కేన్స్‌ చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యురాలిగా తొలిసారి పాల్గొంది. ఇందులో భాగంగా ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన విభిన్న లెహెంగాలు, చీరకట్టుతో సందడి చేసిందీ చక్కనమ్మ. ‘కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా పాల్గొనడం ఓ అరుదైన అవకాశం. అందులోనూ ఈ వేదికగా భారతీయ సంప్రదాయం ఉట్టిపడే దుస్తుల్ని ఎంచుకోవడం మరో గౌరవం. సాధారణంగానే ఏ వేడుకైనా ఇలాంటి దుస్తులకే ఓటేస్తుంటా. ఈ క్రమంలో ఇతరుల అభిప్రాయాలతో పనిలేకుండా నాకు సౌకర్యంగా, హుందాగా అనిపించిన అవుట్‌ఫిట్స్‌కే ప్రాధాన్యమిస్తుంటా..’ అంటూ ఆ సందర్భంలో తన మనోభావాల్ని పంచుకుంది విద్య. ఈ ఏడాది జల్సాతో సందడి చేసిన ఈ చక్కనమ్మ చేతిలో ప్రస్తుతం మరో ప్రాజెక్ట్‌ ఉంది.


షర్మిలా ఠాగూర్

సీనియర్‌ నటి షర్మిలా ఠాగూర్ 2009లో కేన్స్‌ చిత్రోత్సవ జ్యూరీ సభ్యురాలిగా ఆహ్వానం అందుకున్నారు. తన 14 ఏళ్ల వయసులోనే ‘ది వరల్డ్‌ ఆఫ్‌ అపూ’ అనే బెంగాలీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. ‘వఖ్త్‌’, ‘ఆరాధన’, ‘సఫర్‌’, ‘దాగ్‌’, ‘చుప్కే చుప్కే’.. వంటి సినిమాల్లో అగ్ర కథానాయకులతో కలిసి నటించారు. 2010 వరకు సినిమాల్లో కొనసాగిన ఆమె.. ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌’ ఛైర్‌పర్సన్‌గానూ సేవలందించారు. 2005లో ‘యునిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌’గానూ ఎంపికయ్యారు షర్మిల. క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీని పెళ్లి చేసుకున్న ఆమెకు సైఫ్‌, సోహా, సబా.. ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం సైఫ్‌, సోహా చిత్ర పరిశ్రమలో కొనసాగుతుండగా.. సబా జ్యుయలరీ డిజైనర్‌గా సక్సెసైంది.


నందితా దాస్

తన కెరీర్‌లో విభిన్న చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది నందితా దాస్‌. సుమారు 10 భాషల్లో 40 చిత్రాలకు పైగా నటించిన ఆమె తన నటనతో విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతేకాదు.. దర్శకురాలిగానూ సక్సెసైంది నందిత. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఫిరాఖ్’- టొరంటోతో పాటు 50కి పైగా చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవడం, 20కి పైగా అవార్డులు గెలుచుకోవడం విశేషం. మరోవైపు రచయిత్రిగానూ తనను తాను నిరూపించుకుందీ బాలీవుడ్‌ తార. ‘అండర్‌ ది బన్యన్‌’ పేరుతో పిల్లల కోసం ఓ ఆడియో బుక్‌ను కూడా తీసుకొచ్చిందామె. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనను తాను నిరూపించుకున్న నందిత.. 2005లో కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించింది.


ఐశ్వర్యారాయ్‌ బచ్చన్

కేన్స్‌ చిత్రోత్సవాల్లో భాగంగా 2002లో ‘దేవ్‌దాస్‌’ సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ కోసం ఈ వేడుకల్లో తొలిసారి మెరిసింది అందాల తార ఐశ్వర్యారాయ్‌. ఆ తర్వాత ఏడాదే కేన్స్‌ జ్యూరీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందుకుందీ చక్కనమ్మ. ఇక అప్పట్నుంచి తరచుగా ఈ చిత్రోత్సవాల్లో భాగమవడం.. రెడ్‌కార్పెట్‌పై విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులతో హొయలుపోవడం.. మనం చూస్తూనే ఉన్నాం. ‘కేన్స్‌ డెబ్యూలో భాగంగా.. నేను నటించిన దేవ్‌దాస్‌ చిత్రం ఇక్కడ ప్రదర్శితమైంది.. ఆ తర్వాత జ్యూరీ సభ్యురాలిగా అరుదైన అవకాశం అందుకున్నా.. క్రమంగా ఏటా ఈ ఫ్యామిలీని కలిసే అదృష్టం నాకు దక్కుతోంది. అందుకే దీన్ని నా రెండో ఇల్లుగా భావిస్తున్నా. ఈ అనుభవాలన్నీ నాకు మరపురాని మధుర జ్ఞాపకాలే!’ అంటూ అప్పట్లో తన అనుభవాలు పంచుకుంది ఐష్.
వీళ్లతో పాటు ‘సలామ్‌ బాంబే’ దర్శకురాలు మీరా నాయర్‌ - 1990లో, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ - 2000లో కేన్స్‌ జ్యూరీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్