మీలాంటి వాళ్లకి ఈ ఆటెందుకన్నారు!

ఓ పేదింటి అమ్మాయి.. రేస్‌ బైక్‌ మీద రయ్‌మంటూ దూసుకుపోవాలనుకుంది.. ‘ఇవన్నీ నీ వల్లకాదులే.. బుద్ధిగా చదువుకో’ అన్నారందరూ. ఆమె మాత్రం మనసు మాటే వింది. సూపర్‌బైక్‌ రైడింగ్‌ని సైతం నేర్చేసుకుంది. దాని కోసం అహోరాత్రాలూ శ్రమించింది... ఎన్నో ఒడుదొడుకుల్ని అధిగమించి జాతీయ ఛాంపియన్‌గా ‘గ్రేట్‌’ అనిపించుకుంటోంది. అంతేనా...

Published : 15 May 2022 06:41 IST

ఓ పేదింటి అమ్మాయి.. రేస్‌ బైక్‌ మీద రయ్‌మంటూ దూసుకుపోవాలనుకుంది.. ‘ఇవన్నీ నీ వల్లకాదులే.. బుద్ధిగా చదువుకో’ అన్నారందరూ. ఆమె మాత్రం మనసు మాటే వింది. సూపర్‌బైక్‌ రైడింగ్‌ని సైతం నేర్చేసుకుంది. దాని కోసం అహోరాత్రాలూ శ్రమించింది... ఎన్నో ఒడుదొడుకుల్ని అధిగమించి జాతీయ ఛాంపియన్‌గా ‘గ్రేట్‌’ అనిపించుకుంటోంది. అంతేనా... తనలాంటి అమ్మాయిల్ని మెరికల్లా మారుస్తోంది... ఇదంతా పాతికేళ్ల ‘నివేదా జెస్సికా’ విజయగాథ. ఆమెను ‘వసుంధర’ పలకరించినప్పుడు తన రేసింగ్‌ ప్రయాణాన్ని పంచుకుందిలా..

నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. పాఠశాల రోజుల్లో మోటార్‌స్పోర్ట్స్‌ అంటే ఏంటో తెలీదు. మా వీధిలో చాలామంది మగవాళ్లు బైకులమీద దూసుకెళ్లడం చూసి నేనూ ప్రయత్నిద్దామనుకున్నా. అవగాహన పెంచుకుని మెల్లగా నడపడం ప్రారంభించా. ఆ ఇష్టం మరింత పెరిగి 12వ తరగతికొచ్చే సరికి పిచ్చిగా మారింది. కానీ ఈ రంగంలో మహిళలు తక్కువ. వచ్చినా ధనవంతులే. ఎందుకంటే ఇది ఖరీదైన క్రీడ. అమ్మానాన్న నేత కార్మికులు. మనకంత స్థోమత లేదని వారించారు. కానీ ‘డబ్బులేని వాళ్లమే కావచ్చు, సత్తాలేని వాళ్లమైతే కాద’ని ప్రపంచానికి చెప్పాలనుకున్నా. 

వేడుకల్లో నృత్యాలు చేసి..

బీటెక్‌లో చేరాక ధ్యాసంతా మోటార్‌స్పోర్ట్స్‌ మీదే పెట్టా. శిక్షణకి మంచి బైక్, ప్రత్యేక సూట్‌ కావాలి. ఆపైన బైక్‌ నిర్వహణ, ఇంధనం, శరీర దారుఢ్యానికి జిమ్‌... ఈ ఖర్చులూ ఉంటాయి. కానీ ఎవరి నుంచీ సహకారం అందలేదు. ముందుకెళ్లడమా.. వెనక్కి పారిపోవడమా! రెండోది మనస్కరించలేదు. ముందుకే వెళ్లా. ఈ ఖర్చుల కోసం పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేయాలనుకున్నా. ఓ సంస్థ కోసం వేడుకల్లో నృత్యం చేసే అవకాశం దొరికింది. ఇంకా కొన్ని కంపెనీలు, బ్రాండ్‌లకు ప్రమోటర్‌గా తిరుగుతూ, మగవాళ్లతో పోటీపడి పనిచేశా. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షోరూమ్‌లో చిన్న ఉద్యోగంలోనూ చేరా. బీటెక్‌ పూర్తయ్యేదాకా ఇలా కొనసాగా. కొందరు మహిళా రేసర్లు నన్ను చూసి ‘ఎందుకొచ్చావు, ఏదోక ఉద్యోగం చూసుకోవచ్చుగా’ అని సలహాలిచ్చేవారు. మోటార్‌ స్పోర్ట్స్‌పై నా తపన, వారి మాటలకు నేను కుంగిపోవడం చూసి కోచ్‌ దశరత్‌కుమార్‌ నన్నెంతో ప్రోత్సహించారు. ప్రత్యేక శ్రద్ధతో మెలకువలు నేర్పారు. శిక్షణ సమయంలో సూట్, ఉపకరణాలు అద్దెకు తీసుకునేదాన్ని. ఇతరుల బైక్‌లు వాడే దాన్ని.

