Published : 30/04/2022 16:39 IST

పెట్టుడు కాలితోనే ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది!

(Photos: Instagram)

‘కృషి ఉంటే మనుషులు రుషులవుతార’న్నట్లు.. ‘పట్టుదల ఉంటే వైకల్యాన్ని అధిగమించైనా విజయం సాధిస్తార’ని నిరూపిస్తోంది అరిజోనాకు చెందిన అల్ట్రా మారథానర్‌ జాకీ హంట్. క్యాన్సర్‌ కారణంగా ఎడమ కాలు మోకాలి కింది భాగాన్ని కోల్పోయిన ఆమె.. పట్టుదలతో పరుగును తన కెరీర్‌గా ఎంచుకుంది. పెట్టుడు కాలితోనే పరుగు పోటీల్లో పాల్గొంటూ ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. అలా ఇటీవలే 102 రోజుల్లో 102 మారథాన్లు పూర్తిచేసింది జాకీ. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా యాంప్యుటీగా గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో ఈ మారథాన్‌ మామ్‌ సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి..

విధి విసిరే సవాళ్లకు ఎదురీదుతూ తమను తామే నిరూపించుకుంటుంటారు కొంతమంది. దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియాలో పుట్టిపెరిగిన జాకీ కూడా అదే కోవకి చెందుతారు. అందరిలాగే సాధారణ జీవితం సాగిస్తోన్న ఆమె జీవితం 26 ఏళ్ల వయసులో కుదుపుకి గురైంది. Ewing Sarcoma అనే అరుదైన క్యాన్సర్‌ (ఎముకల చుట్టూ ఏర్పడే క్యాన్సర్‌) బారిన పడిందామె. దీంతో అది ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా ఆమె ఎడమ కాలి మోకాలి కింది భాగం తొలగించాల్సి వచ్చింది.

డాక్టర్లు వద్దన్నా వినకుండా!

క్యాన్సర్‌ కారణంగా అంగ వైకల్యానికి గురైన జాకీని పరుగు, నడక.. వంటి వాటికి దూరంగా ఉండమన్నారు వైద్యులు. అయితే ఆ నిర్ణయం ఆమెకు నచ్చలేదు. ఎలాగైనా విధి తనకు విసిరిన సవాలును అధిగమించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కార్బన్‌ ఫైబర్‌ ప్రోస్థటిక్‌ కాలుని అమర్చుకుంది. ఇక అప్పటికే పలు మారథాన్లలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న తన భర్త ఎడ్విన్‌ను చూసి స్ఫూర్తి పొందానంటోంది జాకీ.

‘అంగవైకల్యంతో నా జీవితం మోడువారిపోవాలని నేను అనుకోలేదు. అందరిలాగే సాధారణంగా జీవించాలనుకున్నా. పెట్టుడు కాలు అమర్చుకున్నంత మాత్రాన నేను ఆత్మన్యూనతకు గురికావట్లేదు. సాధారణంగా అంగవైకల్యం ఉన్న వారి దగ్గర్నుంచి ఈ సమాజం ఏమీ ఆశించదు. కానీ నేను ఈ సమాజానికి స్ఫూర్తిగా మారాలనుకున్నా. మన ఆలోచనల కంటే మన చేతలే ఎంతో సమర్థమైనవి అని నమ్మే వ్యక్తిని నేను!’ అని చెబుతోంది జాకీ.

‘ఇంకొక్క మైలు’ అంటూ!

ఇలా విధిని ఎదిరించి, పట్టుబట్టి 2016లో తన పరుగు జర్నీని ప్రారంభించిన జాకీ.. ఆది నుంచే తనకెదురులేదనిపిస్తోంది. హాఫ్ మారథాన్‌ (21.0975 కిలోమీటర్లు), అల్ట్రా మారథాన్‌ (42.195 కిలోమీటర్లు).. వంటి ఈవెంట్లలో పాల్గొంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

* 23 గంటల 38 నిమిషాల్లో ట్రెడ్‌మిల్‌పై వంద మైళ్లు పరిగెత్తిన తొలి యాంప్యుటీగా ప్రపంచ రికార్డు సృష్టించింది జాకీ.

* కొలరాడోలో నిర్వహించిన ‘ట్రాన్స్‌ రాకీ మౌంటెయిన్‌ స్టేజ్‌ రేస్‌’లో పాల్గొన్న అంగవైకల్యం ఉన్న తొలి వ్యక్తిగా నిలిచిందీ పరుగుల రాణి. ఇందులో భాగంగా 20 వేల అడుగుల ఎత్తుకు చేరుకొని తనకు తిరుగులేదనిపించిందామె.

