అమ్మాయిలు...అదరగొట్టేశారు!

సివిల్స్‌... ఎందరికో చిరకాల స్వప్నం. కానీ దాన్ని సాకారం చేసుకునేవాళ్లు కొందరే. లక్షలమంది నుంచి గట్టి పోటీని తట్టుకుని వాళ్లందరినీ వెనక్కి నెట్టి ముందు వరసలో ర్యాంకు సాధించడం అంత సులభం కాదు.

Published : 17 Apr 2024 06:45 IST

సివిల్స్‌... ఎందరికో చిరకాల స్వప్నం. కానీ దాన్ని సాకారం చేసుకునేవాళ్లు కొందరే. లక్షలమంది నుంచి గట్టి పోటీని తట్టుకుని వాళ్లందరినీ వెనక్కి నెట్టి ముందు వరసలో ర్యాంకు సాధించడం అంత సులభం కాదు. అందుకు బలమైన సంకల్పం చేసుకోవాలి... అకుంఠిత దీక్ష కావాలి... కఠోరశ్రమ చేయాలి... వీటన్నింటినీ అందిపుచ్చుకుని యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో అయిదుగురు అమ్మాయిలు నిలవగా... తొలి ముగ్గురు వీళ్లు.


తొలిసారే సాధించి... అనన్య రెడ్డి (మూడో ర్యాంకు)

యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాల్లో తెలుగు అమ్మాయి దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఈ అసాధారణ ప్రతిభతో రాణించిన ఆమెతో వసుంధర ముచ్చటించింది.

ఐదేళ్ల వయసులోనే మా తాతగారు కలెక్టర్‌ని చూపించి ‘నువ్వలా అవ్వాలి’ అనేవారు. కానీ డిగ్రీకి దిల్లీకి వెళ్లాక అదే లక్ష్యంగా మారింది. మా స్వస్థలం పాలమూరు జిల్లాలోని పొన్నకల్‌. కానీ మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డాం. నాన్న సురేష్‌ రెడ్డి స్థిరాస్తి వ్యాపారి. అమ్మ మంజుల. ఇంటర్‌లో జాగ్రఫీపై ఆసక్తి ఏర్పడింది. దీనిలో ఉన్నత చదువుకి దిల్లీలోని మిరిండా హౌజ్‌ దేశంలోనే ఉత్తమమని తెలిసి ప్రయత్నించా. అప్పట్లో కటాఫ్‌ మార్కులు సాధిస్తే సీటొచ్చేది. అలా బీఏలో ప్రవేశం పొందా. అక్కడి స్నేహితులు అనేక విషయాలు తెలుసుకోవడంలోనే కాదు, వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంలోనూ సాయపడ్డారు. డిగ్రీ చివరి ఏడాదిలో సివిల్స్‌ సన్నద్ధత ప్రారంభించా. నా ఆప్షనల్‌ ఆంత్రపాలజీ కోసం ఆన్‌లైన్‌లో మూడు నెలల శిక్షణ మినహా సొంతంగానే సిద్ధమయ్యా. ఆన్‌లైన్‌లో సమాచారం సేకరించుకున్నా. స్నేహితుల నుంచీ మెటీరియల్‌ తీసుకునేదాన్ని. యూట్యూబ్‌లో టాపర్ల అనుభవాలు తెలుసుకొని స్ఫూర్తి పొందేదాన్ని. వాళ్లు బ్లాగ్స్‌లో నోట్స్‌ ఉంచేవారు. అవీ నాకు సాయపడ్డాయి. ఎంత సొంతంగా సిద్ధమైనా ఇంట్లోవాళ్ల మద్దతూ ముఖ్యమే. ఈ విషయంలో అమ్మానాన్న నాకు తోడు నిలిచారు. రెండేళ్లపాటు సివిల్స్‌పైనే పూర్తిగా శ్రద్ధపెట్టా. నా బలాలు, బలహీనతలు అర్థం చేసుకున్నా. ప్రిలిమ్స్‌లో కొత్త అంశాలపైనే దృష్టిపెడుతున్నారని గ్రహించి, ఎక్కువ సమాచారం సేకరించి మరీ చదివా. మెయిన్స్‌ విషయంలో మాత్రం రివిజన్‌పైనే దృష్టిపెట్టా. అప్పుడు ఎక్కువగా ఆలోచించడం, ఒక అంశానికి మరో అంశాన్ని అనుసంధానించడం లాంటివి అలవాటయ్యాయి. అలా ఏ ప్రశ్నకైనా సమాధానం రాయగల ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ ఇంటర్వ్యూ విషయంలో మాత్రం కాస్త భయపడ్డా. 35 నిమిషాల ఇంటర్వ్యూలో సబ్జెక్టుపై పట్టుతోపాటు నా నమ్మకాల్ని, ధైర్యాన్ని పరీక్షించినట్లు అనిపించింది. కానీ విజయం సాధిస్తా అనుకున్నా. అయితే మూడో ర్యాంకు మాత్రం ఊహించలేదు. ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చినా ప్రజలకు సుభిక్షమైన పరిపాలన అందించాలన్నది నా లక్ష్యం.

