దాని గురించి చెప్పడానికి సంకోచించను..!

‘మన నైతికాభివృద్ధితోనే నిజమైన దేశాభివృద్ధి సాధ్యం’ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. దశాబ్దాలు గడుస్తోన్నా ఆయన మాటలు మాటలకే పరిమితమయ్యాయి. నేటికీ కులం, మతం పేరుతో వివక్ష చూపించడం, దళితులను అంటరాని వాళ్లుగా భావించడం, ఆదివాసీల పట్ల అసమానతలు.. వంటివన్నీ సమాజంలో....

Published : 13 Oct 2022 14:19 IST

(Photo: Twitter)

‘మన నైతికాభివృద్ధితోనే నిజమైన దేశాభివృద్ధి సాధ్యం’ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. దశాబ్దాలు గడుస్తోన్నా ఆయన మాటలు మాటలకే పరిమితమయ్యాయి. నేటికీ కులం, మతం పేరుతో వివక్ష చూపించడం, దళితులను అంటరాని వాళ్లుగా భావించడం, ఆదివాసీల పట్ల అసమానతలు.. వంటివన్నీ సమాజంలో పాతుకుపోయాయి. ఓ దళిత మహిళగా తానూ ఇలాంటి వివక్ష ఎదుర్కొన్నానంటోంది కర్ణాటకకు చెందిన డాక్టర్‌ అశ్విని కేపీ. అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల అభివృద్ధి కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా ఆమె చేస్తోన్న కృషి.. తాజాగా ఆమెకు మరో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి స్వతంత్ర నిపుణురాలిగా/ప్రత్యేక దూతగా ఇటీవలే నియమితురాలైంది అశ్విని. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, తొలి ఆసియా దళిత మహిళగా నిలిచిందామె.

కర్ణాటకకు చెందిన ఓ దళిత కుటుంబంలో పుట్టిపెరిగింది అశ్విని. సాధారణంగా దళితులంటే సమాజంలో ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది.. అందుకే తమ కులం గురించి బయటికి చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ తాను మాత్రం ఇందుకు పూర్తి భిన్నం అంటోంది అశ్విని.

అమ్మానాన్నల స్ఫూర్తితో..!

‘కులమత భేదాలు ప్రతి చోటా ఉన్నాయి.. అయితే ఈ సమాజంలో ఉన్న వివక్ష కారణంగా దాని గురించి బయటపెట్టడానికి చాలామంది ఇష్టపడకపోవచ్చు. కానీ నేను ఇందుకు భిన్నం. అందుకు కారణం నేను పెరిగిన వాతావరణమే! నా తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులే.. కులాన్ని సమస్యగా వాళ్లెప్పుడూ భావించలేదు. పైగా రాజకీయ, సామాజిక కోణంలో నా గుర్తింపును అర్థం చేసుకోవడానికి నాకు సరైన మార్గనిర్దేశనం చేశారు. నిజంగా ఇలా ప్రోత్సహించే తల్లిదండ్రులుండడం నా అదృష్టం. అయితే ఈ క్రమంలో నాకు కొన్ని ప్రతికూలతలూ తప్పలేదు. నా ముక్కుసూటితనం వల్ల చదువుకునేటప్పుడు, చదువు పూర్తయ్యాక సమాజం నుంచి వివిధ రకాలుగా వివక్షను ఎదుర్కొన్నా. పలు అవకాశాల్నీ కోల్పోయా. కులం కారణంగా నాకు దక్కాల్సిన అవకాశాలు ఉన్నత వర్గాల వారిని వరించాయి. అయినా నేను బాధపడలేదు.. పైగా ఇలా సమాజంలో పేరుకుపోయిన కుల వివక్షపై దృష్టి సారించేందుకు నాకు ఎదురైన ఈ పరిస్థితులు నన్ను మరింతగా ప్రేరేపించాయి..’ అంటోంది అశ్విని.

అంబేద్కర్‌ సిద్ధాంతాలే ఊపిరిగా..!

అశ్విని.. విద్యార్థి దశ నుంచే కుల వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చింది.. ప్రతి ఒక్కరూ కులమత భేదాలకు అతీతంగా వ్యవహరించాలని చెప్పిన అంబేద్కర్‌ మాటల్ని, ఆయన సిద్ధాంతాల్ని నమ్ముతూ పెరిగిన ఆమెకు రాజకీయ స్పృహ కూడా ఎక్కువే! ఈ క్రమంలోనే చదువుకునే రోజుల్లోనే పలు ఉద్యమాలు, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది అశ్విని. ఇక దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుకునే క్రమంలో విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిందామె.

