ఆ సైనికులకు ప్రాణ దాత!

మూడున్నర దశాబ్దాల క్రితం మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో చేరారామె. సుమారు 3వేలకు పైగా సర్జరీల్లో పాల్గొని ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఆపరేషన్‌కి ఉపయోగించే పరికరాలు, కిట్లను సైతం రూపొందించారు. ఒకవేళ తను అందుబాటులో లేకపోయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు స్వయంగా ప్రాథమిక చికిత్స చేసుకునేలా వేలాదిమంది సైనికులకు శిక్షణనిచ్చారు.

Updated : 21 Sep 2021 19:56 IST

(Photo: Screengrab)

మూడున్నర దశాబ్దాల క్రితం మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో చేరారామె. సుమారు 3వేలకు పైగా సర్జరీల్లో పాల్గొని ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఆపరేషన్‌కి ఉపయోగించే పరికరాలు, కిట్లను సైతం రూపొందించారు. ఒకవేళ తను అందుబాటులో లేకపోయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు స్వయంగా ప్రాథమిక చికిత్స చేసుకునేలా వేలాదిమంది సైనికులకు శిక్షణనిచ్చారు. ఇలా దేశ సరిహద్దుల్లో సేవలందిస్తూ నర్సింగ్‌ వృత్తికే వన్నె తెచ్చారు బ్రిగేడియర్‌ ఎస్వీ సరస్వతి. నర్సింగ్‌ వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధతను గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవలే ‘జాతీయ ఫ్లోరెన్స్ నేటింగేల్‌ అవార్డు’తో సత్కరించింది.

వృత్తి నిబద్ధతకు గుర్తింపుగా!

‘నేషనల్‌ ఫ్లోరెన్స్ నైటింగేల్‌’ పురస్కారం... దేశంలోని నర్సులకు భారత ప్రభుత్వం ప్రదానం చేసే అత్యుత్తమ అవార్డు. నర్సింగ్‌ వృత్తిలో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. అలా 2020 సంవత్సరానికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న వారిలో బ్రిగేడియర్‌ ఎస్వీ సరస్వతి ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఆమె ప్రస్తుతం మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ (MNS)లో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా సేవలందిస్తున్నారు.

మూడున్నర దశాబ్దాల అనుభవం!

చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన సరస్వతి 1983, డిసెంబర్‌ 28న మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో చేరారు. ఈ మూడున్నర దశాబ్దాల కాలంలో తనకు అప్పగించిన వివిధ బాధ్యతలన్నింటినీ సమర్థంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్‌ థియేటర్ నర్సుగా పనిచేసి... 3వేలకు పైగా అత్యవసర సర్జరీలలో పాల్గొని ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ట్రైనీ నర్సులు, ఇతర సిబ్బందికి నర్సింగ్‌ శిక్షణ కూడా అందించారు. ముఖ్యంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తమకు తాము ప్రాథమిక చికిత్స చేసుకునేలా వేలాదిమంది సైనికులు, వారి కుటుంబాలకు తర్ఫీదు అందించారు.

ఎంఎన్‌ఎస్‌ ప్రతినిధిగా!

విధుల్లో భాగంగా గుండె ఆపరేషన్లకు అవసరమయ్యే డ్రేప్‌ కిట్లు, పేషెంట్‌ టీచింగ్‌ మెటీరియల్స్‌ను రూపొందించారు బ్రిగేడియర్‌ సరస్వతి. అలాగే ఎంఎన్‌ఎస్‌ ప్రతినిధిగా దేశ, విదేశాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, సదస్సుల్లో పాల్గొన్నారు. వివిధ దేశాల్లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో భాగమయ్యారామె. ఇలా సైనికులు, వారి కుటుంబాలకు అందించిన సేవలకు గాను ఇప్పటికే ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు సరస్వతి. 2005లో ‘జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌’ ప్రశంసా పురస్కారాన్ని అందుకున్న ఆమె.. 2007లో ఐక్యరాజ్యసమితి మెడల్‌ను మెడలో అలంకరించుకున్నారు. 2015లో ‘చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ కమెండేషన్‌’ బ్యాడ్జ్‌ని కూడా స్వీకరించారీ సూపర్‌ వుమన్‌.

రాబోయే తరాలకు ఆదర్శం!

ఇక ఇటీవలే ‘జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ - 2020’ అవార్డు అందుకున్న బ్రిగేడియర్‌ సరస్వతిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. నర్సింగ్‌ వృత్తిలో సరస్వతి చూపిన అంకితభావం, నిబద్ధత రాబోయే తరాలకు ఆదర్శమని ఆమె సేవలను కొనియాడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్