Published : 16/10/2022 00:34 IST

అగ్ర తారల స్టైల్‌ గురువులు

తెరమీద చూసి తారలను ఇష్టపడతాం. తారలూ అభిమానులను ఎలా మెప్పించాలా అని ప్రయత్నిస్తుంటారు. ఇదసలే డిజిటల్‌ కాలం! ఎప్పుడు ఎటు నుంచి కెమెరాలు క్లిక్‌మంటాయో తెలీదు. ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలిగా మరి! అందుకే స్టైలిస్ట్‌లను ఎంచుకొంటున్నారు. వీళ్ల పని సినిమా, దాని ప్రచారాలు, ఫంక్షన్లకే పరిమితమవ్వడం లేదు. వ్యాయామం నుంచి పండుగలు, పర్యటనలు.. ప్రతి అడుగులోనూ ఆహార్యం విషయంలో స్టైలిస్ట్‌ల సలహా తప్పనిసరి. అలా అగ్ర తారల్ని తీర్చిదిద్దుతున్న వారిలో కొందరు వీళ్లు..

సోనమ్‌ని తీర్చిదిద్ది.. తాన్యా

‘ఒక్క అవకాశం’ కోసం ఏళ్ల తరబడి చూసేవారెందరో! అది తాన్యాకు సోనమ్‌ కపూర్‌ రూపంలో వచ్చింది. నాన్న క్రికెటర్‌. అక్క బాలీవుడ్‌లో కాస్టింగ్‌ డైరెక్టర్‌. అయినా అవకాశాల కోసం చాలానే కష్టపడింది. ఫ్యాషన్‌పై ఆసక్తితో న్యూయార్క్‌లో బ్యాచిలర్స్‌, ముంబయిలో పీజీ చేసింది. ప్రాక్టికల్‌గానే ఎక్కువ నేర్చుకోగలమని కాలేజ్‌ ఎగ్గొట్టి మరీ ఫ్యాషన్‌ షూట్లలో అసిస్టెంట్‌గా చేసేది. తనది ముంబయి. వోగ్‌లో ఇంటర్న్‌గా చేశాక ఓ డిజైనర్‌ వద్ద చేరింది. ఈ క్రమంలో సోనమ్‌ కపూర్‌ పరిచయమైంది. తన పనితీరు చూసిన ఆమె తాన్యాని వ్యక్తిగత స్టైలిస్ట్‌గా నియమించుకుంది. సోనమ్‌ని దుస్తుల విషయంలో స్టైల్‌ ఐకాన్‌గా నిలిపి, స్టార్లను ఆకర్షించింది. ఐశ్వర్యారాయ్‌, కరీనా, శ్రద్ధాకపూర్‌, పూజాహెగ్దే, జాన్వీకపూర్‌, కియారా అడ్వాణీ, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. ఎంతోమంది తన ఖాతాదారులే. లైగర్‌ సినిమాకి అనన్య పాండేతోనూ పనిచేసింది. కేన్స్‌ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాలతోపాటు ఫ్యాషన్‌ షోలకూ సేవలందిస్తోంది. ఎన్నో ఫ్యాషన్‌ సంస్థలకు ప్రచారకర్త కూడా. ‘ధూమ్‌ధామ్‌ కంపెనీ’ ప్రారంభించి యువ డిజైనర్లకు అవకాశాలిస్తోంది. 13 ఏళ్లుగా రాణిస్తున్న తాన్యాకి ప్రపంచాన్ని చుట్టడమంటే ఇష్టమట. ప్రతి అందమైన ప్రదేశం తనలోని సృజనను మేల్కొల్పేదే అంటుందీమె.


విజయ్‌ లుక్‌ మార్చి పల్లవి

గత బిగ్‌బాస్‌ సీజన్‌లో నాగార్జునతో పనిచేసింది పల్లవి సింగ్‌. ఈమెకు తమిళనాట గుర్తింపు ఎక్కువ. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదివిన ఈ చెన్నై అమ్మాయి 2016లో సొంత బ్రాండ్‌ను ప్రారంభించింది. తర్వాత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఎన్నో తమిళ, తెలుగు సినిమాలకు పనిచేసింది. తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌కి స్టైలిస్ట్‌గా మారి ఆయనకి యంగ్‌ లుక్‌ తేవడంలో విజయం సాధించింది. ఈమె సంగీత దర్శకుడు అనిరుధ్‌కీ స్టైలిస్ట్‌. సమంత, కీర్తి సురేష్‌, కాజల్‌, కళ్యాణి ప్రియదర్శిని, సౌందర్య రజనీకాంత్‌, నజ్రియా, శివకార్తికేయన్‌.. ఇలా ఈమె పనిచేసిన స్టార్ల జాబితా పెద్దదే!


‘పుష్ప’ని మెప్పించింది హర్మన్‌

సినిమాలో ఉన్నన్ని మలుపులుంటాయి హర్మన్‌ కౌర్‌ కెరియర్‌లో. పుట్టింది జయపుర. ఉన్నతవిద్యకి హైదరాబాద్‌ వచ్చింది. సైకాలజీలో డిగ్రీ, మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసింది. విమానాలపై ఆసక్తితో కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ సంపాదించింది. హర్మన్‌కి ఫ్యాషన్‌ స్పృహ ఎక్కువ. అది గమనించిన ఓ టీవీ సంస్థ యాంకర్‌ అవకాశమిచ్చింది. దీంతో సరదాగా మొదలుపెట్టింది. టీవీ వాళ్లకు కాస్ట్యూమ్స్‌ పరంగానూ సాయపడేది. క్రమంగా రానా, కాజల్‌, రామ్‌, నితిన్‌, అఖిల్‌, శృతిహాసన్‌, రీతూ వర్మ, ప్రణీత.. ఇలా ఎందరితోనో పనిచేసింది. విజయ్‌ దేవరకొండకి గీతగోవిందం నుంచి అమ్మాయిల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగా పెరిగింది. తనకు రౌడీబాయ్‌ క్రేజ్‌ తేవడం వెనక హర్మన్‌ కృషి ఎంతో! అదే అల్లు అర్జున్‌ని ఆకర్షించింది. నాలుగేళ్లుగా స్టైలిష్‌స్టార్‌తోపాటు ఆయన భార్య స్నేహారెడ్డికీ స్టైలిస్ట్‌గా మారింది. పుష్ప విజయం ఈమెకీ గుర్తింపుని తెచ్చింది. క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తోనూ పనిచేసింది. ఎన్నో బ్రాండ్‌లు ఆమె డేట్స్‌ కోసం చూస్తున్నాయి. దేశంలోనే బాగా గిరాకీ ఉన్న స్టైలిస్ట్‌గా ఎదిగిన హర్మన్‌.. ఆసక్తి ఉన్నది ఎంచుకుంటే ఎవరైనా రాణించొచ్చంటుంది.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని