అల్లరి ఆగడాలు.. ఆనంద సరాగాలు..

చిన్నారులకు చదువొక్కటే కాదు, ఆటపాటలూ కావాలి. ముఖ్యంగా వాళ్లకి యాంత్రికత బొత్తిగా నచ్చదు. రొటీన్‌కు భిన్నమైన వ్యవహారాలను పరిచయం చేయండి. ఆటపాటల్లో కొత్తదనాన్ని ప్రోత్సహించండి.

Updated : 07 Sep 2022 09:15 IST

చిన్నారులకు చదువొక్కటే కాదు, ఆటపాటలూ కావాలి. ముఖ్యంగా వాళ్లకి యాంత్రికత బొత్తిగా నచ్చదు. రొటీన్‌కు భిన్నమైన వ్యవహారాలను పరిచయం చేయండి. ఆటపాటల్లో కొత్తదనాన్ని ప్రోత్సహించండి.

చిన్నారులను అలరించేందుకు లెక్కలేనన్ని కళాత్మక మార్గాలున్నాయి. దళసరిగా ఉండే చార్ట్‌ పేపర్‌ను ముక్కలు చేసి వాటి మీద బొమ్మలేయమనండి లేదా పెయింట్‌ చేయమనండి. నున్నటి కాగితం, కాస్త బరగ్గా ఉండే అట్టముక్క, చెక్క, వస్త్రం.. ఇలా వివిధ టెక్స్చర్లను బట్టి వాటి మీద బొమ్మలు విభిన్నంగా భాసిస్తాయి.

మట్టి తవ్వకాలు అదుర్స్‌.. పిల్లలకు మట్టిలో ఆడటం అంటే బోల్డంత ఇష్టం. అందుకే మట్టి లేదా ఇసుకలో గుంతలు తవ్వమనండి. ఆనక దాన్ని పారతో లాగడం, తోయడం, గంపల్లోకి ఎత్తడం లాంటి పనులతో కండరాలు బలాన్ని పుంజుకుంటాయి. ఆ శారీరక శక్తిలోంచి అనేక అద్భుత ఆలోచనలు పుట్టుకొస్తాయి.

డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌.. పిల్లల నైపుణ్యాలను మెరుగుపరచడానికి నృత్యం అమోఘంగా ఉపయోగపడుతుంది. గాలి వీచే శబ్దం, వర్షపు ధ్వనితోబాటు సంగీత సమ్మేళనాలతో నృత్యం చేయించండి. ఉత్సాహంతో ఉరకలేస్తారు.
సంగీతంతో సంబరం.. చిన్నారుల్లో మొహమాటాల్లాంటివి ఉండవు. ఎలాంటి బెరుకూ లేకుండా హాయిగా ఆడి పాడతారు. కనుక పాటల విషయంలోనూ వాళ్లను ప్రోత్సహించండి. ఉల్లాసంగా పరవళ్లు తొక్కుతారు.

ఊహలకు ప్రాణం పోయండి.. పిల్లలకు ఏమీ తెలీదనుకుంటాం. నిజానికి వాళ్ల ఊహలకు రెక్కలు తొడిగితే అద్భుతంగా ఉంటాయి. పిల్లినో కుక్కనో కొంగొత్తగా ఆడిస్తారు. వాటితో కలిసి పరిగెడతారు. నేస్తాలతో పోటీ పెట్టుకుని పార్కుల్లో పరుగులు తీస్తారు. ఏనుగులా, పులిలా, సింహంలా శబ్దాలు చేస్తారు. ఇలాంటివి పిల్లల్లో చురుకుతనాన్ని మేధస్సును పెంచుతాయి. వీలైతే మీరు కూడా కలిసి ఆడండి.

ఆపకండి... పిల్లలను పార్కుల్లో ఆడుకోనివ్వండి. ప్రకృతిలో లీనమవుతూ హుషారుగా గెంతుతుంటే ఎంతమాత్రం ఆపకండి. చెట్టుకొమ్మలెక్కడం, కప్పల్లా గెంతడం లాంటి కొంటె చేష్టలను అడ్డుకోకండి. మీ ప్రోత్సాహంతో వాళ్ల ఉత్సాహం రెట్టింపవుతుంది.


మొక్కల పెంపకం..

ఇది కూడా బ్రహ్మాండమైన వ్యాపకం. వివిధ రకాల విత్తనాలను వేయమనండి. రకరకాల మొక్కలను పెంచమనండి. చిట్టిచిట్టి చేతులతో తోటలు రూపొందిస్తారు, పంటలతో పాటు ఆనందాలనూ పండిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని