పనస రుచి చూసి వైద్యవిద్య వదిలేసింది...

పర్యాటకురాలిగా వచ్చిన ఓ విదేశీ యువతి జీవితాన్నే మార్చేసింది మన పనసపండు. మొదటిసారిగా పనస తొనల రుచి చూసిన ఆమె తన వైద్య విద్యనే వదిలేసింది. శాకాహారులకు మాంసాహార విలువలను అందించే ఆహారంలా ఈ పండును మార్చింది. పనసతో మాక్‌ మీట్‌ తయారీని కెరియర్‌గా ఎంచుకుని విజయాలు సాధించడమే కాదు...

Published : 26 Dec 2021 01:02 IST

పర్యాటకురాలిగా వచ్చిన ఓ విదేశీ యువతి జీవితాన్నే మార్చేసింది మన పనసపండు. మొదటిసారిగా పనస తొనల రుచి చూసిన ఆమె తన వైద్య విద్యనే వదిలేసింది. శాకాహారులకు మాంసాహార విలువలను అందించే ఆహారంలా ఈ పండును మార్చింది. పనసతో మాక్‌ మీట్‌ తయారీని కెరియర్‌గా ఎంచుకుని విజయాలు సాధించడమే కాదు... వెయ్యికి పైగా పేద రైతు కుటుంబాలకు ఉపాధిని అందిస్తున్న అమెరికాకు చెందిన యానీ న్యూ విజయగాథ ఇదీ...

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ చదువుతున్న యానీన్యూ పదేళ్ల క్రితం ఇండియా పర్యటనకొచ్చింది. దక్షిణభారతదేశంలో పర్యటిస్తున్నప్పుడు పనసపండును మొదటిసారి చూసింది. పనసతొనల రుచికి ఫిదా అయ్యింది. ఏ వాతావరణంలోనైనా పెరిగి మంచి దిగుబడిని అందించే పనస ఆమెను విపరీతంగా ఆకర్షించింది. తొనలను తినడంతోపాటు చిప్స్‌ తయారీ, పనసపొట్టును వంటకాలకు వినియోగిస్తున్నా, ఇంకా దాదాపు 70 శాతం పండును వృథా చేయడం చూసింది. పోషకాలెక్కువగా ఉండే ఈ పండును పూర్తిగా వినియోగించేలా ఏదైనా చేయాలని ఆలోచించింది.

‘జాక్‌ఫ్రూట్‌ కో’ పేరుతో 2015లో కొలరాడోలో స్టార్టప్‌ను ప్రారంభించింది. పనస పండుతో శాకాహారుల కోసం మీల్‌ స్టాటర్స్‌, జాక్‌ఫ్రూట్‌ మీల్స్‌గా 12 రకాల ఆహార పదార్థాల తయారీని మొదలుపెట్టింది. కెలోరీలు తక్కువ, పీచు ఎక్కువగా ఉండే పనసలో ప్రొటీన్లు, విటమిన్‌ సితోపాటు మాంగనీస్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి అంటుంది యానీ. ‘ఆరోగ్యాన్ని పరిరక్షించే సూపర్‌ఫుడ్‌లాంటి పనసపండును వృథా కాకుండా అందరికీ పోషకాహారంగా అందించాలనే ఈ స్టార్టప్‌ ప్రారంభించా. చదువును మధ్యలోనే ఆపేసి పూర్తిగా దీన్నే కెరియర్‌గా మార్చుకున్నా. మేం తయారుచేసే పదార్థాలన్నీ ప్లాంట్‌ బేస్డ్‌ అయినా మాంసం రుచిని అందిస్తాయి. అలా 2020లో ‘జాక్‌ అండ్‌ యానీస్‌’ పేరుతో రెండో వెంచర్‌ను ప్రారంభించా. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోగలిగే ఉత్పత్తులుగా మీట్‌బాల్స్‌, నగ్గెట్స్‌, క్రంబుల్స్‌, సాసేజెస్‌వంటి దాదాపు 12 రకాలను తయారు చేస్తున్నాం. తాజాగా రెండు కోట్ల డాలర్ల వ్యాపార స్థాయికి మా సంస్థ ఎదిగింది. ఇండియాలో వెయ్యి మంది పేదరైతులతో పనస పంట వేయించా. వీరికి పనస పెంపకం, మార్కెటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ వంటి రంగాల్లో శిక్షణనిస్తూ, అత్యున్నత స్థాయి నాణ్యతతో వారి పంటను దేశదేశాలకూ పరిచయం చేసే నైపుణ్యాలను అందిస్తున్నా’ అని చెబుతోంది యానీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్