‘దిల్లీ జేఎన్‌యూలో పీహెచ్‌డీ చదివే క్రమంలో అక్కడి ‘యునైటెడ్‌ దళిత్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌’లో భాగమయ్యా. ఇదే నాలో విద్యార్థి రాజకీయాలపై పట్టు పెంచింది. ఇక పీహెచ్‌డీలో భాగంగా భారత్‌-నేపాల్‌లలో దళిత మానవ హక్కులపై పరిశోధనలు చేశాను. ఇది నాకు దేశ, విదేశాల్లో ఉన్న ఎంతోమంది అనుభవజ్ఞులైన దళిత నాయకుల్ని, విద్యావేత్తల్ని కలిసే అవకాశం కల్పించింది. ఐక్యరాజ్యసమితిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న వీరి ద్వారా దళిత హక్కులు, కుల వివక్ష, జాత్యంహకారానికి సంబంధించిన బోలెడన్ని విషయాలు నాకు అవగతమయ్యాయి..’ అంటోన్న అశ్విని.. చదువు పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు బెంగళూరులోని ‘సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీ’లో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించింది.

వాళ్ల సమస్యలు తెలిసినదాన్ని!

సుమారు పదేళ్లుగా దళితులు, ఆదివాసీలు, మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తోన్న అశ్విని.. ఈ క్రమంలో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. గతంలో ‘అమ్నెస్టీ’ సంస్థతో చేతులు కలిపిన ఆమె.. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ఆదివాసీ తెగల భూ హక్కుల కోసం పోరాటం చేసింది. ‘ఈ సమాజంలో దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటోన్న సమస్యలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. ఒక దళిత మహిళగా, ఆదివాసీ తెగలతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా.. ఆ వర్గాలకు చెందిన మహిళల దీనస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ముఖ్యంగా వారు కులపరంగా, వృత్తిపరంగా, అనేక విషయాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. కులం, జాతి.. ఈ రెండు విషయాల్లో ప్రస్తుతం సమాజంలో నెలకొన్న ప్రతికూల అంశాలు, సారూప్యతలను అర్థం చేసుకొని.. వాటిని అందరితో పంచుకోవాల్సిన అవసరం ఉందనిపించింది.. నా ప్రయత్నమంతా దీనికోసమే!’ అంటోంది అశ్విని.

ఐరాస ప్రత్యేక దూతగా..!

ఇలా దశాబ్ద కాలంగా దళితులు, ఆదివాసీలు, మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తోన్న అశ్విని కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి.. ఈ సంస్థ ‘మానవ హక్కుల కౌన్సిల్‌’కు స్వతంత్ర నిపుణురాలిగా/ప్రత్యేక దూతగా ఇటీవలే ఆమెను నియమించింది. ఇది వరకు ఈ పదవిలో ఉన్న జాంబియా ఇటీవలే రాజీనామా చేయడంతో.. 47 మందితో కూడిన మానవ హక్కుల కౌన్సిల్ ఈ నియామకం చేసింది. తద్వారా ఈ పదవికి ఎంపికైన తొలి దళిత, ఆసియా, భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అశ్విని. నవంబర్‌ 1న బాధ్యతలు చేపట్టనున్న ఆమె.. ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాత్యంహంకారం, జాతి వివక్ష, విదేశీయుల పట్ల ద్వేషపూరిత భావన మొదలైన అంశాలకు సంబంధించిన సమకాలీన పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌కు నివేదిక సమర్పించడం ఆమె విధి.

‘ఒక దళిత మహిళగా వాళ్ల సమస్యల్ని అంతర్జాతీయ వేదిక పైకి తీసుకెళ్లే అరుదైన అవకాశం నన్ను వరించింది. చాలా కాలంగా దళిత మహిళలు నైపుణ్యాలు ఉన్నప్పటికీ లింగ వివక్ష కారణంగా ఉన్నత స్థానాల్ని పొందలేకపోతున్నారు. నాకు అప్పగించిన ఈ బృహత్తర బాధ్యతతో ఇలాంటి మహిళలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా..’ అంటోంది అశ్విని. ప్రస్తుతం దళితుల హక్కుల కోసం ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడమే కాదు.. తానే స్వయంగా ‘Zariya’ పేరుతో ఓ ఎన్జీవోనూ నడుపుతోందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్