82లో మన ముగ్గురు!

పర్వతారోహణలో అమ్మాయిలూ కనిపిస్తోన్నా.. పురుషులదే హవా! దీన్నే మార్చాలనుకుంది స్విట్జర్లాండ్‌ పర్యాటక సంస్థ. ఇందుకోసం 25 దేశాల నుంచి 82 మంది వనితల్ని ఎంపిక చేసింది. వారంతా ఇటీవలే 4164 మీటర్ల ఎత్తైన బ్రెయింతార్న్‌ పర్వతాన్ని ఎక్కేశారు. వీళ్లంతా

Published : 26 Jun 2022 01:31 IST

పర్వతారోహణలో అమ్మాయిలూ కనిపిస్తోన్నా.. పురుషులదే హవా! దీన్నే మార్చాలనుకుంది స్విట్జర్లాండ్‌ పర్యాటక సంస్థ. ఇందుకోసం 25 దేశాల నుంచి 82 మంది వనితల్ని ఎంపిక చేసింది. వారంతా ఇటీవలే 4164 మీటర్ల ఎత్తైన బ్రెయింతార్న్‌ పర్వతాన్ని ఎక్కేశారు. వీళ్లంతా ఒక పొడవైన తాడును పట్టుకొని వరుసగా ఎక్కారు. ప్రపంచంలోనే అతి పొడవైన మహిళా రోప్‌ టీమ్‌గా రికార్డు సృష్టించారు. వారిలో ముగ్గురు మనమ్మాయిలే! వాళ్లెవరో చూసేయండి.


ఆల్పైన్‌ స్కీయర్‌:
ఆంచల్‌ ఠాకూర్‌

ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమకు నచ్చింది చేయడానికి, తమ చుట్టూ ఉన్న బంధనాల్ని తెంచుకొని ధైర్యంగా అడుగేయడానికి ఇంది నాంది అవుతుందని ఆశిస్తున్నా

స్కీయింగ్‌లో దేశానికి మొదటి అంతర్జాతీయ మెడల్‌ తీసుకొచ్చిందీ అమ్మాయి. ఈమెది హిమాచల్‌ ప్రదేశ్‌లోని బురువా. నాన్న రోషన్‌ ఠాకూర్‌ వింటర్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి సెక్రటరీ జనరల్‌. ఆయన్నుంచి దీనిపై ఆసక్తి ఏర్పరచుకుంది. అన్న హిమాన్షూ ఠాకూర్‌ కూడా స్కీయరే. 2012 వింటర్‌ యూత్‌ ఒలింపిక్స్‌ సహా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. 2018లో టర్కీలో జరిగిన ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డీ స్కీలో కాంస్య పతకం సాధించి దేశం నుంచి ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచింది. ఈమెకు స్విట్జర్లాండ్‌ పర్యటకం నుంచి రోప్‌ టీమ్‌లో పాల్గొనమని ప్రత్యేకంగా పిలుపు రావడంతో వెళ్లింది. ‘స్కీయర్‌నే అయినా పర్వతారోహణ భిన్న అనుభూతి. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంత మందితో కలిసి చరిత్రలో భాగమవడం చాలా ఆనందంగా ఉంది’ అంటోంది 24 ఏళ్ల ఆంచల్‌.


ఎంతోమందితో పోటీ పడి..:
చార్మి దేధియా

ఇది మహిళలు ముఖ్యంగా భారతీయ వనితలకు స్ఫూర్తిగా నిలిచి అడుగు బయటపెట్టేలా ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నా. ఉద్యోగాలు, ఇంటికే పరిమితమవకుండా సాహసక్రీడలవైపూ వారిని నడిపిస్తుందని భావిస్తున్నా

బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, పీజీ చేసింది. వివిధ సంస్థల్లో పనిచేసి, మర్చండైజింగ్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగింది. ఈమెది ముంబయి. రోపింగ్‌ టీమ్‌లో కొందరు సామాన్యులకూ అవకాశం ఇవ్వాలనుకున్నారు నిర్వాహకులు. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ చేసిన ఎంపికలో చార్మి ఎంపికైంది. ‘ఎంపిక దగ్గర్నుంచి, పర్వతారోహణ పూర్తి చేయడం వరకు అంతా కలలాగే ఉంది. మొదటిసారే అయినా విజయవంతంగా పూర్తి చేశా’నంటోంది 36 ఏళ్ల చార్మి.


జర్నలిస్ట్‌:
శివానీ ఘారట్‌

మహిళలు దేనిలోనైనా రాణించగలరు. ఎన్నో సవాళ్లనూ అధిగమించగల శక్తి వాళ్లకు ఉంది. అది గ్రహించేలా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.

ఈ రోపింగ్‌ టీమ్‌లో ప్రధానంగా ఇన్‌ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులకు ప్రాధాన్యమిచ్చారు. శివానీ జర్నలిస్ట్‌, యాంకర్‌. సీన్‌బీసీ- టీవీ18కి ప్రొడ్యూసర్‌. ఇంకా మారథాన్‌ ట్రైనర్‌. వివిధ మారథాన్లలో గెలిచింది కూడా. ఫోర్బ్స్‌ వంటి ప్రఖ్యాత పత్రికల్లో తన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఈమెది ముంబయి. యువతలో ఫాలోయింగ్‌ ఎక్కువ. అదే ఆమెకు ఈ పర్వాతరోహణ అవకాశం తెచ్చిపెట్టింది. ‘నాకు ఆరోగ్య స్పృహ ఎక్కువ. కానీ ఇది కొత్త. సవాలుగా తీసుకొని పూర్తి చేశా. పర్వత శిఖరాగ్రం చేరాక దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను’ అని చెబుతోంది 34 ఏళ్ల శివానీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని