Bharti Singh: అందుకే బ్రెస్ట్‌ పంప్‌ ఉపయోగిస్తున్నా!

కొత్తగా తల్లైన మహిళలు అటు పాపాయిని, ఇటు కెరీర్‌ని సమన్వయం చేసుకునే క్రమంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే తిరిగి విధుల్లో చేరాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ చిన్నారులకు తల్లిపాలు అందించడానికి బ్రెస్ట్‌ పంప్స్‌ ఎంతగానో.....

Published : 23 Apr 2022 14:18 IST

కొత్తగా తల్లైన మహిళలు అటు పాపాయిని, ఇటు కెరీర్‌ని సమన్వయం చేసుకునే క్రమంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే తిరిగి విధుల్లో చేరాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ చిన్నారులకు తల్లిపాలు అందించడానికి బ్రెస్ట్‌ పంప్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాలి. అందుకే తన కొడుకు కోసం తానూ ఈ పద్ధతినే పాటిస్తున్నానని చెబుతోంది లాఫ్టర్‌ క్వీన్‌ భారతీ సింగ్‌. ఇటీవలే కొడుక్కి జన్మనిచ్చిన ఆమె.. తల్లైన 12వ రోజు నుంచే తిరిగి షూటింగ్స్‌కి హాజరవుతోంది. ఇలా తాను ఇంట్లో లేనప్పుడు బిడ్డకు తల్లిపాలు అందించడానికి బ్రెస్ట్‌ పంప్‌ని ఉపయోగిస్తున్నానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ బబ్లీ మామ్‌. ఈ నేపథ్యంలో.. పసిబిడ్డకు తల్లి నేరుగా పాలివ్వడం మంచిదా? లేదంటే పిండి నిల్వ చేసిన పాలు తాగించడం మంచిదా? అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. మరి, దీనికి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

కమెడియన్‌ క్వీన్ భారతీ సింగ్‌ - హర్ష్‌ లింబాచియా దంపతులకు ఏప్రిల్‌ 3న పండంటి కొడుకు పుట్టిన విషయం తెలిసిందే! అయితే బిడ్డ పుట్టకముందు తొమ్మిది నెలల పాటు విధులకు హాజరైన ఆమె.. బిడ్డ పుట్టిన 12వ రోజు నుంచే తిరిగి కెరీర్‌ని ప్రారంభించింది. దీంతో ‘పసి బిడ్డను ఇంట్లో వదిలి వెళ్లడమేంటి..? డబ్బు కోసమే ఈ తాపత్రయమా?’ అంటూ చాలామంది ఆమెపై విమర్శలు గుప్పించారు. అయితే ఇటీవలే తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన భారతి.. అసలు తను ఎందుకిలా చేయాల్సి వస్తుందో ఇలా విడమరిచి చెప్పుకొచ్చింది.

డబ్బు కోసం కాదు.. పనిపై నిబద్ధత!

‘పసి బిడ్డను ఇంట్లో వదిలేసి విధులకు వెళ్లాల్సిన అవసరమేంటని చాలామంది నన్ను అడుగుతున్నారు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నానని అన్న వారూ లేకపోలేదు. అయితే నేను పనిపై నిబద్ధతతోనే ఇదంతా చేస్తున్నానన్న విషయం ఎవరికీ తెలియదు. కెరీర్‌లో నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే విధులకు హాజరవ్వాల్సి వస్తోంది. మరికొందరు నా నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు కూడా! అయితే నేను విధులకు హాజరయ్యే క్రమంలో నా బిడ్డను నిర్లక్ష్యం చేయట్లేదు. రోజంతా తన ఆకలి తీర్చడానికి బ్రెస్ట్‌ పంప్‌ సహాయంతో పాలు తీసి భద్రపరిచి వెళ్తున్నాను. ఇక ఇంట్లో వాడి అమ్మమ్మ, నాన్నమ్మ.. ఇలా వాడిని కంటికి రెప్పలా చూసుకోవడానికి బోలెడంత మంది ఉన్నారు.. కాబట్టే ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసుకోగలుగుతున్నా..’ అంటూ ఓ సందర్భంలో తనపై వచ్చిన విమర్శల్ని తిప్పి కొట్టింది భారతి.

