Career options: ఒత్తిడి లేకుండా.. అవసరమైతే సొంతంగానూ..!

ఉద్యోగం చేసే మహిళలకు రోజంతా ఉరుకులు పరుగులతోనే సరిపోతుంది. ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ బాధ్యతలతో తమకంటూ కాస్త సమయం కేటాయించుకునే అవకాశమే ఉండదు. దీంతో ఒక్కోసారి విపరీతమైన అసహనం ఆవహిస్తుంటుంది.. పలు ఆరోగ్య సమస్యలూ చుట్టుముడతాయి. ఒక్కో దశలో ఉద్యోగం మానేయడమే మంచిదనిపిస్తుంటుంది....

Published : 17 Aug 2023 12:59 IST

ఉద్యోగం చేసే మహిళలకు రోజంతా ఉరుకులు పరుగులతోనే సరిపోతుంది. ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ బాధ్యతలతో తమకంటూ కాస్త సమయం కేటాయించుకునే అవకాశమే ఉండదు. దీంతో ఒక్కోసారి విపరీతమైన అసహనం ఆవహిస్తుంటుంది.. పలు ఆరోగ్య సమస్యలూ చుట్టుముడతాయి. ఒక్కో దశలో ఉద్యోగం మానేయడమే మంచిదనిపిస్తుంటుంది. కానీ ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల రీత్యా కొంతమందికి ఈ వెసులుబాటు ఉండకపోవచ్చు. మరికొంతమంది పెద్దగా కష్టపడే పనిలేకుండా తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతూనే.. సౌకర్యవంతంగా ఉండే ఉద్యోగాలు చేయాలనుకుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం విభిన్న కెరీర్‌ ఆప్షన్స్‌ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటితో ఇటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే.. అటు చేతి నిండా డబ్బూ సంపాదించచ్చంటున్నారు. ఇంతకీ ఏంటా ఉద్యోగాలు? తెలుసుకుందాం రండి..

ఆఫీస్‌లో అధిక పని భారం, ఇంటి పనులు-ఆఫీస్‌ బాధ్యతల్ని ఏకకాలంలో సమన్వయం చేసుకోలేకపోవడం.. వంటి కారణాల వల్ల చాలామంది మహిళా ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. దీని ప్రభావం ఆరోగ్యం పైనే నేరుగా పడుతుంది. అయితే ఈ సమస్యలన్నీ ఎందుకన్న ఉద్దేశంతో కొంతమంది మహిళలు సౌకర్యవంతమైన కెరీర్‌ ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతుంటారు. తద్వారా ఇటు హ్యాపీగా ఉద్యోగం చేస్తూనే.. అటు ఆరోగ్యం పైనా శ్రద్ధ పెట్టచ్చన్నది వారి ఆలోచన! అలాంటి వారికి ఈ ఉద్యోగాలు సూటవుతాయంటున్నారు నిపుణులు.

ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతూ..!
ఈ రోజుల్లో చాలామందికి ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఇంటి పనులు, ఆఫీస్‌ బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా.. వ్యాయామం కోసం తగిన సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో జిమ్‌కు వెళ్లడం, లేదంటే ఆన్‌లైన్‌లోనే ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకోవడం.. వంటివి చేస్తున్నారు. అయితే ఎక్కువమంది మహిళలు తమ పర్సనల్‌ ట్రైనర్లుగా మహిళా నిపుణుల్నే ఎంచుకుంటున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఫిట్‌నెస్‌పై పట్టున్న వారు దీన్నే కెరీర్‌ అవకాశంగా మలచుకోవచ్చు. అయితే యోగా, జుంబా, పిలాటిస్‌, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌.. వంటి ఫిట్‌నెస్‌ అంశాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. ఆయా అంశాల్లో ప్రత్యేక కోర్సులు చేసి, మరిన్ని నైపుణ్యాలు సాధించి.. సంబంధిత సర్టిఫికేషన్లు సొంతం చేసుకోగలిగితే.. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ క్రమంలో ఏదైనా జిమ్‌లో ఫిట్‌నెస్‌ ట్రైనర్లుగా చేరచ్చు.. లేదంటే మీరే సొంతంగా ఓ ఫిట్‌నెస్‌ సెంటర్‌ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్లుగా పేరు తెచ్చుకున్న యాస్మిన్‌ కరాచీవాలా, నమ్రతా పురోహిత్‌, రాధికా కర్లే.. వీళ్లంతా ఒక్కో మెట్టూ ఎక్కుతూ పాపులారిటీ సంపాదించిన వారే! కాబట్టి వీరినే స్ఫూర్తిగా తీసుకొని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా రాణించచ్చు. ఇలా మీరు వ్యాయామాలు చేస్తూ, ఔత్సాహికులకు నేర్పించడం వల్ల.. మీ శరీరానికీ ఎక్సర్‌సైజ్‌ అంది.. శారీరక, మానసిక ఆరోగ్యం సొంతమవుతుంది.. మరోవైపు చేతి నిండా డబ్బూ, పాపులారిటీ సంపాదించచ్చు.

