ఐఐటీని మెప్పించింది

ఆపద వేళ ప్రతి నిమిషమూ అమూల్యమే. ముఖ్యంగా భూకంపాలు లాంటి విషయాల్లో ముందస్తు సమాచారం ఎన్నో ప్రాణాలను కాపాడగలదు. ఇలా ఆలోచించడమే కాదు.. అవసరమైన సాంకేతికతనూ ఆవిష్కరించింది కంచన్‌ అగర్వాల్‌. ఐఐటీ మద్రాస్‌ గుర్తింపునూ పొందింది.

Published : 18 Jan 2022 01:12 IST

ఆపద వేళ ప్రతి నిమిషమూ అమూల్యమే. ముఖ్యంగా భూకంపాలు లాంటి విషయాల్లో ముందస్తు సమాచారం ఎన్నో ప్రాణాలను కాపాడగలదు. ఇలా ఆలోచించడమే కాదు.. అవసరమైన సాంకేతికతనూ ఆవిష్కరించింది కంచన్‌ అగర్వాల్‌. ఐఐటీ మద్రాస్‌ గుర్తింపునూ పొందింది.
ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌ దగ్గర చిన్న పల్లెటూరు కంచన్‌ది. మధ్యతరగతి కుటుంబం. విద్యాభ్యాసమంతా ఊర్లోనే. చెన్నైలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసి, ఐఐటీ మద్రాస్‌లో భూకంపాలపై     పీˆహెచ్‌డీ చేసింది. అతి సూక్ష్మ కంపనాల్నీ పసిగట్టే ‘రియల్‌టైమ్‌ ఆటోమేటిక్‌ పి-వేవ్‌ డిటెక్టర్‌’ను తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాంకేతికత కన్నా ఇది మెరుగైందని ఐఐటీ మద్రాస్‌ కితాబిచ్చింది. దీనిద్వారా కనీసం 2 నిమిషాల ముందే ప్రజల్ని అప్రమత్తం చేయవచ్చు. అలాగే తీవ్ర నష్టాల్ని కలిగించే అణుశక్తి రియాక్టర్‌లు, రవాణా వంటి వాటిని నిలిపేయొచ్చు. ఫలితంగా ప్రాణ, ఆస్తి నష్టాల్ని అరికట్టే సమయం దొరుకుతుంది. ఈ ఆవిష్కరణకే 2019 జపాన్‌ అంతర్జాతీయ పోటీలో ‘స్టూడెంట్ ట్రావెల్‌ గ్రాంట్ అవార్డు’ను, ఐఐటీ మద్రాస్‌లో అకాడ్స్‌-2020 సదస్సులో బెస్ట్‌ ప్రెజెంటేషన్‌ అవార్డులను సాధించింది. ‘ఉత్తర భారతంలో భూకంపాలెక్కువ. ఫలితంగా ఎంతో నష్టం. వీటికో పరిష్కారం చూపాలనుకున్నా. భూకంపాలు ఒక్కసారిగా రావు. మొదట్లో స్వల్ప కంపనాల్ని ఇస్తాయి, వాటిని గుర్తించలేరు. తర్వాత స్థాయి పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుత సాధనాలు మూడో కంపనాన్ని గుర్తించేవే. తొలిదాన్ని గుర్తించడంపై పరిశోధించా. ఐఐటీ మద్రాస్‌ ఆచార్యులు అరుణ్‌ కె.తంగిరాల ఇందుకు సాయపడ్డారు. వివిధ దేశాల్లో వచ్చిన 200కు పైగా భూకంపాల్ని విశ్లేషించాను. వాటి ఆధారంగానే ఈ సాంకేతికతను తయారు చేశాను. దీంతో అగ్నిపర్వత పేలుళ్లు, సునామీలనీ గుర్తించొచ్చు. పరిశోధన ఖర్చును బోర్డ్‌ ఆఫ్‌ రిసెర్చి ఇన్‌ న్యూక్లియర్‌ సైన్స్‌ భరించింది. ఈ సాంకేతికతను పరికరం, సాఫ్ట్‌వేర్‌ల్లో.. ఎలా తేవాలా అన్నది చర్చిస్తున్నాం. నా చదువు, విజ్ఞానం దేశానికి ఉపయోగపడటం సంతోషాన్నిస్తోంది అంటోంది కంచన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్