Updated : 15/03/2023 05:44 IST

నోటికి తాళం వేద్దాం..

బరువు అదుపులో ఉంచుకోవడానికి కఠిన ఆహార నియమాలు పాటించాలి అనుకుంటాం. కొద్దిరోజులకే మనసు చిరుతిళ్లపైకి మళ్లుతుంటుంది. ఒకటి, అరా తీసుకుంటే సరే! పరిధి దాటుతుంటే ఇక డైట్‌ కొనసాగేదెలా? ఈ సమస్యకి చెక్‌ పెట్టాలా?

* శరీరానికి తగినంత నీరు అందకపోయినా ఉప్పు, తీపి పదార్థాలపైకి మనసు మళ్లుతుందట. కాబట్టి, నీళ్లు, పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. వాటి గురించిన ఆలోచన రాదు. సోడా, కార్బోనేటెడ్‌ డ్రింకుల జోలికి వెళ్లకుండా ఉండటమూ తప్పనిసరే!

* సరదాకో.. ఒక్కసారికి ఏమవుతుందనో ప్యాకేజ్‌డ్‌ ఆహారం తీసుకుంటున్నారా? వీటిల్లో చక్కెరలు, ఉప్పు, కొవ్వు అధికంగా ఉంటాయి. నిల్వకారకాలనీ వాడతారు. ఇవీ అతిగా ఆహారాన్ని తీసుకునేలా ప్రేరేపిస్తాయి. ఖాళీగా ఉంటే పండ్లు, నట్స్‌, గింజలను తీసుకోండి. కావాల్సిన పోషకాలు అందుతాయి. త్వరగా ఆకలి వేయకుండానూ చూస్తాయి. గుడ్లు, మాంసం, చేప, పప్పుధాన్యాలు వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇవీ నోటిని కట్టేయగలవు.

* సరిగా నిద్ర పోతున్నారా? రోజుకి కనీసం 7-8 గం.ల నిద్ర తప్పనిసరి. అది ఏమాత్రం తగ్గినా ఆకలి పెరిగి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్న కోరిక కలుగుతుంది. దీన్నీ చూసుకోవాల్సిందే. ఒత్తిడి కూడా జంక్‌ఫుడ్‌ తినడానికి ప్రోత్సహిస్తుంటుంది. మనసుకు అప్పుడప్పుడూ కాస్త విశ్రాంతిని ఇవ్వండి.

* టీవీ, ఫోన్‌ చూస్తూ తింటే ఎంత తిన్నామన్న దానిపై అవగాహనుండదు. ఆకలి వేసినప్పుడే తినడం అలవాటు చేసుకోండి. ఎక్కువ రకాలు ఉన్నాయని, ఆహారం వృథా అవుతుందని బలవంతంగా తినేయకండి. ఈ నియమాలు తినాలన్న కోరికను త్వరగా కలగనీయవు. నిర్ణీత వేళలను పెట్టుకోండి. ఆ సమయానికే తినడం అలవాటు చేసుకుంటే శరీరానికో నియమం ఏర్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని