విదేశీ చదువా? ఖర్చును తగ్గించుకోండిలా..!

ఒకప్పుడు విదేశాల్లో చదువుకోవాలంటే కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకుంటున్నారు.

Published : 02 Sep 2023 19:53 IST

ఒకప్పుడు విదేశాల్లో చదువుకోవాలంటే కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకుంటున్నారు. ఇందుకోసం రుణాలు తీసుకోవడం, చిన్నపాటి ఆస్తులను అమ్ముకోవడానికి కూడా వెనుకాడడం లేదు. మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ప్రస్తుత సంవత్సరం ఆ సంఖ్య గతేడాది రికార్డును బద్దలుకొట్టనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో విదేశాలకు వెళుతున్నారు. ఇందులో అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతోంది. సాధారణంగా ఫాల్‌ సీజన్‌ అంటే ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో ఎక్కువమంది వెళుతుంటారు. విదేశీ విద్య అంటే ఎంతైనా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ ఖర్చును తగ్గించుకోవచ్చంటున్నారు కెరీర్‌ నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందామా...

ఏ దేశానికి వెళుతున్నారు?

చాలామంది ఉన్నత విద్య అభ్యసించడానికే విదేశాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో ఏ దేశంలో చదువుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే దేశాన్ని బట్టి ఖర్చులు మారుతుంటాయి. కొన్ని కోర్సులు కొన్ని దేశాల్లో తక్కువ ఖర్చుతోనే పూర్తి చేయగలిగితే.. మరికొన్ని దేశాల్లో అవే కోర్సులకు అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఉదాహరణకు చైనా, రష్యా వంటి దేశాల్లో మెడిసిన్‌ను తక్కువ ఖర్చుతోనే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. బ్రిటన్‌, అమెరికాలతో పోల్చితే జర్మనీ, స్విట్జర్లాండ్‌, నార్వే వంటి దేశాల్లో కూడా ఖర్చు తక్కువగానే ఉంటుంది. అయితే చదువుతో పాటు జీవన వ్యయానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని దేశాల్లో ట్యూషన్‌ ఫీజు తక్కువగా ఉన్నా జీవన వ్యయం మాత్రం భారీగా ఉంటుంది. కాబట్టి, ఈ రెండు అంశాలను బేరీజు వేసుకుని వెళ్లే దేశాన్ని ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు.

ఆ విశ్వవిద్యాలయాల్లో..

కొన్ని దేశాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎలాంటి ట్యూషన్‌ ఫీజు లేకుండానే ఉచిత విద్యను అందిస్తుంటాయి. ముఖ్యంగా జర్మనీ, నార్వే, ఫిన్లాండ్‌, స్వీడన్‌ వంటి దేశాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉచిత విద్యను అందించడమో లేదా ట్యూషన్‌ ఫీజు తక్కువగా ఉండడమో జరుగుతుంటుంది. అయితే యూనివర్సిటీలు ఎక్కువ శాతం తమ దేశంలోని విద్యార్థులకే ఈ సదుపాయం కల్పిస్తుంటాయి. కానీ, కొన్ని విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులకు కూడా ఇలాంటి సదుపాయం కల్పిస్తుంటాయి. అయితే అందుకు పలు అర్హతలు ఉండడంతో పాటు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. కాబట్టి, విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు ముందుగానే ఇలాంటి విశ్వవిద్యాలయాల గురించి పరిశోధన చేసినట్లయితే తక్కువ ఖర్చుతోనే చదువు పూర్తి చేయచ్చు.

స్కాలర్‌షిప్‌లు..

ఈ రోజుల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి, ప్రతిభ గల విద్యార్థులకు ఎన్నో రకాల స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలతో పాటు పలు ప్రైవేటు సంస్థలు కూడా ఇలాంటి స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. వీటికి సంబంధించిన సమాచారాన్ని వారి అధికారిక వెబ్‌సైట్లలో అప్‌డేట్‌ చేస్తుంటారు. కాబట్టి, వాటిని ఎప్పటికప్పుడు అనుసరిస్తుండాలి. దానివల్ల సరైన సమయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తూ..

మనం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా విదేశాల్లో కొన్ని రకాల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎందుకంటే చాలా దేశాల కరెన్సీ మన రూపాయి కంటే బలమైనవి. కాబట్టి వారి కరెన్సీలోకి మార్చుకోవడానికి ఎక్కువ రూపాయలను వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేయడం ద్వారా కొన్ని ఖర్చులను అదుపు చేసుకోవచ్చు. అయితే అందుకు ఆ దేశంలో పని చేయడానికి ఉన్న నిబంధనల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. అలాగే కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్‌ చేయడానికి అవకాశం ఇస్తుంటాయి. వీటికి కొంత మొత్తాన్ని కూడా చెల్లిస్తుంటాయి. దీని ద్వారా ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అనుభవం కూడా పొందే అవకాశం ఉంటుంది.

విద్యా రుణాలు..

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వివిధ బ్యాంకులతో పాటు పలు ఆర్థిక సంస్థలు కూడా రుణాలు అందిస్తుంటాయి. ప్రతిభ గల విద్యార్థులు వీటి ద్వారా కూడా విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు కోర్సు పూర్తైన కొద్ది సమయంలోనే ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. తద్వారా తాము తీసుకున్న లోన్‌ను కొంతకాలంలోనే క్లియర్‌ చేయచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల విద్యా రుణాల పైన సబ్సిడీ అందిస్తుంటుంది. అలాంటి వాటి గురించి తెలుసుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు. సెంట్రల్‌ సెక్టార్ ఇంట్రస్ట్ సబ్సిడీ స్కీమ్ (CSIS), Padho Pardesh Scheme వంటివి ఇందులో భాగమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్