రాయితీ వోచర్లతో జీతాలు చెల్లించా!

ఎంతో ఇష్టంగా ఏర్పరుచుకున్న ఆమె కలల సామ్రాజ్యం అది... ప్రకృతితో సావాసం... రుచికరమైన ఆహారంతో పుస్తక ప్రియులకు స్వర్గధామంగా చంపక్‌ని తీర్చిదిద్దారు. ఓ ప్రత్యేక గుర్తింపు అందుకున్న

Published : 22 Aug 2021 00:50 IST

ఎంతో ఇష్టంగా ఏర్పరుచుకున్న ఆమె కలల సామ్రాజ్యం అది... ప్రకృతితో సావాసం... రుచికరమైన ఆహారంతో పుస్తక ప్రియులకు స్వర్గధామంగా చంపక్‌ని తీర్చిదిద్దారు. ఓ ప్రత్యేక గుర్తింపు అందుకున్న ఆమె స్టార్టప్‌... కరోనాతో కొన్నాళ్లకే తలకిందులయ్యింది.  అప్పుడే వినూత్న ప్రత్యామ్నాయం వెతికి... దాన్ని నిలబెట్టుకున్నారు.  ఆమే బెంగళూరుకి చెందిన రాధికా టింబాడియా! ఆ కథ మనమూ తెలుసుకుందామా...

ముంబయిలో పుట్టిపెరిగిన రాధికకు పుస్తకాలంటే వల్లమాలిన ప్రేమ. అది వాళ్ల నాన్న నుంచే వచ్చింది. తాను చదివిన నవలల్లోని పాత్రలను ఊహకి తగ్గట్లుగా కథలు అల్లి ఆసక్తికరంగా చెప్పే వారాయన. పాత పుస్తకాల షాపులెన్నింటికో తీసుకువెళ్లేవారు. ‘ఓ సారి ముంబయిలోని రోడ్డుపక్కన ఓ షాపుకి వెళ్లా. అక్కడో యువకుడు... కస్టమర్లు ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతారు, ఏ రచయిత ఎలా రాస్తారు? ప్రసిద్ధ పుస్తకాలు- వాటి వెనక కథల వంటివెన్నో అనర్గళంగా చెప్పేశాడు. అప్పటి నుంచే పుస్తకాల గురించి ఇష్టం పెరిగింది’ అంటారామె. రాధిక పర్యావరణ శాస్త్రవేత్తగా బెంగళూరులో స్థిరపడింది. అప్పుడూ ఎన్నో పుస్తకాల షాపులకు, లైబ్రరీలకు తిరిగారు. పుస్తకాలు చాలానే ఉన్నా... తనక్కావలసింది వెతుక్కోవడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అదే చంపక ల్రైబరీ-కేఫ్‌ని ఏర్పాటుకి కారణమయ్యింది. ‘ఓ సాయంత్రం ఆక్టేవియా బట్లర్‌, ఎన్‌కే జెమిసిన్‌, ఉర్సులా కె లే గుయిన్‌ పుస్తక సమీక్షలు చదువుతున్నా. వారంతా అవార్డులు గెలుచుకున్న రచయిత్రులు. కానీ వారి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఇలాంటివాటితో పాటు అద్భుతమైన పుస్తకాలెన్నో అందరికీ అందుబాటులో లేవనే సంగతి గుర్తొచ్చింది. వాటిని భద్రపరచాలనుకున్నా. దాంతో పాటే ప్రశాంత వాతావరణంలో పుస్తక పఠనం, సమీక్షలు జరుపుకునేందుకు వీలుగా ఓ కెఫే ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అదే చంపక అని గుర్తుచేసుకుంటారు.

పురుషాధిక్య రంగంలో... ‘నాకల ...సాకారమవ్వడానికి  కావ్యామూర్తి, తేజశ్వి శివానంద్‌, పూజా సక్సేనా, రోహిణీ కేజ్రీవాల్‌, నిరికా శ్రీనివాసన్‌ సాయపడ్డారు. ఇక మా సంస్థలో సభ్యులు కాని మరెందరో తమ ముద్రణలను మాకు తెచ్చి ఇచ్చారు. మరో పక్క పిల్లలకోసం రీడింగ్‌ కార్నర్‌ ఏర్పాటు చేశారు. పుస్తక రచయితలు, క్యూరేటర్లతో వివిధ సెషన్లూ నిర్వహించేవారు’ అని చెబుతారు రాధిక.

ఆన్‌లైన్‌తో ఊపిరి పోశారు... ఈ లైబ్రరీ కెఫేని ఏర్పాటు చేయడానికి ముందు రెండేళ్లు ఓ బుక్‌స్టోర్‌లో ఇంటర్న్‌ చేశారు. గోవాలోని బుక్‌వార్మ్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తోన్న ఎడ్యుకేటర్‌ కోర్సు పూర్తిచేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది. కష్టం కరోనా రూపంలో వచ్చింది. లాక్‌డౌన్‌తో కేఫ్‌ని మూసేయాల్సి వచ్చింది. కానీ సిబ్బందికి అండగా నిలవాలి. మరోపక్క లక్ష్యం నీరు గారకూడదు... అందుకే ప్రత్యామ్నాయం ఆలోచించారు రాధిక. మరుసటి నెలే ఆన్‌లైన్‌కి మారిపోయారు. పాఠకులను మెప్పించడానికి, వారికి దగ్గరవ్వడానికి గిఫ్ట్‌వోచర్‌ కార్యక్రమం ప్రారంభించారు. ‘ప్రపంచం అకస్మాత్తుగా మారింది. దాన్ని అంగీకరించాలి. సంవత్సరంలో ఎప్పుడైనా పదిశాతం తగ్గింపుతో మా గిఫ్ట్‌ వోచర్‌ని రెడిమ్‌ చేసుకోవచ్చు. దీనికి మంచి స్పందన వచ్చింది. వాటితోనే... సిబ్బందికి జీతాలు చెల్లించాం. కరోనా ఉన్నంత కాలం ఈ విధానంలోనే మా లైబ్రరీ సాగుతోంది.’ అంటారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్