బ్రెస్ట్‌ పంప్‌ ఎప్పుడు అవసరం?!

భారతి ఒక్కర్తే కాదు.. ఈ రోజుల్లో చాలామంది మహిళలు వివిధ కారణాల రీత్యా పసి బిడ్డను ఇంట్లో కుటుంబ సభ్యుల వద్ద వదిలేసి విధులకు వెళ్తున్నారు. ఇలాంటి తల్లులందరికీ బ్రెస్ట్‌ పంప్‌ ఓ వరంగా మారిందని చెప్పచ్చు. అయితే ఈ తరుణంలో తల్లి బిడ్డకు నేరుగా పాలివ్వడం మంచిదా? లేదంటే పిండిన పాలు పట్టడం మంచిదా? అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. నిజానికి పిండిన పాల కంటే బిడ్డ తల్లిపాలు నేరుగా తాగడమే మంచిదంటున్నారు నిపుణులు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం బ్రెస్ట్‌ పంప్‌తో పిండి.. బాటిల్‌ లేదా ఇతర పద్ధతుల ద్వారా పాలు పట్టడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇంతకీ, అదెప్పుడంటే..!

* నవజాత శిశువు (ప్రి-మెచ్యూర్‌ బేబీ) పుట్టినప్పుడు.. తల్లీబిడ్డలిద్దరూ తొలినాళ్లలో కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో బ్రెస్ట్‌ పంప్‌ ఉపయోగపడుతుంది.

* కొంతమంది పిల్లలు నేరుగా రొమ్ము పట్టుకొని పాలు తాగలేరు. మరికొంతమంది చిన్నారుల్లో అరుదుగా Cleft Palate (పైపెదవి చీలిక/గ్రహణం మొర్రి) సమస్య ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రెస్ట్‌ పంప్‌తో పాలు తీసి.. బాటిల్‌ లేదా ఇతర పద్ధతుల్లో పిల్లలకు పట్టించచ్చు.

* తల్లీబిడ్డలిద్దరూ ఏదైనా అనారోగ్యాల కారణంగా దూరంగా ఉండాల్సి వస్తే.. బిడ్డ నేరుగా పాలు తాగడం కుదరదు.. కాబట్టి ఇప్పుడూ బ్రెస్ట్‌ పంప్‌ వాడుకోవచ్చు.

* పిల్లలు నిరంతరాయంగా తల్లిపాలు తాగడం వల్ల రొమ్ముల్లో నొప్పి, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయి. ఇలాంటప్పుడు బ్రెస్ట్‌ పంప్‌ కొంతవరకు ఉపశమనం ఇస్తుంది.

అయితే ఇలా అత్యవసర సమయాలు మినహాయిస్తే.. మిగతా సమయాల్లో నేరుగా తల్లిపాలు పట్టడమే మంచిదంటున్నారు నిపుణులు.

సౌకర్యం కోసమైతే వద్దు!

కొంతమంది తల్లులు అసౌకర్యంగా ఉంటుందనో, అందం తగ్గిపోతుందనో.. ఇలా ఏవేవో కారణాల వల్ల బిడ్డకు నేరుగా పాలిచ్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలో బ్రెస్ట్‌ పంప్స్‌ని ఆశ్రయిస్తుంటారు. అయితే దీనివల్ల బిడ్డకు తల్లిపాలు సరిపడా అందకపోగా.. తల్లికీ పలు సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.

* విధులు/ఇతర పనుల రీత్యా ఎక్కువ సమయం పాలు పిండకపోవడం వల్ల తల్లి స్తనాలు గడ్డల్లా మారతాయి. తద్వారా భరించలేనంత నొప్పి వస్తుంది. కొన్నిసార్లు జ్వరం కూడా వచ్చే ప్రమాదం ఉంది.

