ఈ గుడ్ల గురించి విన్నారా?

కోడిగుడ్లు.. ప్రొటీన్లు అధికంగా ఉండే వీటి ప్రాధాన్యం మనకు తెలిసిందే. అయితే మన దగ్గర ఎక్కువగా కోడిగుడ్లనే ఉపయోగిస్తారు. కానీ, కొన్ని దేశాల్లో ఇతర పక్షుల నుంచి వచ్చే గుడ్లను కూడా ఆహారంలో భాగం చేసుకుంటారు. ఈ క్రమంలో అలాంటి కొన్ని ఎగ్స్‌....

Updated : 13 Aug 2022 15:29 IST

కోడిగుడ్లు.. ప్రొటీన్లు అధికంగా ఉండే వీటి ప్రాధాన్యం మనకు తెలిసిందే. అయితే మన దగ్గర ఎక్కువగా కోడిగుడ్లనే ఉపయోగిస్తారు. కానీ, కొన్ని దేశాల్లో ఇతర పక్షుల నుంచి వచ్చే గుడ్లను కూడా ఆహారంలో భాగం చేసుకుంటారు. ఈ క్రమంలో అలాంటి కొన్ని ఎగ్స్‌ గురించి తెలుసుకుందామా...


బాతు గుడ్లు...

బాతు గుడ్డు పరిమాణంలో సాధారణ కోడి గుడ్డు లాగానే ఉంటుంది. అయితే బాతుగుడ్డులో పచ్చసొన కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ గుడ్డు పెంకు కొంచెం మందంగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఇవి రుచికరంగా ఉండడంతో పాటు సాధారణ గుడ్డు కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో బీ కాంప్లెక్స్‌ విటమిన్‌తో పాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. దీనిని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. ఇవి కొన్ని స్టోర్స్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్నాయి.


ఈము గుడ్డు...

మెడ పొడవుగా ఉండే ఈము పక్షి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండో ఎత్తైన పక్షి. ఇది ఆస్ట్రేలియా జాతీయ పక్షి కూడా. అయితే వీటి గుడ్లకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంటుందట. దీని ఆకారంతో పాటు ఇందులో ఉండే పోషకాలే అందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది చూడడానికి పెద్ద సైజు అవకాడోలాగా ఉంటుంది. ఒక్క ఈము గుడ్డు దాదాపు 10 కోడిగుడ్లతో సమానంగా ఉంటుంది. ఈ ఎగ్‌ను ఎక్కువగా ఆమ్లెట్‌ చేసుకుని తింటుంటారు. మన దగ్గర కూడా కొన్ని ప్రాంతాల్లో ఈము గుడ్లు లభిస్తుంటాయి. అయితే వీటి ధర మాత్రం అధికంగానే ఉంటుంది.


క్వాయిల్ గుడ్డు...

క్వాయిల్ ఎగ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా తింటుంటారు. దీనిని జపాన్‌ ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారట. ఈ గుడ్డు సాధారణ కోడిగుడ్డుతో పోల్చితే చాలా చిన్నగా ఉంటుంది. దాదాపు నాలుగు గుడ్లు ఒక్క కోడిగుడ్డుతో సమానం. ఇందులో ఉండే పోషకాల విషయానికి వస్తే దాదాపు కోడిగుడ్డు లాగానే ఉంటాయి. అయితే దీని పెంకు కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువసేపు ఉడకబెడుతుంటారు. ఇవి మన దగ్గర కూడా వివిధ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో లభ్యమవుతున్నాయి.


గూస్ గుడ్డు...

గూస్ గుడ్డు సాధారణ గుడ్డు కంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. గూస్‌ పక్షులు బాతు లాగానే ఉంటాయి. అయితే వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఒక్క గూస్‌ పక్షి సంవత్సరానికి 35 నుంచి 40 గుడ్లను మాత్రమే పెడుతుంటుంది. కోడిగుడ్డు కంటే రెట్టింపు పరిమాణంలో ఉండే ఈ గుడ్లలో పోషకాలు కూడా  దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఉంటాయి. రుచి కూడా అంతే బాగుంటుంది. కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో కూడా ఈ గుడ్లు లభిస్తున్నాయి.


సీగల్ ఎగ్స్...

సీగల్ ఎగ్స్ యూరప్ దేశాల్లో ఎక్కువగా లభిస్తాయి. ఇవి సంవత్సరంలో మూడు నుంచి నాలుగు వారాల పాటు మాత్రమే లభిస్తుంటాయి. అందుకే వీటికి అధిక డిమాండ్‌ ఉంటుంది. యూకేలోని ఆరు ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయట. సీగల్‌ పక్షుల నుంచి వచ్చే ఈ గుడ్లను సేకరించాలంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే దీని ధర కూడా అధికంగా ఉంటుంది. ధరకు తగ్గట్టు ఇందులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయట.


ఆస్ట్రిచ్‌ గుడ్డు..

ఆస్ట్రిచ్‌ పక్షి ప్రపంచంలోనే పెద్ద పక్షి. ఇవి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. ఈ పక్షి సైజుకు తగ్గట్టే దాని గుడ్డు ఉంటుంది. ఈ గుడ్డు ఒక్కోటి రెండు కేజీల వరకు ఉంటుంది. ఒక్క ఆస్ట్రిచ్‌ గుడ్డు దాదాపు 24 కోడిగుడ్లతో సమానం. సాధారణ కోడిగుడ్డుతో పోల్చితే ఇది 20 రెట్లు మందంగా ఉంటుంది. అందుకే ఇది అంత సులభంగా పగలదు. ఇందులో క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్