నొప్పితోనే పోటీలకు..

రేసింగ్‌లో నమ్మకం వచ్చాక నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశాల కోసం వెతికేదాన్ని. 2016.. గోవాలో పోటీలు జరుగుతున్నాయని తెలిసింది. అక్కడే జాతీయ పోటీల కోసం ఎంపికలూ జరుగుతాయన్నారు. ఆ పోటీలు నా లక్ష్యానికి తొలి అడుగు కావాలని కలలు కన్నా. వారంలో పోటీ అనగా ప్రాక్టీసులో నా కాలర్‌బోన్‌ విరిగింది. సర్జరీ చేశారు కూడా. ఇలా జరిగిందేంటీ... అని కుంగిపోయా. ధైర్యం తెచ్చుకుని మళ్లీ సాధన చేశా. నొప్పితోనే పోటీలకు వెళ్లా. మహిళల 500 సీసీ బైకుల కేటగిరీలో పోటీ పడ్డా కానీ ఎంపిక కాలేదు. 2017లో బెంగళూరులో జరిగిన ఎంపికల్లోనూ నిరాశే. దాంతో లోపాలు సరిదిద్దుకోవడం మీద దృష్టిపెట్టా. ఏడాది ప్రాక్టీసుతో మరింత పట్టు సాధించా. 2019లో చెన్నైలో జరిగిన టీవీఎస్‌ ‘వన్‌ మేక్‌ ఛాంపియన్‌’ 5 రౌండ్ల పోటీలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచా. అదే ఏడాది కోయంబత్తూరులో నేషనల్‌ డ్రాగ్‌ రేసింగ్‌ ఛాంపియన్‌ పోటీల్లోనూ నాదే విజయం. ఈ రెండింటితో నాకో గుర్తింపు వచ్చింది. టీవీఎస్‌ పోటీల్లో విజయంతో రేస్‌ బైక్‌ని బహుమతిగా అందుకున్నా. దాని మీద కూర్చున్నపుడు కన్నీళ్లాగలేదు. తర్వాత నేషనల్‌ మోటార్‌ సైకిల్‌ డ్రాగ్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో, మరో పోటీలో రన్నరప్‌గా నిలిచా. 

మరో లక్ష్యం..

రేసర్‌ అవ్వాలనుకుంటే అమ్మానాన్నల్ని ఒప్పించి, ఖర్చులకూ సిద్ధమవ్వాలని చెబుతా. నాలాగే ఏదో సాధించాలని రేసింగ్‌లోకి అడుగుపెట్టామని చాలామంది చెప్పేవారు. అలాంటి వారికి శిక్షణ ఇవ్వడం కోసం 2020లో ‘ఉమెన్‌ మోటార్‌సైక్లింగ్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా’ని స్థాపించా. వివిధ రాష్ట్రాలకు చెందిన 30మంది యువతులకు శిక్షణ ఇచ్చా. వీరు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం.. ఇలా పలు ప్రాంతాల్లో శిక్షణ ఇస్తున్నారు. వీళ్ల దగ్గర 18-45 ఏళ్ల వరకూ మహిళలు రేసింగ్‌ నేర్చుకుంటున్నారు. వీరిని ఛాంపియన్లుగా తయారుచేయడం ఓ లక్ష్యమైతే... సూపర్‌బైక్‌ మోటార్‌స్పోర్ట్స్‌ అంతర్జాతీయంగా పోటీపడటం మరో లక్ష్యం. దీనికోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. రేస్‌ బైక్‌పై గంటకి 160కి.మీ, సూపర్‌బైక్‌పై 220కి.మీ మించే వెళ్తా. ఈ ప్రయాణంలో గాయాలూ సాధారణమైపోయాయి. చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌ అయిన ‘అనా కరాస్కో’ నాకు స్ఫూర్తి. ఆమె బాటలోనే నడిచి దేశం పేరు నిలబెట్టాలనుకుంటున్నా. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ‘ఎన్‌ఎస్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌’ సంస్థని నడిపిస్తున్నా. ఎవరి సహకారమూ లేకపోయినా మహిళ తనని తాను నిరూపించుకోగలదని చాటిచెప్పేందుకు ఇవన్నీ చేస్తున్నా. 

-హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్