నోటి క్యాన్సర్‌ను గుర్తించే క్విట్‌పఫ్‌

నోటి క్యాన్సర్‌ నిర్ధరణ పరీక్షలను అందరికీ అందుబాటులో తెచ్చేందుకు బెంగళూరుకు చెందిన 18 ఏళ్ల నిఖియా సంషేర్‌ ‘క్విట్‌పఫ్‌’ అనే పరికరాన్ని ఆవిష్కరించింది....

Published : 24 Sep 2021 01:02 IST

నోటి క్యాన్సర్‌ నిర్ధరణ పరీక్షలను అందరికీ అందుబాటులో తెచ్చేందుకు బెంగళూరుకు చెందిన 18 ఏళ్ల నిఖియా సంషేర్‌ ‘క్విట్‌పఫ్‌’ అనే పరికరాన్ని ఆవిష్కరించింది. డిగ్రీ చదువుతోన్న  ఈమె దీన్ని తయారుచేయడానికి కారణమేంటో చెబుతోందిలా...

నిఖియ ఎనిమిదో తరగతిలో ఉండగా ఓసారి స్కూలు వాళ్లు చిన్నారులందరికీ ఆస్పత్రిలోని వివిధ భాగాలను చూపించారు. ‘అక్కడ ఒక రోగిని చూశా. అతడి ముఖానికి బ్యాండేజ్‌ వేశారు. నోటి క్యాన్సర్‌ చివరి దశలో ఉన్నాడని, ముందే తెలిస్తే కాపాడగలిగేవారని తెలిసింది’ అంటూ గుర్తు చేసుకుంది నిఖియ. ‘ఈ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు చేసే నిర్ధరణ పరీక్షలన్నీ ఖరీదైనవి. పెద్ద ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది’ అని వివరించింది.

మెంటార్‌తో కలిసి...  ఈ వ్యాధి నిర్ధరణ పద్ధతులను తెలుసుకోవడానికి బోలెడన్ని శాస్త్రీయ పరిశోధక పత్రాలను అంతర్జాలంలో చదివింది. 9వ తరగతి అమ్మాయికి కఠినమైన ఆ వైద్య పరిభాష అర్థం కాలేదు. దాంతో తల్లిదండ్రుల సలహాతో ఐసీఏఆర్‌లో రిసెర్చ్‌ ఫెలోగా పనిచేస్తోన్న డాక్టర్‌ తనయా దాస్‌, సైంటిఫిక్‌ ఎనలసిస్ట్‌ చైతన్య ప్రభులను మెంటార్‌లుగా ఎంచుకుంది. ఆరు నెలలు వారితో కలిసి ప్రయోగాలు చేసి ‘క్విట్‌పఫ్‌’ కిట్‌ను రూపొందించింది. వ్యక్తి లాలాజలంలో ఈమె తయారుచేసిన ద్రవం కలపడం ద్వారా అతనికి ఈ వ్యాధి వస్తుందా... రాదా అనేది తెలుసుకోవచ్చు. దీన్ని క్యాన్సర్‌ ఉన్న వ్యక్తి లాలాజలంతో కలిపినప్పుడు లేత పసుపు రంగు వస్తే వ్యాధి ప్రారంభ దశలో ఉందని, ముదురు గోధుమ రంగుకు మారితే వ్యాధి ముదిరిందని అర్థం. నిఖియ దాని ఖరీదు 38 రూపాయలుగా పెట్టింది. దీంతో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి యాజమాన్యం అనుమతితో అక్కడి రోగుల్లో పొగతాగేవారు, తాగనివారిపై ప్రయోగాలు మొదలుపెట్టింది.

‘జూన్‌ 2018 నుంచి ఫిబ్రవరి 2019 వరకు దాదాపు 500 మంది లాలాజల నమూనాలను సేకరించి వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేశాం. 96% కచ్చితమైన ఫలితాలు వచ్చాయి’ అని చెబుతోందామె. నిఖియ, చైతన్యలు ‘క్విట్‌పఫ్‌’ గురించి రాసిన పరిశోధన పత్రాలు 2020లో ప్రచురితమయ్యాయి.

నిఖియ ఈ కిట్‌ను ఇంకా మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. ‘ఈ కిట్‌తో ఫలితాలు రావడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది. దీన్ని అందరికీ ఉపయోగపడేలా మరింత సరళీకరించాలని అనుకుంటున్నాను. ట్రేసింగ్‌ పేపర్‌లా తయారు చేయాలన్నది ఆలోచన. సిగరెట్‌ పెట్టెలో ఓ చిన్న కాగితంలా ఇవ్వాలనుకుంటున్నా. దీని సాయంతో ఎవరికి ¨వారు తమకు నోటి క్యాన్సర్‌ ఉందో లేదో ఉచితంగా పరీక్షించుకుని అప్రమత్తం కావొచ్చు.’ అని చెబుతోందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్