close
Updated : 01/12/2021 05:08 IST

బెదిరింపులొచ్చినా భయపడను...

నిర్భయ.. దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఘటన. యోగితను కూడా ఆ సంఘటన కదిలించింది. అయితే ఆమె అయ్యో అనుకునో, బాధపడో ఊరుకోలేదు. అలాంటివి ఇంకా జరుగుతున్నాయని తెలుసుకుంది. వాళ్లకు చేయూతను ఇవ్వాలనుకుంది. దానికోసం ఉద్యోగాన్నీ పక్కనపెట్టి, వాళ్లకు అండగా నిలుస్తోంది.

యోగితా బయనాకు మొదట్నుంచీ సమాజ సేవపై ఆసక్తి. స్కూల్లో ఉన్నప్పటి నుంచే పేద పిల్లలకు చదువు చెప్పడం, వృద్ధుల ఆర్థికసాయం కోసం విరాళాలు సేకరించడం వంటివి చేసేది. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, గురు గోవింద్‌సింగ్‌ విశ్వవిద్యాలయంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేసింది. చదువయ్యాక కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగంలో చేరింది. ఓ రోజు ఆఫీస్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదాన్ని దగ్గర్నుంచి చూసింది. దానికి కారణమైన వ్యక్తి పారిపోయాడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయంలో ఉన్న బాధితుడిని అక్కడున్న వారెవరూ పట్టించుకోకపోవడం యోగితాను నిర్ఘాంతపరిచింది. తనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించినా చికిత్స ఆలస్యమై చనిపోయాడు. ఆ నిర్భాగ్యుడికి అయిదేళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. కుటుంబ ఆధారం కన్నుమూయడంతో వాళ్లు దిక్కులేని వారయ్యారు. ఆ సంఘటనను మర్చిపోలేకపోయింది. కోర్టులో సాక్ష్యం చెప్పి, ఆ కుటుంబానికి తగిన పరిహారాన్ని ఇప్పించింది. న్యాయ విషయాలపై అవగాహన పెంచుకుని బాధితులకు సాయం చేయాలనుకుంది. ఉద్యోగాన్నీ దీన్నీ సమన్వయం చేయలేక రాజీనామా చేసిమరీ 2007లో ‘దాస్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించింది. అవగాహన కార్యక్రమాలూ నిర్వహించేది. అప్పుడే నిర్భయ సంఘటన జరిగింది.

‘నిర్భయ తల్లిదండ్రులను కలుసుకున్నా. దిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమాలు, పోరాటాలన్నింటిలో పాల్గొనే దాన్ని. ఈ కేసులో న్యాయం జరగడానికి 9 ఏళ్లకుపైగా పట్టింది. లక్షల మంది పోరాటానికి తగిన ఫలితం దక్కడానికే ఇన్నేళ్లు పడితే, బయటకు రాని ఎందరో అమ్మాయిలకు ఇంకెన్నాళ్లు పడుతుందో అనుకున్నా. అదే సమయంలో తొమ్మిదిమంది బాధితులను కలిశా. వారికి న్యాయం జరిగేలా చూడాలనుకున్నా. ‘పీపుల్‌ అగైనెస్ట్‌ రేప్‌ ఇన్‌ ఇండియా (పరి)’ సేవా సంస్థను ప్రారంభించి వారికి రక్షణ కల్పించా. వారి కోసం కోర్టులో పోరాడుతున్నా. వీరిలో అయిదేళ్ల పాప కూడా ఉండటం గుండెల్ని పిండేస్తూ ఉంటుంది. అత్యాచార బాధితుల తరఫున ఫిర్యాదులు, దరఖాస్తులు ఫైల్‌ చేయడం దగ్గర్నుంచి చికిత్స వంటివన్నీ అందేలా చూస్తా. రోజూ మా సంస్థకు 10-15 కాల్స్‌ వస్తాయి. వితంతువులు, ఒంటరి మహిళలకు వివిధ అంశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నా. ఇప్పటివరకు 1000 మంది మహిళలు దీని ద్వారా క్యాబ్‌డ్రైవర్లు, హౌస్‌కీపింగ్‌ స్టాఫ్‌, కార్‌ క్లీనర్స్‌గా ఉపాధిని పొందారు. అత్యాచార బాధితుల కేసులు ఏళ్లపాటు సాగుతున్నాయి. కొన్ని కేసుల్లో బెదిరింపులూ వస్తుంటాయి. వాటికి భయపడను. బాధితులతో మీకు న్యాయం జరుగుతుందని ప్రమాణం చేయలేను. కానీ.. ఈ పోరాటంలో చివరి వరకూ మీతోడుగా ఉంటానని చెబుతా. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మహిళా రక్షణ సౌకర్యాలు మరింత పెరగాలి’ అంటోంది యోగిత.


Advertisement

మరిన్ని