మనసుల మధ్య రాతిగోడ రానీయొద్దు...

భర్త అకస్మాత్తుగా ఎందుకు మౌనం వహిస్తాడో కావ్యకు అర్థంకాదు. కారణమడిగితే మరింత దూరంగా జరిగే అతడి ప్రవర్తన ఆమెకు ఆందోళన  కలిగిస్తుంది.

Published : 11 Jun 2023 00:08 IST

భర్త అకస్మాత్తుగా ఎందుకు మౌనం వహిస్తాడో కావ్యకు అర్థంకాదు. కారణమడిగితే మరింత దూరంగా జరిగే అతడి ప్రవర్తన ఆమెకు ఆందోళన  కలిగిస్తుంది. ఒకే ఇంట్లో అపరిచితుల్లా ఉండే దంపతుల మధ్య ఏర్పడే రాతిగోడను పగలగొట్టడానికి ప్రయత్నించకపోతే ఆ బంధం బీటలువారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

కుటుంబం లేదా వ్యక్తిగత విషయానికి సంబంధించి ఏదైనా గొడవైతే దంపతుల్లో ఎవరో ఒకరు లేదా ఇరువురూ మౌనం దాలుస్తారు. ఎదుటివారు తమకు తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తారు. కోపం తగ్గాక ఇరువురిలో ఎవరో ఒకరు ఎదుటి వారిని పలకరించడానికి ప్రయత్నించినా అవతలివారు తమని కాదన్నట్లు ఉంటారు. దీంతో దూరం మరింత పెరుగుతుంది. ఈ రకమైన ప్రవర్తన ఆ ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతుంది. జీవితంలో ప్రతి రోజునూ.. సంతోషంగా మలుచుకోవాల్సిన భార్యాభర్తలు కోపతాపాలతో సమయాన్ని వృథా చేసుకోవడం మంచిది కాదు.

భేదాభిప్రాయంతో.. ఏదైనా పనిని దంపతులిద్దరూ కలిసి చేయాల్సినప్పుడు వచ్చే భేదాభిప్రాయాలు కూడా కొన్నిసార్లు మనసుల మధ్య దూరానికి కారణమవచ్చు. తమ అభిప్రాయాన్ని చెప్పడం ఇష్టం లేకపోవడం లేదా చెప్పినా.. అవతలివారు వినరనే ఆలోచన కూడా మౌనాన్ని ఆశ్రయించేలా చేస్తుంది. మరికొందరు సమస్య ఎక్కడ పెద్దది అవుతుందోనని సంకోచంతో మాట పెదవి దాటనీయరు. ఇంకొందరు మౌనాన్ని ఆయుధంగా చేసుకొని భాగస్వామిని బాధ పెట్టాలని చూస్తారు. ఆలోచనేదైనా పొరపాటే. తీరు మార్చుకొని మాట బయటపెడితేనే పరిష్కారం సాధ్యం.

జాగ్రత్తగా.. దంపతుల్లో ఏ ఒక్కరికైనా రోజుల తరబడి మౌనంగా ఉండిపోయే అలవాటుంటే దాన్ని అవతలి వారు గుర్తించాలి. ఏ సందర్భంలో అలా జరుగుతుందో గమనించాలి. మరొకసారి అలా జరగకుండా జాగ్రత్తపడాలి. ఎదుటివారి కోపం తారస్థాయికి చేరుకుంటోంటే చర్చకు ఫుల్‌స్టాప్‌ పెట్టేయడం మంచిది. తర్వాత అనునయంగా అడిగి తెలుసుకోవాలి. మాట్లాడుకుంటేనే దేన్నైనా పరిష్కరించు కోగలుగుతామని వివరించాలి. మనసుల మధ్య నిశ్శబ్దానికి చోటివ్వకూడదని భార్యాభర్తలు ఒకరికొకరు మాటిచ్చుకొంటేనే ఆ బంధం కలకాలం సంతోషంగా సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్