మొక్కలతో ఆహ్లాదంగా..!
ఇంటి చుట్టూ పచ్చటి మొక్కలు పెంచుకోవడం, ఇండోర్‌ మొక్కల్ని ఏర్పాటుచేసుకోవడం, వాటి సంరక్షణ.. ఇలా గార్డెనింగ్‌పై మక్కువ చూపుతుంటారు కొందరు మహిళలు. అంతేకాదు.. ఆయా మొక్కల్లోని ఔషధ గుణాల గురించీ తమ పిల్లలకు, చుట్టూ ఉన్న వాళ్లకు తెలియజేస్తుంటారు. ఇలాంటి వారు ప్రొఫెషనల్‌ గార్డెనర్స్‌గా రాణించచ్చు.. గార్డెన్‌ డిజైనర్లుగా ఓ వ్యాపారాన్నీ ప్రారంభించచ్చు. అయితే ఇలా మొక్కలపై తమకున్న ఆసక్తితో వృక్షశాస్త్రాన్ని ప్రధాన సబ్జెక్టుగా ఉన్నత విద్యను అభ్యసించిన వారూ కొందరుంటారు. అలాంటి వారు ఈ నైపుణ్యాల్ని నేటి శాస్త్రసాంకేతికతో ముడిపెడితే ఈ సాంకేతిక యుగంలో అపార అవకాశాల్ని అందుకోవచ్చంటున్నారు నిపుణులు. మొక్కల జన్యుకణాలపై అవగాహన ఉన్న వారు బయోకెమిస్ట్‌/బయోటెక్నాలజిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ఇక రసాయనశాస్త్రం అంటే ఇష్టం ఉన్న వారు టెక్సికాలజిస్ట్‌గా; మొక్కల క్రిమి కీటకాలపై ఆసక్తి చూపే వారు ఎంటమాలజిస్ట్‌గానూ రాణించచ్చు. ఇక పూల అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే మహిళలు ఫ్లోరిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ఏదేమైనా.. ఇలా పచ్చటి మొక్కలు, రంగురంగుల పువ్వుల మధ్య గడపడం వల్ల.. శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయని, ఇవి మానసికోల్లాసాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మసాజ్‌ చేయగలరా?
ప్రస్తుతం ఏ ఉద్యోగంలోనైనా ఒత్తిడి సహజం. అందుకే దీన్నుంచి బయటపడే మార్గాల్ని అన్వేషిస్తున్నారు చాలామంది. ఈ క్రమంలోనే మసాజ్‌ సెంటర్లకూ క్రమంగా ఆదరణ పెరిగిపోతోంది. ఇక మహిళలు మహిళా నిపుణులతోనే మసాజ్‌ చేయించుకోవడానికి మొగ్గు చూపుతుంటారు కూడా! ఆసక్తి ఉంటే దీన్నే అవకాశంగా మలచుకోవచ్చంటున్నారు నిపుణులు. అధిక డిమాండ్‌, మంచి సంపాదనతో పాటు ఈ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువే అంటున్నారు. ఈ క్రమంలో ముందుగా మసాజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసి సంబంధిత సర్టిఫికెట్ సంపాదించాల్సి ఉంటుంది. కాస్త అనుభవం వచ్చే వరకు ఏదైనా మసాజ్‌ సెంటర్‌లో పనిచేసి.. ఆపై సొంతంగా మసాజ్‌ సెంటర్‌ తెరవచ్చు. ఇక ఇందులోనూ ఆసక్తిని బట్టి.. వివిధ ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించే మెడికల్‌ మసాజ్‌, క్రీడల్లో ఫిట్‌నెస్‌ కోసం స్పోర్ట్స్‌ మసాజ్‌, క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా చేసే ఆంకాలజీ మసాజ్‌, గర్భిణులకు అందించే ప్రెగ్నెన్సీ మసాజ్‌, వివిధ రకాల స్పా ట్రీట్‌మెంట్లు.. ఇలా ఆయా అంశాల్లో ప్రత్యేక నైపుణ్యాలు సాధించి.. కెరీర్‌ను విస్తరించుకోవచ్చు. అంతేకాదు.. ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌, సొంతంగా.. ఇలా మీ సమయాన్ని బట్టి మసాజ్‌ కెరీర్‌ను కొనసాగించచ్చు. ఇందులోనే మరికొంతమందికి శిక్షణ కూడా ఇవ్వచ్చు.

