కేకులతో కనికట్టు

వీధిబండి, వంటిల్లు, పడకగది, స్నానాలగది వంటివన్నీ హరియాణాకు చెందిన కోమిలా సునేజాధర్‌ చేతిలో కేకుల్లా ఒదిగి పోవాల్సిందే. హ్యాండ్‌బ్యాగ్‌, ల్యాప్‌టాప్‌, పుస్తకాలు, పిజా, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌... ఇలా దేనికైనా కేకులతో ప్రతి రూపాలను చేయగలదు.

Published : 30 Jun 2021 01:44 IST

వీధిబండి, వంటిల్లు, పడకగది, స్నానాలగది వంటివన్నీ హరియాణాకు చెందిన కోమిలా సునేజాధర్‌ చేతిలో కేకుల్లా ఒదిగి పోవాల్సిందే. హ్యాండ్‌బ్యాగ్‌, ల్యాప్‌టాప్‌, పుస్తకాలు, పిజా, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌... ఇలా దేనికైనా కేకులతో ప్రతి రూపాలను చేయగలదు. తన సృజనాత్మకతతో దేశంలో అగ్రశ్రేణి బేకర్‌గా ఎదిగింది. ఓ పత్రిక ప్రపంచవ్యాప్తంగా టాప్‌టెన్‌ కేక్‌ ఆర్టిస్ట్‌ల జాబితాను తయారు చేసింది. అందులో నాలుగో స్థానాన్ని కోమిలా దక్కించుకుందంటే తన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ ‘ఇంటర్నేషనల్‌ కేక్‌ కొలాబరేషన్‌ 2017’ పోటీల్లో పాల్గొని అవార్డునూ దక్కించుకుంది. మన సంప్రదాయం, సంస్కృతులు ప్రతిబింబించేలా ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా’ థీమ్‌తో తను చేసిన కేకును అందరూ శెభాష్‌ అన్నారు. అంతేనా ప్రముఖ సదస్సుల్లో బేకింగ్‌ డిజైన్‌పై ప్రసంగాలు ఇస్తోంది. లండన్‌లోని ఓ ప్రముఖ సంస్థ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ‘బెస్ట్‌ వెడ్డింగ్‌ కేక్‌’ పోటీలో మన దేశం నుంచి విజేతగా నిలిచింది కోమిలా. మూడు అంతస్థులుగా ఉన్న ఈ కేకులో మన రాజరికపు వారసత్వాన్ని ప్రతిబింబించేలా చేసిందీమె. కేకుల్నే కాదు... తనను తానూ అంతే అందంగా తయారు చేసుకోగలదు. అందుకే ఓపెరా మిసెస్‌ ఇండియా గ్లోబల్‌-2018 అందాల పోటీల్లో టాప్‌లిస్ట్‌లో నిలిచింది.

కృషితో... ఫార్మసీలో డిగ్రీ పూర్తిచేసిన కోమిలా, ప్రైవేటు సంస్థల్లో క్వాలిటీ కంట్రోల్‌ మేనేజర్‌గా, రిసెర్చి సైంటిస్ట్‌గా చేసింది. ఆ తర్వాత పెళ్లై భర్తతో కలిసి ఆగ్రాలో స్థిరపడింది. ప్రైవేటుగా ఎంబీఏ పూర్తి చేసిన తనకు చిన్నప్పటి నుంచి కేకు ఆర్ట్‌పై ఆసక్తి ఎక్కువ. దీంతో బేకింగ్‌ కోర్సు చేసింది. దాన్నే కెరీర్‌గా మార్చుకుంది. ‘ఫార్మసీ, బేకింగ్‌ల పరిజ్ఞానంతో ఏ రసాయనాలు వినియోగించకుండా పోషక విలువలుండేలా కేకులను చేస్తున్నా. నా వ్యక్తిగత విజయంతోపాటు ఈ కేకుల ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నా.  కలలు కనడం మానకూడదు. మనం కష్టపడితే అనుకున్నదేదైనా సాధించగలం’ అంటోంది కోమిలా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్