గృహహింసకు ఎ.ఐ.తో చెక్‌!

గృహహింస, లింగవివక్ష, జాతి అంతరాలు ఈ సమస్యలకు కృత్రిమమేధ(ఏఐ) సాయంతో పరిష్కారం చూపించాలనుకుంది కృతికశర్మ. ‘ఏఐ ఫర్‌ గుడ్‌’ సంస్థను స్థాపించిన ఆమె.. ప్రస్తుతం యూకే

Published : 08 Jul 2021 00:36 IST

గృహహింస, లింగవివక్ష, జాతి అంతరాలు ఈ సమస్యలకు కృత్రిమమేధ(ఏఐ) సాయంతో పరిష్కారం చూపించాలనుకుంది కృతికశర్మ. ‘ఏఐ ఫర్‌ గుడ్‌’ సంస్థను స్థాపించిన ఆమె.. ప్రస్తుతం యూకే పార్లమెంటుకు సలహాదారు కూడా!

‘కృత్రిమమేధ విషయంలో ఓ అపోహ ఉంది. దీనివల్ల మన కొలువులు పోతాయని. అందులో కొంతే వాస్తవం. అదే ఏఐని ఉపయోగించుకొని సామాజిక అసమానతలకి చెక్‌పెట్టొచ్చు... ముఖ్యంగా గృహహింసకు’ అంటోంది కృతిక. దక్షిణాఫ్రికాలో తను రెయిన్‌బో ప్రాజెక్టు ప్రారంభించింది. ఓ స్త్రీపై హింస జరిగే అవకాశం ఉందని ముందే గుర్తించి, హెచ్చరించి.. వారికి సాయం, మనోధైర్యం అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. కృత్రిమమేధ అందించిన డేటాతో దీన్ని విజయవంతంగా నడుపుతోందీమె. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది. కృతిక స్వస్థలం రాజస్థాన్‌. తల్లి టీవీ జర్నలిస్టు. 15 ఏళ్లకే సొంతంగా రోబోని తయారుచేసింది. ఇప్పటిలా డీఐవై కిట్‌లు దొరకని ఆ రోజుల్లో తనే విడిభాగాలన్నీ సమకూర్చుకుని కంప్యూటర్‌ని తయారుచేసింది. టెక్నాలజీ పట్ల ఆమె ఇష్టాన్ని గమనించి అమ్మానాన్నలు ప్రోత్సహించారు. తరువాత చదువుకుని ఎథికల్‌ హాకర్‌గా మారిన కృతికను ‘సివిక్‌ లీడర్‌’గా ప్రశంసించింది ఒబామా ఫౌండేషన్‌. డెల్‌ టెక్నాలజీస్‌ ఇన్నొవేషన్‌ సిరీస్‌లో భాగంగా ఏఐ ప్రయోజనాలపై చేసిన ప్రసంగం ‘ఫోర్బ్స్‌ అండర్‌ 30’ జాబితాలో చేర్చింది. గూగుల్‌ గ్రేస్‌హాపర్‌ ఉపకారవేతనాన్నీ అందుకుంది. ఈ ప్రత్యేకతలే ఆమెని బ్రిటిష్‌ పార్లమెంటు చేస్తున్న ఏఐ పాలసీకి సలహాదారు అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ఐరాస ఆధ్వర్యంలోని టెక్నాలజీ ఇన్నొవేషన్‌ ల్యాబ్‌కీ ప్రత్యేక సలహాదారు తను. ‘స్నేహితురాళ్లు, ఉద్యోగినులు ఇలా ఎవరిని పలకరించినా ముగ్గురిలో ఒకరు గృహహింస బాధితులే. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరిదీ ఇదే పరిస్థితి. ఇందులో మార్పు రావాలంటే సాంకేతిక సాయం తప్పనిసరి. సమస్యని ముందే గుర్తించి వారికి అండగా నిలవడం నా లక్ష్యం’ అంటోంది కృతిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్