‘కళ’ల కెరీర్‌..!
కళలు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. దీర్ఘకాలంలో ఇవి పార్కిన్సన్స్‌, మతిమరుపు.. వంటి మానసిక సమస్యల బారిన పడకుండా కాపాడతాయని ఓ అధ్యయనంలో తేలింది. పైగా చాలామంది మహిళలకు ఏదో ఒక కళలో నైపుణ్యం ఉంటుంది. పెయింటింగ్‌, చేత్తో కళాకృతులు తయారుచేయడం, బేకింగ్‌ నైపుణ్యాలు, ఇంటి అలంకరణ వస్తువులు రూపొందించడం.. ఇలా చాలా ఆప్షన్లే ఉంటాయి. వీటిలో మీకు ఆసక్తి ఉన్న అంశాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. మీలోని సృజనాత్మకతకు మెరుగులద్దుతూ కొత్త కొత్త వస్తువుల్ని తయారుచేయచ్చు. డిజైనింగ్‌ నైపుణ్యాలున్న వారు త్రీడీ సాంకేతికతను ఉపయోగించుకొని గేమింగ్‌, వినోదం, ఇంటీరియర్‌.. వంటి రంగాల్లో అద్భుతాలు సృష్టించచ్చు. ఇక డ్యాన్స్‌, సంగీత కళలపై మక్కువ చూపే వారు.. ఈ మెలకువల్నే నలుగురికీ పంచుతూ కెరీర్‌ సంతృప్తిని పొందచ్చు. ఇలా మీలో ఉన్న ప్రత్యేకమైన కళలో అడ్వాన్స్‌డ్‌ నైపుణ్యాలు సాధిస్తూ.. కెరీర్‌ అవకాశాల్ని మరింతగా విస్తరించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆపై సొంతంగా వ్యాపారం ప్రారంభించి నలుగురిలోనూ స్ఫూర్తి నింపచ్చు.

విశ్లేషణ సామర్థ్యాలున్నాయా?
ఏ విషయం గురించైనా లోతైన ఆలోచన, విశ్లేషించి నిర్ణయాలు తీసుకోగలగడం.. వంటి నైపుణ్యాలు మహిళల్లో సహజంగానే ఉంటాయి. కౌన్సెలింగ్‌ కెరీర్‌కు కావాల్సినవి కూడా ఇవే! ఇలాంటి నైపుణ్యాలున్న మహిళలు కౌన్సెలర్లుగానూ రాణించచ్చంటున్నారు నిపుణులు. విద్యార్థుల కెరీర్‌ దగ్గర్నుంచి ఆరోగ్య సమస్యల దాకా.. ఉద్యోగుల దగ్గర్నుంచి అనుబంధంలో తలెత్తే సమస్యల దాకా.. ఇలా ప్రతిదీ పరిష్కరించుకోవడానికి చాలామందికి కౌన్సెలింగ్‌ అవసరం పడుతుంది. ఈ క్రమంలో అవతలి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చేటప్పుడు.. లోతుగా ఆలోచించి, విశ్లేషించే సామర్థ్యం.. కౌన్సెలింగ్‌ ఇచ్చే వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. తద్వారా స్వీయ అవగాహనతో సమస్యల బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందంటున్నారు. పైగా మీ వీలును బట్టి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మాధ్యమాల్ని ఎంచుకోవడం, ఈ నైపుణ్యాన్నే వ్యాపారంగా మలచుకొని వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపే కౌన్సెలింగ్‌ సెంటర్‌ ప్రారంభించడం.. వంటివి చేస్తే.. సౌకర్యంగా కెరీర్‌ కొనసాగించచ్చు.

ఇవే కాదు.. డైటీషియన్‌, థెరపిస్ట్‌.. వంటి అంశాల్ని కెరీర్‌గా ఎంచుకోవడం వల్ల ఇటు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో పాటు నలుగురిలోనూ స్ఫూర్తి నింపచ్చు. ట్రెండ్‌ను బట్టి నైపుణ్యాల్ని విస్తరించుకుంటూ అపార అవకాశాల్నీ అందుకోవచ్చు.. తద్వారా ఒత్తిడికి దూరంగా ఉంటూనే ఆర్థిక స్వేచ్ఛనూ సాధించచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్