* అలాగే.. బిడ్డ నేరుగా తాగడం వల్ల వక్షోజాల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయి. అదే బ్రెస్ట్‌ పంప్‌తో పిండితే అంతగా పాలు రావు.. కాబట్టి ఇలాంటప్పుడు క్రమంగా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.

* సిజేరియన్‌ డెలివరీ అయిన తల్లులు బిడ్డకు నేరుగా పాలివ్వకూడదన్న అపోహ కూడా కొంతమందిలో ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల బిడ్డ బరువు కుట్లపై పడి అసౌకర్యంగా ఉంటుందని వారి భావన! అయితే ఇది ఎంతమాత్రమూ కరక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. ఇంకా చెప్పాలంటే.. బిడ్డకు నేరుగా పాలివ్వడం వల్ల సిజేరియన్‌ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి అంత అసౌకర్యంగా అనిపిస్తే.. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ పిల్లోస్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించడం ఉత్తమం.

పాపాయిని ఇబ్బంది పెట్టద్దు!

కారణమేదైనా పాపాయికి ఒకసారి నేరుగా తల్లిపాలు, మరోసారి పంపింగ్‌ చేసిన పాలు బాటిల్‌తో పట్టడం వల్ల బిడ్డ గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. అంటే.. బాటిల్‌తో తాగడం వల్ల వారికి సులభంగా పాలు అందుతాయి. అదే నిపుల్‌ అయితే నోటితో బలంగా లాగాల్సి వస్తుంది. ఈ క్రమంలో సౌకర్యానికి బిడ్డ ప్రాధాన్యమిస్తాడు. దీంతో బాటిల్‌ ఫీడింగ్‌కే అలవాటు పడతాడట! కాబట్టి సాధ్యమైనంత వరకు తల్లిపాలే నేరుగా అందించడం మంచిదన్నది నిపుణుల మాట!

ఇద్దరికీ మంచిది!

* ఆరు నెలల వరకు పాపాయికి తల్లిపాలే ఆహారం, నీళ్లు.. అన్నీ! పైగా ఈ పాలు సకల పోషకాల మిళితం కూడా! బిడ్డకు ఉన్న ఎలాంటి అనారోగ్యాలనైనా తల్లిపాలతో దూరం చేయచ్చని చెబుతుంటారు నిపుణులు.

* అలాగే రొమ్ము నుంచి పాలు తాగడానికి బిడ్డ నోరు పెద్దగా తెరవడం వల్ల నోటి భాగాలకు సరైన వ్యాయామం కూడా అందుతుంది.

* అటు.. తల్లి కూడా ప్రసవానంతర ఒత్తిళ్లు, అధిక బరువు తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండచ్చు.

* తల్లి తన పొత్తిళ్లకు హత్తుకొని బిడ్డకు పాలివ్వడం వల్ల బిడ్డ సురక్షితమైన భావనకు గురవుతాడట! ఇది తల్లీబిడ్డలిద్దరి మధ్య అనుబంధాన్ని దృఢం చేస్తుంది.

సో.. ఏ విధంగా చూసినా బ్రెస్ట్‌ పంప్‌ కంటే తల్లి పాలు నేరుగా తాగడమే మంచిదన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి తప్పని పరిస్థితులు మినహాయిస్తే.. మిగతా సమయాల్లో నేరుగా పాలు పట్టడానికే తల్లులు చొరవ చూపాలంటున్నారు నిపుణులు. ఇక పాల ఉత్పత్తి కోసం పోషకాహార నిపుణులు సూచించిన చిట్కాలు పాటించడం ఉత్తమం.

మరో విషయం ఏంటంటే.. పాలిచ్చే క్రమంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా, రొమ్ముల్లో ఏదైనా సమస్య వచ్చినా, బిడ్డ పాలు తాగకపోయినా.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్