* ‘The Naturalist 25k trail race’ పూర్తి చేసిన తొలి యాంప్యుటీ కూడా జాకీనే! ఇందులో భాగంగా అత్యంత సవాలుతో కూడిన భూభాగంలో 5500 అడుగుల ఎత్తును పెట్టుడు కాలితోనే ఆమె అధిగమించడం విశేషం!

‘మన కెరీర్‌లో మనకు కలిసొచ్చే రోజులుంటాయి. మరికొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రెండు సందర్భాలను పాజిటివ్‌గా తీసుకోవడం నాకు అలవాటు. అందుకే లక్ష్యాన్ని చేరిన ప్రతిసారీ ‘ఇంకొక్క మైలు’ అంటూ నన్ను నేనే ప్రోత్సహించుకుంటా. ధ్యానం, శ్వాస నియంత్రణ.. వంటి వాటితో ప్రతికూల సమయాల్ని అధిగమిస్తా..’ అంటూ తన సక్సెస్‌ సీక్రెట్‌ని పంచుకుంది జాకీ.

ఆమె స్ఫూర్తితో ప్రపంచ రికార్డు!

ఎన్ని మారథాన్లలో పాల్గొన్నా, ప్రపంచ రికార్డులు ఒడిసిపట్టినా.. వంద రోజుల్లో వంద మారథాన్లు పూర్తిచేయాలన్న లక్ష్యం ఉండేదని చెబుతోంది జాకీ.

‘పరుగు విషయంలో అమెరికన్‌ అల్ట్రా రన్నర్‌ అలిస్సా క్లార్క్‌ని స్ఫూర్తిగా తీసుకున్నా. ఎందుకంటే ఆమె 2021లో 95 రోజుల్లో 95 మారథాన్‌లను పూర్తి చేసింది. ఆమెను చూశాకే ఈ రికార్డును అధిగమించాలని నిర్ణయించుకున్నా. అందుకే వంద రోజుల్లో వంద మారథాన్లు పూర్తి చేయాలని సంకల్పించుకున్నా. అయితే డెర్బిషైర్‌ దేశానికి చెందిన కేట్‌ జేడెన్‌ అనే మరో మారథానర్‌ ఈ ఏడాది జనవరిలో 101 రోజుల్లో 101 మారథాన్లను పూర్తిచేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. దీంతో ఈ రికార్డును బద్దలుకొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నా.    తాజాగా అది నెరవేరింది.. 102 రోజుల్లో 102 మారథాన్లు పూర్తి చేసి.. నిరంతరాయంగా ఈ పరుగు పూర్తిచేసిన తొలి యాంప్యుటీ మహిళగా గిన్నిస్‌ రికార్డు అందుకున్నా. ఆఖరి క్షణంలో రోప్‌ను తాకుతూ లక్ష్యాన్ని అధిగమించిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేను.. అయితే అక్కడితో ఆపకుండా మరో రెండు రోజులు కొనసాగించి 104 రోజుల్లో 104 మారథాన్లు పూర్తిచేశా..’ అంటోందీ రన్నింగ్‌ క్వీన్.

పరుగు నాకెంతో ఇచ్చింది!

ఒకప్పుడు ఫార్మా మార్కెటింగ్‌లో ఉద్యోగం చేసిన జాకీ ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి. మరోవైపు తనలా అంగవైకల్యం ఉన్న అథ్లెట్ల కోసం ప్రోస్థటిక్‌ పరికరాలు అందించే పనిలో భాగంగా ‘యాంప్యుటీ బ్లేడ్‌ రన్నర్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థలో భాగమైందామె. ఈ క్రమంలో ఇప్పటికే సుమారు 16 వేల డాలర్లు (సుమారు 12.24 లక్షలు) సేకరించిందీ అల్ట్రా రన్నర్‌. ‘పరుగు నాకు ఎంతో ఇచ్చింది.. అంగ వైకల్యంతో మోడువారిన నా జీవితంలో కొత్త ఆశలు చిగురింపజేసింది.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యవంతురాలిగా నన్ను మార్చింది. అందుకే నేను కోరుకునేది ఒక్కటే.. నాలాగే అంగవైకల్యం ఎదుర్కొంటోన్న వారంతా తమలోని నైపుణ్యాలతో ప్రతికూలతల్ని అధిగమించాలి.. ఈ క్రమంలో మనసు చెప్పింది వింటూ.. చేతల్లో మీ ప్రతిభను నిరూపించుకోండి!’ అంటూ తన మాటలతోనూ అందరిలో స్ఫూర్తి నింపుతోందీ మారథాన్ మామ్.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని