సేవ కోసం మాతృదేశాన్ని వీడి...

రెడ్‌క్రాస్‌ వలంటీర్‌గా పనిచేయడానికి మన దేశానికి వచ్చింది క్రిస్టెల్లె హర్ట్సింగ్‌. లైంగిక వేధింపులకు గురైన ఓ యువతిని చూసిన ఆమె మనసంతా వేదనతో నిండిపోయింది. ఇలాంటి వారికి సాయం చేయాలనుకుంది. సొంత ఆస్తిని...

Updated : 26 Oct 2021 05:47 IST

రెడ్‌క్రాస్‌ వలంటీర్‌గా పనిచేయడానికి మన దేశానికి వచ్చింది క్రిస్టెల్లె హర్ట్సింగ్‌. లైంగిక వేధింపులకు గురైన ఓ యువతిని చూసిన ఆమె మనసంతా వేదనతో నిండిపోయింది. ఇలాంటి వారికి సాయం చేయాలనుకుంది. సొంత ఆస్తిని అమ్మేసి దేశం కాని దేశానికి వచ్చేసింది. ఎన్జీవో స్థాపించి, కష్టాల్లో ఉన్నవారిని చేరదీస్తోంది. వందల మందికి సేవలనందిస్తోన్న సేవామూర్తి స్ఫూర్తి గాథ ఇది...

ది 2012. బెంగళూరు రైల్వేస్టేషన్‌లో ఓ రోజు ఎటెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న 13 ఏళ్ల అమ్మాయి ఓ వలంటీర్‌ కంటిలో పడింది. ఆమె గురించి ఆ వలంటీర్‌ కేరళలోని క్రిస్టెల్లెకు సమాచారం అందించాడు. వెంటనే ఆమెను తన వద్దకు తీసుకురమ్మని చెప్పిందామె. ఆ అమ్మాయిని చూసి క్రిస్టెల్లె దిగ్భ్రాంతికి గురైంది. బాల్యవివాహంతో గర్భం దాల్చిన ఆ అమ్మాయిని భర్త, అత్తా మామలు తరిమేశారు. అనాథగా నిలిచిన ఆమెను తన చేతుల్లోకి తీసుకుంది క్రిస్టెల్లె. అప్పటికే ఎయిడ్స్‌ బాధితులైన చిన్నారులు, ఎందరో అనాథ బాలికలను ఆమె సంరక్షిస్తోంది.  

* దిల్‌ సే’ పేరుతో... స్విట్జర్లాండుకు చెందిన క్రిస్టెల్లెది బాల్యం నుంచి సేవా దృక్ఫథం. చదువయ్యాక రెడ్‌క్రాస్‌తో కలిసి ఆసియా, దక్షిణాఫ్రికా దేశాల్లో పని చేయాలనుకుంది. అలా 2000లో ఇండియా వచ్చి కేరళలోని త్రివేండ్రంలో ఓ సేవా సంస్థలో చేరింది. తర్వాత ముంబయిలో  ఓ ఎన్జీవోలో అనాథ ఆడపిల్లలకు చదువు చెప్పేది. తర్వాత ఆ ఎన్జీవోలోని ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిసి షాక్‌ అయ్యింది. సంస్థ నిర్వాహకులకు తెలిసీ తెలియనట్లుగా ఉంటున్నారని అర్థం చేసుకుంది. ఆ ఆడపిల్లలను అక్కడ ఉంచడం మంచిది కాదనుకుంది. స్విట్జర్లాండుకెళ్లి తన ఆస్తులను విక్రయించి ముంబయికి చేరుకుంది క్రిస్టెల్లే. 2012, నవంబరులో ‘దిల్‌ సే’ సేవాసంస్థను స్థాపించి, అనాథ ఆడపిల్లల సంరక్షణ ప్రారంభించింది.

* ఛాలెంజ్‌లెన్నో..  ముంబయిలో అనాథపిల్లలకు సేవనందిస్తున్నప్పుడు ఛాలెంజ్‌లెన్నో ఎదుర్కొన్నా అంటుంది క్రిస్టెల్లే. ‘స్థానికంగా చాలా బెదిరింపులు వచ్చేవి. విదేశాల్నుంచి వచ్చి ఇక్కడెందుకు చేస్తున్నావు, వెళ్లిపో అని బెదిరించే వారు. దాంతో ఆ పిల్లలతో త్రివేండ్రం చేరుకున్నాను. ఆ సమయంలో ఓ జంట నాకు చేయూతనందించింది. అక్కడే ఎన్జీవో కోసం ఓ ఇంటిని తీసుకున్నా. నా వద్ద అప్పటికే 15మంది అనాథ బాలికలున్నారు. చుట్టుపక్కల ఆసుపత్రులలో హెచ్‌ఐవీ బాధిత చిన్నారుల వివరాల సేకరణ మొదలుపెట్టా. వారిని ప్రభుత్వ అనుమతితో మా ఎన్జీవోలో చేర్చుకునే దాన్ని. ఇప్పటివరకు 50మందికి పైగా చిన్నారులకు చికిత్సను అందిస్తూ నీడను కల్పిస్తున్నాం. భర్తను కోల్పోయిన ఒంటరి మహిళలను గుర్తించి వారికి పీస్‌ సైన్స్‌ అనే ఇనిస్టిట్యూట్‌ ద్వారా చేతివృత్తులపై శిక్షణ అందిస్తున్నాం. అవసరమైన వారికి మా దిల్‌సే నీడను కల్పిస్తోంది. స్థానిక పోలీసు స్టేషన్ల ద్వారా లైంగిక వేధింపుల బాధితుల వివరాలు తెలుసుకునే దాన్ని. ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ద్వారా అనాథ అమ్మాయిలు, గర్భం దాల్చి ఒంటరైన యువతులకి నీడనిస్తున్నాం. కౌన్సిలింగ్‌ ఇప్పించి, చదువు చెప్పిస్తున్నాం. 55 మంది అమ్మాయిలు మా ఎన్జీవోలో ఉన్నారు. వీరిలో చాలా మంది అతి చిన్న వయసు వారే. ఈ అమ్మాయిలకు ప్రసవం వరకు చికిత్సనందించి, ఆ తర్వాత వారికిష్టమైన రంగంలో శిక్షణనిప్పిస్తున్నాం’ అని చెబుతోంది క్రిస్టెల్లే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్