నర్సింగోజు మనోజ్‌ కుమార్‌, మహబూబ్‌నగర్‌,

రమ్య, ఈటీవీ


ఐఈఎస్‌, ఐపీఎస్‌ కాదని... రుహాని (ఐదో ర్యాంకు)

ప్రభుత్వ సర్వీస్‌ సాధించడం అంత సులువేమీ కాదు. అలాంటిది రుహాని ఒకటికి రెండు సాధించారు. అయినా తిరిగి సివిల్స్‌ రాసి, ఐదో ర్యాంకర్‌గా నిలిచారు. రుహాని స్వస్థలం హరియాణాలోని గుడ్‌గావ్‌. అమ్మానాన్నలు ప్రొఫెసర్లు. దీంతో దిల్లీలో పెరిగారు. అక్కడి సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజ్‌ నుంచి ఎకనామిక్స్‌లో బీఏ ఆనర్స్‌, ఇగ్నో నుంచి పీజీ చేశారు. ఇండియన్‌ ఎకనామిక్స్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) సాధించి, నీతి ఆయోగ్‌లో రిసెర్చ్‌ ఆఫీసర్‌గా రెండేళ్లు పనిచేశారు. ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ, వాటిలోని లోటుపాట్లను తెలుసుకోవడం మొదలైనవి ఈమె విధులు. కానీ అవి ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో సివిల్‌ సర్వీసెస్‌కి ప్రయత్నించారు. 2022 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 159వ ర్యాంకు కూడా సాధించారు. హైదరాబాద్‌ ఐపీఎస్‌ అకాడమీలో శిక్షణయ్యాక, యూపీ కేడర్‌లో పోస్టింగ్‌ కూడా దక్కింది. అయినా సంతృప్తి పడలేదు రుహాని. తిరిగి ప్రయత్నించారు. ఫలితమే తాజా అయిదో ర్యాంకు. ‘పాలసీలు రూపొందించుకుంటూ వెళితే సరిపోదు. అవి ప్రజల్లోకి ఎంతవరకూ వెళుతున్నాయి, వారికి ఏమేరకు మేలు చేస్తున్నాయో తెలిస్తేనే ప్రయోజనం. పాలసీలు, పథకాల రూపకల్పన థియరీ లాంటిది. వాటి అమలు ప్రాక్టికల్స్‌ లాంటివి. అసలైన సవాళ్లు తెలిసేదీ ఇక్కడే. అందుకే ఐఏఎస్‌ లక్ష్యంగా సివిల్స్‌ మళ్లీ ప్రయత్నించా’ నంటారు రుహాని.


లక్షల జీతం వద్దనుకుని... సృష్టి దబాస్‌ (ఆరో ర్యాంకు)

సృష్టి దబాస్‌ది దిల్లీ. పొలిటికల్‌ సైన్సులో పీజీ చేశారు. తండ్రి పోలీస్‌ ఆఫీసర్‌. గ్రాడ్యుయేషన్‌లో యూనివర్సిటీ గోల్డ్‌ మెడలిస్ట్‌. చదువయ్యాక మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌లో పనిచేశారు. ప్రస్తుతం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ముంబయి బ్రాంచిలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు. పగలు ఉద్యోగం చేస్తూనే, రాత్రిళ్లు చదువుకునేవారు. పొలిటికల్‌ సైన్సును ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకుని, మొదటి ప్రయత్నంలోనే అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంక్‌ సాధించారు. అదికూడా ఎటువంటి కోచింగ్‌ లేకుండానే! యూనివర్సిటీ స్పాన్సర్‌షిప్‌తో ట్రాన్స్‌జెండర్‌ల సమస్యలపై పరిశోధనలు చేశారీమె. ‘బసేరా సామాజిక్‌ సంస్థాన్‌’ అనే ఎన్‌జీవోతోనూ కలిసి పనిచేశారు. ‘ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్ల గురించి సరైన అవగాహన లేదు. పిల్లలకు ఇటువంటి క్యాటగిరీ ఒకటి ఉంటుందనీ తెలియదు. వాళ్లతో కలవడానికి సంకోచిస్తారు. కాబట్టే వాళ్లు పెరిగాక కూడా అదే భావనతో ఉంటారు. అందుకే సమాజంలో ట్రాన్స్‌జెండర్లు కలిసే విధంగా ఇన్‌క్లూజివ్‌ పాలసీ మేకింగ్‌ చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్‌ ఫోబిక్‌ సొసైటీ నుంచి ట్రాన్స్‌ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించాలి. వారికి చదువు, ఆరోగ్యం, ఉద్యోగాల్లో సమాన   అవకాశాలు అందించాలి’ అంటున్నారు సృష్టి. ఆర్‌బీఐ ఉద్యోగినిగా సుమారు రూ.3లక్షల జీతం అందుకుంటున్నా సివిల్స్‌నే లక్ష్యంగా చేసుకుని సాధించారీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్