ఇవి ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయట!

కరోనా వచ్చాక అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. వైరస్‌ బారిన పడకూడదని రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. జీవనశైలితో పాటు ఆహారపుటలవాట్లలోనూ మార్పులు చేసుకుంటున్నాం. అయితే ఈ క్రమంలో మనం రోజూ తీసుకునే కొన్ని పదార్థాలు ఇమ్యూనిటీని పెంచడానికి బదులు తగ్గిస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Published : 30 Jun 2021 17:17 IST

కరోనా వచ్చాక అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. వైరస్‌ బారిన పడకూడదని రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. జీవనశైలితో పాటు ఆహారపుటలవాట్లలోనూ మార్పులు చేసుకుంటున్నాం. అయితే ఈ క్రమంలో మనం రోజూ తీసుకునే కొన్ని పదార్థాలు ఇమ్యూనిటీని పెంచడానికి బదులు తగ్గిస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తద్వారా మనకు తెలియకుండానే వివిధ రకాల అనారోగ్యాలు మనపై దాడిచేసే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి అలాంటి పదార్థాల్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు. ఇంతకీ అవేంటంటే..!

చక్కెర మితంగా!

ఇమ్యూనిటీని తగ్గించే పదార్థాల్లో ఇది ముందుంటుంది. అయితే మనసును తృప్తి పరచుకోవడం కోసం ఎప్పుడో ఒకసారి మితంగా తింటే పర్లేదు.. కానీ మోతాదు మించితే మాత్రం దీర్ఘకాలిక అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. చక్కెర అధికంగా ఉండే పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో ట్యూమర్‌ నెక్రోసిస్‌ ఫ్యాక్టర్‌-ఆల్ఫా, సి-రియాక్టివ్‌ ప్రొటీన్‌, ఇంటర్‌ల్యూకిన్‌-6 లాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్లు తయారవుతాయి. ఇవి రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అంతేకాదు.. రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా క్షీణిస్తుంది. దీని ప్రభావం జీవక్రియల పనితీరుపై పడుతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి ఇదీ ఓ కారణమేనట!

ఉప్పు ఎక్కువైతే..!

ఎన్ని మసాలాలు దట్టించినా ఉప్పులేని కూరలు, వంటకాలు నాలుకకు అంటవంటారు. మన వంటగదిలో ఉప్పుకున్న ప్రాధాన్యం అటువంటిది మరి! అయితే ఉప్పును తగినంత వాడితే ఎన్ని లాభాలున్నాయో.. అతిగా వాడితే అన్నే నష్టాలున్నాయంటున్నారు నిపుణులు. ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల వివిధ అనారోగ్యాల బారిన పడి ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా దట్టించి తయారుచేసే చిప్స్‌, బేకరీ ఐటమ్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, జంక్‌ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్‌, పేగుల్లో ఇన్ఫెక్షన్‌/వాపు.. వంటి సమస్యలొస్తాయట! కాబట్టి దీన్ని ఎంత అవసరమో అంతే తీసుకోవడం మంచిది.

వీటికి ‘నో’ చెప్పాల్సిందే!

ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, పొటాటో చిప్స్‌, ఫ్రైడ్‌ చికెన్‌, ఫ్రైడ్‌ ఫిష్‌.. అధిక ఉష్ణోగ్రతల వద్ద తయారుచేసిన వంటకాలు, మసాలాలు దట్టించిన పదార్థాలను తీసుకోవడం వల్ల నాలుకకు రుచి తప్ప ఎలాంటి ప్రయోజనముండదంటున్నారు నిపుణులు. అంతేకాదు వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు, కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఫలితంగా రోగనిరోధక శక్తి క్షీణించి.. లేనిపోని అనారోగ్యాలు చుట్టుముడతాయట! కాబట్టి వీటిని ఎప్పుడో ఒకసారి అది కూడా ఇంట్లో శుభ్రమైన వాతావరణంలో తయారుచేసుకొని తినడం మంచిదంటున్నారు.

కెఫీన్‌తో ముప్పే!

కాఫీ, టీలలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కెఫీన్‌ అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు. వీటితో పాటు శీతల పానీయాలు, శక్తినిచ్చే పానీయాలు (ఎనర్జీ డ్రింక్స్‌) కూడా దూరం పెట్టమంటున్నారు. వీటిలోనూ కెఫీన్‌, చక్కెర, ఆర్టిఫీషియల్‌ స్వీట్‌నర్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. అందుకే కాఫీ/టీ వంటివి తాగకుండా ఉండలేని వారు రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు చాలంటున్నారు.

‘ఒమేగా-6’కి బదులుగా!

సన్‌ఫ్లవర్‌, మొక్కజొన్న, సోయాబీన్‌.. వంటి నూనెల్లో ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొ-ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్లు తయారవుతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయి. అందుకే వీటికి బదులుగా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, నట్స్‌, గింజలు.. వంటివి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. వీటిలోని DHA, EPA శరీరంలోని వాపును తగ్గించి రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరుస్తుందట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్