చీకటి పేరుతో భయపెట్టకండి...

మాధవి కూతురికి తొమ్మిదేళ్లు నిండుతున్నా ఒంటరిగా చీకటి గదిలోకి వెళ్లడానికి భయపడుతుంది. ఇలాంటి చిన్నారుల్లో బాల్యం నుంచే ధైర్యాన్ని నింపాలి అంటున్నారు నిపుణులు. లేదంటే ఇది వారిని జీవితాంతం బాధించే సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Published : 09 Jun 2022 18:35 IST

మాధవి కూతురికి తొమ్మిదేళ్లు నిండుతున్నా ఒంటరిగా చీకటి గదిలోకి వెళ్లడానికి భయపడుతుంది. ఇలాంటి చిన్నారుల్లో బాల్యం నుంచే ధైర్యాన్ని నింపాలి అంటున్నారు నిపుణులు. లేదంటే ఇది వారిని జీవితాంతం బాధించే సమస్యగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

చాలామంది తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పుడు భయపెట్టే క్రమంలో చీకట్లో బూచోడున్నాడు, అల్లరి మానకపోతే ఎత్తుకుపోతాడు అని అంటుంటారు. మరికొందరైతే ఏడుపు మానకపోతే చీకటి గదిలో ఉంచి తలుపేస్తా అని బెదిరిస్తారు. ఇలాంటి పనులే పిల్లల్లో చీకటి పట్ల భయాన్ని పెంచుతాయి. అక్కడ ఏదో ఉన్నట్లు ఊహించుకోవడం మొదలు పెడతారు. ఎదిగేకొద్దీ ఆ భయం కూడా పెరుగుతుంది. జీవితాంతం ఫోబియాగా మిగిలిపోతుంది. ముందుగా తల్లిదండ్రులు చీకటి పేరుతో పిల్లలను బెదిరించడం మానేయాలి. ఒంటరిగా చీకట్లో వారిని వదిలేయకూడదు. ఇలా చేస్తే మానసికంగా కుంగిపోయే ప్రమాదమూ ఉంది.

సినిమాలకు.. భయానకంగా ఉండే సినిమాలను పిల్లలెదుట పెద్ద వాళ్లు చూడకూడదు. చీకటిని భయంకొల్పేలా చూపించే ఆ విధానం చిన్నారుల మెదడులో నిక్షిప్తమవుతుంది. వారూ ఏదో ఒకటి ఊహించుకోవడం మొదలుపెడతారు. రాత్రుళ్లు నిద్రపోయే ముందు ఆహ్లాదంగా, సరదాగా ఉండే కథలను వినిపించాలి. క్రైం, థ్రిల్లర్‌ అంటూ కథలు చెబితే అవి ఆ పసిమనసులను భయపెడతాయి. రాత్రికి, ఆ కథను అనుసంధానం చేసుకుంటారు. దాంతో చీకటంటే వణికిపోతారు. వారి దగ్గర చీకటికి ఎక్కువ ప్రాధాన్యమివ్వకుండా జాగ్రత్తపడాలి. వారిని వెంట తీసుకొని చీకటిగా ఉన్న గదిలో చిన్నచిన్న పనులు చేసి, వారితోనూ చేయించడానికి ప్రయత్నించాలి.

అవగాహన.. చీకటంటే ఎందుకు భయపడుతున్నారో పిల్లలను మృదువుగా అడగాలి. వారు చెప్పేది పూర్తిగా వినాలి. కొందరు చిన్నారులు తమ స్నేహితుల నుంచి కూడా ఈ భయాన్ని అంది పుచ్చుకుంటుంటారు. కారణం తెలుసుకొని చీకటి కూడా పగల్లాంటిదే అనే అవగాహన కలిగించాలి. రాత్రిలో ప్రత్యేకంగా ఏదీ భయం కలిగించే అంశం ఉండదని వివరించాలి. అంధులు పూర్తి చీకట్లోనే తమ పనులను తాము ఎలా చేసుకుంటారో చెప్పాలి. వీలైతే అటువంటి వ్యక్తులను కలిసేలా చేయాలి. ఇవన్నీ వారిలో నెమ్మదిగా భయాన్ని దూరం చేస్తాయి. లేదంటే.. ఇది వారిపై పలురకాల దుష్ప్రభావాలను చూపిస్తుంది. ఇవన్నీ వారిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగనివ్వవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని