ప్లాస్టిక్‌ డబ్బాల్ని శుభ్రం చేయాలంటే..!

స్నాక్స్‌ నిల్వ చేసుకోవడానికి, మిగిలిపోయిన పదార్థాల్ని పెట్టుకోవడానికి, పప్పుల్లాంటి నిత్యావసరాలు భద్రపరచుకోవడానికి.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం చాలా ఇళ్లల్లో ఇప్పటికీ ప్లాస్టిక్ డబ్బాల్ని ఉపయోగిస్తున్నారు.

Published : 03 Feb 2024 21:17 IST

స్నాక్స్‌ నిల్వ చేసుకోవడానికి, మిగిలిపోయిన పదార్థాల్ని పెట్టుకోవడానికి, పప్పుల్లాంటి నిత్యావసరాలు భద్రపరచుకోవడానికి.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం చాలా ఇళ్లల్లో ఇప్పటికీ ప్లాస్టిక్ డబ్బాల్ని ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని వాడడమే కాదు.. ఎప్పటిప్పుడు శుభ్రం చేయడమూ ముఖ్యమే! లేదంటే వాటిల్లో నిల్వ చేసిన కూరలు, ఇతర పదార్థాల వాసన ఓ పట్టాన వదలదు.. అలాగని సబ్బు నీటితో పైపైన కడిగేసి ఇతర పదార్థాల్ని ఆ డబ్బాలో నిల్వ చేసినా అదో రకమైన వాసన వస్తుంటుంది. మరి, ఇలా జరగకూడదంటే వీటిని శుభ్రం చేసే క్రమంలో ఈ చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

⚛ ముందుగా చల్లటి నీటితో ప్లాస్టిక్‌ డబ్బాల్ని/పాత్రల్ని ఓసారి కడిగేయాలి. ఆ తర్వాత వీటిలో గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌ సోడా వేయాలి. దీన్ని ఓ రోజంతా అలాగే ఉంచి.. ఆపై సబ్బునీటితో కడిగేస్తే సరిపోతుంది. బేకింగ్‌ సోడా పాత్రల్లోని చెడు వాసనను దూరం చేయడంలో సహకరిస్తుంది.

⚛ కాఫీ పిప్పితో కూడా ప్లాస్టిక్‌ డబ్బాల నుంచి వచ్చే దుర్వాసనల్ని దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం కొద్దిగా ఈ పిప్పిని డబ్బాలో వేసి రోజంతా అలాగే ఉంచేయాలి. తద్వారా కాఫీ పిప్పి ఆ దుర్వాసనను పీల్చేసుకుంటుంది.

⚛ నిమ్మరసంలోని సిట్రికామ్లం పాత్రలకు అంటుకున్న పదార్థాల వాసనను దూరం చేయడంలో మరింత సమర్థంగా పనిచేస్తుంది. ఇందుకోసం నిమ్మచెక్కతో ఆ పాత్రను ఓసారి రుద్ది.. ఆపై సబ్బు నీటితో కడిగేయాలి.

⚛ కొన్ని ప్లాస్టిక్‌ డబ్బాలు ఎంత శుభ్రం చేసినా అందులో నిల్వ చేసిన పదార్థాల వాసన ఓ పట్టాన వదలదు. అలాంటప్పుడు వెనిగర్‌తో వాటిని శుభ్రపరిస్తే ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో ఆయా పాత్రలు/డబ్బాల్లో.. చల్లటి నీరు/గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో పావు కప్పు వెనిగర్‌ వేయాలి. ఇలా ఐదారు గంటల పాటు దాన్ని పక్కన పెట్టి.. ఆపై సబ్బు నీటితో కడిగేయాలి. వెనిగర్‌ సహజసిద్ధమైన డియోడరెంట్‌గా పనిచేస్తుంది.

⚛ వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ కూడా ప్లాస్టిక్‌ డబ్బాల నుంచి వచ్చే వాసనల్ని తొలగించడంలో సహకరిస్తుంది. ఈ క్రమంలో ఆయా డబ్బాల్ని వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌తో నేరుగా రుద్దాలి. లేదంటే డబ్బాలో గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో కొద్దిగా వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి.. ఓసారి షేక్‌ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక రోజంతా పక్కన పెట్టేయాలి. ఆపై సాధారణ పాత్రల్లాగే సబ్బు నీటితో కడిగేస్తే సరిపోతుంది.

⚛ ప్లాస్టిక్‌ డబ్బాల నుంచి దుర్వాసన వస్తున్నప్పుడు ఒక చార్‌కోల్‌ ముక్కను అందులో వేసి మూత పెట్టేయాలి. ఇలా రెండు రోజులు దాన్ని ముట్టకుండా పక్కన పెట్టేస్తే.. ఆ వాసనంతా చార్‌కోల్‌ పీల్చేసుకుంటుంది.

⚛ కొన్నిసార్లు డబ్బాల్ని కడిగిన వెంటనే మూత పెట్టేసి పక్కనుంచుతాం. అయితే ఈ క్రమంలో అవి పూర్తిగా ఆరకపోయినా అందులో నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు వాటిని మూత తీసి ఓ రోజంతా గాలి తగిలేలా ఉంచాలి.. లేదంటే నేరుగా ఎండ పడే చోట ఉంచినా ఫలితం ఉంటుంది.

⚛ రోజూ పాలు తెచ్చుకునే ప్లాస్టిక్‌ డబ్బాలు/బాటిల్స్‌ నుంచి అదో రకమైన వాసన వస్తుంటుంది. ఇక ఈ వాసన ఎంత కడిగినా పోదు. అలాంటప్పుడు ఆ డబ్బా/బాటిల్‌లో కొద్దిగా ఉప్పు వేసి ఒక రోజంతా పక్కన పెట్టేయాలి. తద్వారా చక్కటి ఫలితం ఉంటుంది.

⚛ ఒక న్యూస్‌పేపర్‌ని మడిచి వాసన వచ్చే ప్లాస్టిక్‌ డబ్బాలో చొప్పించి మూత పెట్టేయాలి. ఇలా దీన్ని ఒకట్రెండు రోజులు పక్కన పెట్టేయాలి. ఈ చిట్కా వల్ల కూడా ప్లాస్టిక్‌ డబ్బాల్లోని దుర్వాసనలు దూరమవుతాయట!

అయితే ఒక్క విషయం.. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి చెప్పి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మాత్రం మరవద్దు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్