వ్యాపారమూ చేస్తా... కలెక్టరూ అవుతా!

13వ ఏట నుంచే అంధత్వం ఆవరించింది. అయినా కుంగిపోలేదు. చదువుతోపాటు సంగీతం, సేవ అంటూ పలురంగాలను పరిచయం చేసుకుంది. యూట్యూబ్‌ ఛానెల్‌నూ నిర్వహిస్తోంది. ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యాన్నీ పెట్టుకుని శ్రమిస్తోంది. చెన్నైకి చెందిన సరస్వతి తన స్ఫూర్తి గాథను ‘వసుంధర’తో పంచుకుంది.

Updated : 22 Feb 2022 06:06 IST

13వ ఏట నుంచే అంధత్వం ఆవరించింది. అయినా కుంగిపోలేదు. చదువుతోపాటు సంగీతం, సేవ అంటూ పలురంగాలను పరిచయం చేసుకుంది. యూట్యూబ్‌ ఛానెల్‌నూ నిర్వహిస్తోంది. ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యాన్నీ పెట్టుకుని శ్రమిస్తోంది. చెన్నైకి చెందిన సరస్వతి తన స్ఫూర్తి గాథను ‘వసుంధర’తో పంచుకుంది.

నాన్న ప్రకాశ్‌ పురోహితుడు. అమ్మ భువనేశ్వరి. మాది చెన్నై. నాకో అన్నయ్య. అయిదో తరగతి చదువుతున్నప్పుడు (12 ఏళ్లు) కంటి సమస్య వచ్చింది. అకస్మాత్తుగా ఓ రోజు బోర్డుపై అక్షరాలు కనిపించడం మానేశాయి. వైద్య పరీక్షల్లో కంటి నరాలు బలహీనపడినట్లు తెలిసింది. ఈ సమస్యకు చికిత్స లేదన్నారు. స్కూల్లో టీసీ ఇచ్చేశారు. అంధుల పాఠశాలలో చేరా. అక్కడంతా కొత్త... తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యల్లో చిక్కుకున్నా. బడికి వెళ్లాలనిపించలేదు. అప్పుడు ఒకటే లక్ష్యం... దీన్నుంచి బయటపడాలి. అందుకే పట్టుదలగా బ్రెయిలీ నేర్చుకున్నా. ఆరు పాసై ఏడులోకి అడుగుపెట్టా. ఇంతలో పులి మీద పుట్రలా ఆస్తమా, ముక్కు నుంచి రక్తం కారడం, అధిక బరువు సమస్యలొచ్చాయి. వీటితో ఏడోతరగతి ఫెయిల్‌. అలాగైతే టీసీ ఇచ్చేస్తామన్నారు బడిలో. దాంతో మళ్లీ పట్టుదల వచ్చింది. కష్టపడి చదివి పదోతరగతి మంచి మార్కులతో పాసయ్యా. సంగీతం మీద ఆసక్తితో స్కూల్లోనే కీబోర్డు, వయోలిన్‌ నేర్చుకున్నా.

డాక్టర్‌ అవ్వాలనుకుని...

చిన్నపుడు డాక్టర్‌ అవ్వాలనుకునేదాన్ని. కానీ కంటి సమస్యతో అది వీలుకాదని తెలిసింది. కలెక్టరు కావాలనే లక్ష్యం పెట్టుకున్నా. ఇంటర్‌ తర్వాత స్టెల్లా మేరీస్‌ కాలేజీలో చేరా. అక్కడ డిగ్రీ పూర్తి చేసిన (2017) తొలి అంధ విద్యార్థిని నేనే. దీని కోసం చాలా శ్రమించా. పాఠ్యాంశాలను బ్రెయిలీలో రాసుకునే దాన్ని. లెక్చరర్‌ మరీ వేగంగా చెబుతుంటే రికార్డ్‌ చేసుకుని ఇంటికెళ్లి నోట్స్‌ తయారు చేసుకునే దాన్ని. స్నేహితులు కూడా నోట్స్‌ ఇస్తూ, చేయూతనిచ్చారు. అన్నయ్య దగ్గర మృదంగం, ఘటం నేర్చుకున్నా. ఎన్‌సీసీలోనూ చేరాను. వారాంతాల్లో గ్రామాలకు వెళ్లి సేవలందించేదాన్ని. చదువు, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన అందించడం, పేదలకు ఆహారాన్ని వండి వడ్డించడం, వాయిద్యాలను వాయించడం... చేసేదాన్ని. సివిల్స్‌కి సిద్ధమయ్యే వారికి కాలేజీలోనే ప్రత్యేక తరగతులు జరిగేవి. పలువురు ఐఏఎస్‌లు వచ్చి అనుభవాల్ని పంచుకునేవారు. వాటికి హాజరయ్యేదాన్ని. డిగ్రీ తర్వాత ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజీలో నమోదు చేసుకొని అర్హత పరీక్ష పాసయ్యా. ఉద్యోగానికి ముందుగా వారిచ్చే ఆరు నెలల శిక్షణకు ఎంపికై బెంగళూరు వెళ్లా. మొదటిసారి ఒంటరిగా నా పనులు నేనే చేసుకుంటూ తరగతులకు హాజరయ్యే దాన్ని. తర్వాత ఆస్తమా ఎక్కువై, తిరిగొచ్చేశా. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగానికి చేరా. అక్కడ చేస్తూనే, 2018లో సివిల్స్‌ ప్రవేశ పరీక్ష పాసయ్యా. అనారోగ్యంతో మెయిన్స్‌ క్వాలిఫై కాలేకపోయా. రెండో సారీ మెయిన్స్‌ దాటలేకపోయా. ఇప్పుడు మూడో ప్రయత్నంలో ఉన్నా.

అంధులకు ప్రత్యేక ఛానెల్‌..

ఆర్థికంగా నిలదొక్కుకోవాలని... చిరుధాన్యాలతో స్వీట్లు చేసి ‘ప్రకాశం స్వీట్స్‌’ పేరుతో విక్రయిస్తున్నాం. నెలకు రూ.20వేలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నా. ఇందులో అమ్మ ప్రోత్సాహమెంతో ఉంది. చిన్నప్పట్నుంచీ అమ్మ దగ్గర వంట నేర్చుకున్న నేను, నాలాంటి వాళ్ల గురించి ఆలోచించే దాన్ని. వారి కోసం ‘టచ్‌ అండ్‌ ఫీల్‌’ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించా. ఆరోగ్యకరమైన వంటలను చేస్తూ వీడియోల్ని పోస్ట్‌ చేస్తున్నా. ఆధునిక సాంకేతికతపై బధిరులకు అవగాహన కలిగిస్తున్నా. దిల్లీ ‘సెల్ఫ్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా’ సహా పలు ఎన్జీవోలకు చెందిన కో-ఆర్డినేటర్స్‌ ద్వారా మా ఛానెల్‌లో ’ఆధునిక సాంకేతికత- అవకాశాలు’ వంటి అంశాలను సైన్‌ లాంగ్వేజ్‌లో చెప్పిస్తున్నా. కలెక్టరు కావాలనేది నా కల. దీంతోపాటు యూట్యూబ్‌ ఛానెల్‌నీ, వ్యాపారాన్నీ వృద్ధి చేయడం నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్