కోపమొస్తే ఏం మాట్లాడతాడో తెలీదు.. విడిపోవాలనుకుంటున్నా!

నాకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది. పాప, బాబు ఉన్నారు. నా భర్తకి చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంటుంది. మొదటి నుంచి అంతే. కోపంలో ఏం మాట్లాడతాడో తెలీదు. బూతులు తిడతాడు. ఎక్కడున్నా సరే నన్ను, మా కుటుంబ సభ్యులను చులకన చేసి మాట్లాడతాడు.

Published : 10 Aug 2023 12:29 IST

నాకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది. పాప, బాబు ఉన్నారు. నా భర్తకి చిన్న విషయాలకే కోపం వచ్చేస్తుంటుంది. మొదటి నుంచి అంతే. కోపంలో ఏం మాట్లాడతాడో తెలీదు. బూతులు తిడతాడు. ఎక్కడున్నా సరే నన్ను, మా కుటుంబ సభ్యులను చులకన చేసి మాట్లాడతాడు. ఎన్ని విధాలుగా చెప్పినా అలాగే చేస్తాడు. ఒక్కోసారి నాకు తన నుంచి విడిపోవాలనిపిస్తుంది. కానీ నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో? అని ఆగిపోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఒక్కరోజు కూడా నన్ను హేళనగా మాట్లాడని రోజు లేదు. అతన్ని ఎలా మార్చుకోవాలో దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. అతని కోపం, ఆవేశం, నోటి దురుసు వంటి విషయాల గురించి ఈపాటికి మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుంది. కాబట్టి అతను మాములుగా ఉన్నప్పుడు దానివల్ల కలిగే నష్టం గురించి వివరించే ప్రయత్నం చేయండి. తనకు కోపం వచ్చినప్పుడు దూకుడుగా వ్యవహరించకుండా.. సాధారణంగా ఉన్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎందుకు అలా ప్రవర్తించాడు అనేది కూడా విశ్లేషించండి. దానికి ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే కోపం వచ్చినా సౌమ్యంగా మాట్లాడడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయండి.

మీ భర్త కోపాన్ని నియంత్రించడానికి మానసిక నిపుణుల సహాయం తీసుకొని, తనకు తానుగా నియంత్రించుకునే పద్ధతుల గురించి విడమరిచి చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఇద్దరు పిల్లలున్నారని చెప్పారు. అతని కోపం, నోటి దురుసుతనం వల్ల పిల్లలకు కలిగే నష్టాలు, దుష్పరిణామాల గురించి కూడా వివరించే ప్రయత్నం చేయండి. నిరంతరం చేసే ధ్యానం, యోగా వంటివి కూడా కోపాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని అలవాటు చేసే ప్రయత్నం చేయండి.

ఏ విషయంలోనైనా స్వీయ అనుభవాలే సమస్యకు పరిష్కారం వెతకడంలో ఉపయోగపడతాయి. కాబట్టి తనంతట తానుగా తన మానసిక స్థితిని విశ్లేషించుకుంటే సరైన పరిష్కారం దొరకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతను ఆ స్థితికి చేరుకునే విధంగా మీ వంతు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందేమో ఆలోచించండి. అలాగే ఒకవేళ తనకు తాను మానసిక నిపుణులను సంప్రదిస్తే.. వారు కొన్ని పద్ధతులు చెప్పే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అతనికి మీ తోడ్పాటుని అందించండి.

ఒకవేళ- ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పు రాకపోతే మాత్రం బానిసలా పడి ఉంటూ మీ ఆత్మ గౌరవాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. మీ విద్యార్హతలను బట్టి మీ కాళ్ల పైన మీరు నిలబడడానికి ఉన్న అన్ని అవకాశాల గురించి పరిశీలించండి. ఆర్థికంగా మీకంటూ మీరు ఒక ఆధారాన్ని ఏర్పర్చుకోగలిగితే పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆందోళన ఉండదు. బాగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్