సహజసిద్ధంగా.. పట్టులా!

స్ట్రెయిట్‌నింగ్‌ కోసం శిరోజాలను తీవ్రమైన వేడికి గురి చేస్తారు. దాంతో అవి పొడిబారే ప్రమాదం ఉంది. తేమ కోల్పోయి, చివర్లు చిట్లిపోయి పెరుగుదల ఆగుతుంది. ఇలాకాకుండా సహజ పదార్థాలతోనే మృదువైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటే...

Published : 02 Sep 2022 00:34 IST

స్ట్రెయిట్‌నింగ్‌ కోసం శిరోజాలను తీవ్రమైన వేడికి గురి చేస్తారు. దాంతో అవి పొడిబారే ప్రమాదం ఉంది. తేమ కోల్పోయి, చివర్లు చిట్లిపోయి పెరుగుదల ఆగుతుంది. ఇలాకాకుండా సహజ పదార్థాలతోనే మృదువైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటే...

రెండు చెంచాల కలబందగుజ్జుకు చెంచా చొప్పున నిమ్మరసం, ఆముదం, రెండు చెంచాల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు లేపనంలా పట్టించి ఆరనిచ్చి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తల స్నానం చేస్తే చాలు. కలబందలోని పోషకాలు, ఖనిజ లవణాలు జుట్టును బలంగా ఉంచుతాయి. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్‌, ఏ, బీ12, సీ, ఈ విటమిన్లు కుదుళ్లను ఆరోగ్యవంతం చేస్తాయి. చుండ్రు, దురద వంటి సమస్యలకు దూరంగా ఉంచి రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. దీంతో రాలే సమస్య దూరమై, జుట్టు చక్కగా పెరుగుతుంది. అలాగే నిమ్మరసంలోని సి విటమిన్‌ మాడుపై ఇన్‌ఫెక్షన్లు రాకుండా సంరక్షిస్తుంది. జుట్టును మెరిపిస్తుంది. ఆముదం శిరోజాలను రాలకుండా నియంత్రిస్తుంది. అంతే కాదు, పొడవుగా జారుతున్నట్లుగా అనిపించేలా మృదువైన పట్టుకుచ్చు లాంటి జుట్టును సొంతం చేస్తుంది.

అరటిపండుతో..

ఒక అరటిపండు గుజ్జుకు చెంచా ఆర్గానిక్‌ తేనె, కప్పు పెరుగు, రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపిన మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి రాయాలి. అరగంట ఆరనిచ్చి ఎక్కువ నీటితో జుట్టును శుభ్రం చేయాలి. ప్రొటీన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు, బీ6, సి విటమిన్లు అరటిపండులో మెండుగా ఉంటాయి. ఇవి శిరోజాలను రాలకుండా కాపాడి, ఆరోగ్యంగా ఉంచుతాయి. తేనె జుట్టుకు మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది. ఆలివ్‌నూనె జుట్టు చివర్లు చిట్లకుండా కాపాడుతుంది. చుండ్రు సమస్యను దరికి చేరనివ్వదు.

నాలుగుచెంచాల ఆలివ్‌నూనెకు ఒక గుడ్డును కలిపి ఆ మిశ్రమాన్ని తలకు మర్దనా చేసి పావుగంట తర్వాత శుభ్రం చేయాలి. గుడ్డులోని ప్రొటీన్లు శిరోజాలకు కండిషనర్‌లా పనిచేస్తాయి. ఫ్యాటీయాసిడ్స్‌ ఉన్న ఈ మిశ్రమం మాడును ఆరోగ్యంగా ఉంచి, జుట్టును మృదువుగా మారుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్