ఇవి.. పెళ్లికి ముందే!

పెళ్లి.. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. సంతోషం, సరదాలతో పాటు బరువూబాధ్యతలను కూడా వెంట తెస్తుందీ బంధం. ఇలాంటి జీవితాన్ని పూర్తిగా ఆనందించాలంటే.. ఆర్థికంగా బలంగా ఉండడం ఎంతో అవసరం. ఈ క్రమంలో పెళ్లికి ముందే కొన్ని ప్రణాళికలను....

Published : 13 Nov 2022 11:19 IST

పెళ్లి.. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. సంతోషం, సరదాలతో పాటు బరువూబాధ్యతలను కూడా వెంట తెస్తుందీ బంధం. ఇలాంటి జీవితాన్ని పూర్తిగా ఆనందించాలంటే.. ఆర్థికంగా బలంగా ఉండడం ఎంతో అవసరం. ఈ క్రమంలో పెళ్లికి ముందే కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు. ఎందుకంటే ఇది మీ ఒక్కరికే సంబంధించిన విషయం కాదు.. ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహనతో జీవితంలో ముందడుగేసే అంశం. ఈక్రమంలో ఆర్థిక అంశాలకు సంబంధించి పెళ్లికి ముందు నుంచే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

మాట్లాడుకోవాలి..

ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేగానీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా నెగ్గుకురాలేకపోతున్నారు. కానీ కొందరి ఆలోచనలు వేరుగా ఉండచ్చు. కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలని కోరుకునే వారూ ఉంటారు. అందుకే కాబోయే మీ జీవిత భాగస్వామితో పెళ్లి తర్వాత ఖర్చుల గురించి మాట్లాడి ఒక అవగాహనకు రావాలి. వివాహం తర్వాత ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారా? లేదా మీరు ఇంట్లోనే ఉండి కుటుంబ బాధ్యత, పిల్లల సంరక్షణ వంటి విషయాలపై శ్రద్ధ తీసుకుంటారా? వంటి విషయాల గురించి ముందుగానే మాట్లాడుకొని ఓ అవగాహనకు రావడం అవసరం. ఫలితంగా, కుటుంబం మొత్తానికి నెలసరి బడ్జెట్ ఎంతవుతుంది? దానికోసం అదనంగా మీ ఇద్దరూ కలిసి చేయాల్సిన కృషి ఏంటి? అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

అప్పుల తిప్పలు..

కొన్ని విషయాల్లో మొహమాటం లేకుండా ఉండడమే శ్రేయస్కరం. కాబోయే భార్యాభర్తల విషయంలోనూ ఇది మినహాయింపు కాదు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో. ఈ క్రమంలో మీ జీవిత భాగస్వామి ఆస్తులు, అప్పుల వివరాలు కనుక్కోండి. ఇందులో తప్పులేదు. ఎందుకంటే.. పెళ్లి తర్వాత వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు ఇద్దరూ సమానంగా నెరవేర్చాల్సి వచ్చినప్పుడు మీకు కాబోయే భాగస్వామి చేసిన అప్పులు సమస్యగా మారకుండా ఉండాలి కదా? అదేవిధంగా లోన్‌లు ఏమైనా తీసుకున్నారేమో కనుక్కోండి. వివాహం తర్వాత రుణాల వాయిదాలు కట్టగలం అన్న నమ్మకం ఇద్దరిలో ఏర్పడడం ముఖ్యమని గుర్తుంచుకోండి. అలాగే మీకు సంబంధించిన అప్పులు, ఇతర లోన్ల సంగతి కూడా నిజాయతీగా మీ భాగస్వామితో పంచుకోండి.

ఆది నుంచే పొదుపు మంత్రం

వివాహ ఘడియలు దగ్గర పడుతున్నాయి అనుకున్నప్పుడు కాకుండా కాస్త ముందు నుంచే పొదుపు పాటిస్తే ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా ఉంటారు. మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడినట్త్లెతే, మొదటి నెల జీతంలో నుంచే పొదుపు చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆర్‌డీ.. తదితర విధానాల్లో పొదుపు-మదుపు చేయడం వల్ల మీకు భవిష్యత్తులో అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఇబ్బంది ఎదురవ్వదు. ఒకవేళ ఇల్లు, వాహన రుణం తీసుకుంటే, ఆ అప్పు వివాహ సమయానికి వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మేలు. దీనివల్ల పెళ్లి తర్వాత పెరిగిపోయే బడ్జెట్‌ను కాస్త తగ్గించుకునే వీలు కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్