తాకనివ్వొద్దు!

రష్మికి ఎనిమిదేళ్లు. తనను పక్కింటాయన అస్తమానూ ఎక్కడో అక్కడ తాకుతూనే ఉంటున్నాడని కూతురు చెప్పినప్పుడు శశి చాలా ఆందోళన పడింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, బాడీ సేఫ్టీ రూల్స్‌ గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కలిగించాలి.

Published : 08 Sep 2022 00:52 IST

రష్మికి ఎనిమిదేళ్లు. తనను పక్కింటాయన అస్తమానూ ఎక్కడో అక్కడ తాకుతూనే ఉంటున్నాడని కూతురు చెప్పినప్పుడు శశి చాలా ఆందోళన పడింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే, బాడీ సేఫ్టీ రూల్స్‌ గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కలిగించాలి.

పిల్లలకు శరీర అవయవాల గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. ఇందులో ఆలస్యం జరగకూడదు. లేదంటే వారి జీవితంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఇది పెను సమస్యగా మారి వేధిస్తుంది. శరీరానికి సంబంధించి సొంతంగా కొన్ని నియమాలు ఉంటాయని పిల్లలకు తెలియాలి. వాటిని ఇతరులు అతిక్రమిస్తున్నప్పుడు స్పందించడమే కాదు, తక్షణం వ్యతిరేకించడమెలాగో తల్లిదండ్రులు నేర్పించాలి. లేకపోతే పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. పిల్లల చదువు, భవిష్యత్తుల విషయంలో ఎంత ప్రాముఖ్యతనిస్తారో, ఈ అంశంలోనూ అవగాహన కలిగించడానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. అప్పటివరకు ఉత్సాహంగా ఉండే చిన్నారులు అకస్మాత్తుగా ఏదో కోల్పోయినట్లు, ఒంటరిగా ఉంటోంటే వెంటనే గుర్తించాలి. వారికేదైనా చేదు అనుభవం ఎదురై ఉండొచ్చు. సున్నితంగా, మెల్లగా అడిగి సమస్య తెలుసుకొని పరిష్కరించాలి. మరోసారి అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో పిల్లల్లో అవగాహన కలిగించాలి.

నో నేర్పాలి..

గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ తేడా పిల్లలకు చెప్పాలి. తమ శరీరాన్ని ఎవరు తాకినా వెంటనే నో చెప్పడం నేర్పించాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరి దగ్గర తనకు సురక్షితంగా అనిపిస్తుందో తెలుసుకోవాలి. వారిని పూర్తిగా నమ్మే సభ్యులుగా గుర్తుపెట్టుకోమనాలి. అప్పుడే సేఫ్టీ, నాన్‌సేఫ్టీ గురించి వివరించొచ్చు. పిల్లలకు ఎవరివద్దైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వారి గురించి ఇంట్లో చెప్పమని చెప్పాలి. పెద్దవాళ్ల ఎదుట కొందరు మంచి వాళ్లలాగే నటించొచ్చు. పిల్లల వద్ద వాళ్లు మరొకలా ప్రవర్తించొచ్చు. దాని గురించి చెబుతున్నప్పుడు ఖండించకుండా పూర్తిగా వినాలి. చెప్పడానికి పిల్లలకు స్వేచ్ఛ, అవకాశాన్ని ఇవ్వాలి. వారి మనసులో మాటను ధైర్యంగా చెప్పనివ్వాలి. వారి సమస్యను పరిష్కరించడంతోపాటు, తమకేదైనా జరిగితే తల్లిదండ్రులు తోడున్నారనే భరోసా అందివ్వాలి. అప్పుడే వారు ప్రతి విషయాన్నీ అమ్మానాన్నతో పంచుకోగలుగుతారు. లేదంటే తమ అనుభవాలను ఎవరితో పంచుకోవాలో తెలియక ఒంటరిగా కుంగుబాటుకు గురవుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని