పనికి రావన్నారు.. పతకాలు సాధిస్తోంది!

‘నువ్వు దీనికి పనికి రావు.. అకాడమీలోకి అడుగు పెట్టడానికే వీల్లేదు’ పద్నాలుగేళ్ల అమ్మాయికి ఎంత పెద్ద శిక్ష. పైగా తెలియక జరిగిన పొరపాటుకి! అగాథంలోకి పడిపోయానన్న భావన.. కానీ ఆ అమ్మాయి అక్కడే ఆగిపోవాలనుకోలేదు. పడి లేచిన కెరటంలా ఎగిసింది.. దేశం గర్వించేలా అంతర్జాతీయ స్థాయిలో

Updated : 22 Jul 2022 07:57 IST

‘నువ్వు దీనికి పనికి రావు.. అకాడమీలోకి అడుగు పెట్టడానికే వీల్లేదు’ పద్నాలుగేళ్ల అమ్మాయికి ఎంత పెద్ద శిక్ష. పైగా తెలియక జరిగిన పొరపాటుకి! అగాథంలోకి పడిపోయానన్న భావన.. కానీ ఆ అమ్మాయి అక్కడే ఆగిపోవాలనుకోలేదు. పడి లేచిన కెరటంలా ఎగిసింది.. దేశం గర్వించేలా అంతర్జాతీయ స్థాయిలో పతకాలను కొల్లగొడుతోంది. షూటర్‌ మెహులీ ప్రయాణమిదీ..!

అందరు చిన్నారుల్లాగే పెయింటింగ్‌, డ్యాన్స్‌.. ఇదే మెహులీ లోకం. సినిమాలు ముఖ్యంగా యాక్షన్‌ చిత్రాలంటే పిచ్చి. హీరోలు రెండు చేతులతో గన్‌లు పేలుస్తోంటే.. ‘ఒకసారి నాకూ అవకాశమొస్తేనా..’ అనుకునేది. గన్‌ చేతికి రావాలంటే ఏం చేయాలన్న దానిపై చిన్నారి మెహులీకి అవగాహన లేదు. ఏదో ఒక సందర్భంలో ఎవరో చెప్పారు... అభినవ్‌ బింద్రా ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో బంగారు పతకాన్ని సాధించాడని. అది విన్నాక తనూ నేర్చుకోవాలనుకుంది. తెలిసిన వాళ్లెందరినో అడిగింది. తన తరగతిలోనే ఓ అమ్మాయి షూటింగ్‌ నేర్చుకుంటోందని తెలిసి వివరాలు కనుక్కుంది. తనూ నేర్చుకుంటానని ఇంట్లో చెప్పింది. అప్పటికి తనకు 13 ఏళ్లు. తన ఉత్సాహాన్ని చూసిన అమ్మానాన్నలు కాదనలేకపోయారు. రైఫిల్‌ క్లబ్‌లో చేర్చడానికి వెళ్లారు. అప్పుడు కానీ తెలియలేదు అదెంత ఖర్చుతో కూడుకున్నదో! 2014లో.. అతి సాధారణ రైఫిల్‌ ఖరీదే రూ.75వేలు.

తానొకటి తలిస్తే..

వీళ్లది కోల్‌కతా. మధ్యతరగతి బెంగాలీ కుటుంబం. నాన్న నిమయ్‌ ఘోష్‌ క్లర్క్‌. అమ్మ మిథాలీ గృహిణి. అంత డబ్బు తేలేక, మెహులీని కాదనలేక పాపం వాళ్లు సతమతమయ్యారు. అది చూసి వాళ్లమ్మమ్మ తాతయ్యలు సాయం చేశారు. ఆ తర్వాతి ఖర్చులకు నగలు కుదువ పెట్టింది వాళ్లమ్మ. వాళ్ల నమ్మకానికి తగ్గట్టుగానే మెహులీ కష్టపడి సాధన చేయడమే కాదు.. అద్భుతంగా రాణించేది. అయితే అప్పుడే అనూహ్య సంఘటన. అనుకోకుండా ఒకతన్ని గాయపరిచింది. దీంతో ఆ రైఫిల్‌ క్లబ్‌ వాళ్లు తనను బ్యాన్‌ చేశారు. 14 ఏళ్ల మెహులీకి అదో షాక్‌. దీంతో మానసికంగా కుంగిపోయింది. ఎంతగా అంటే... రెండు నెలలపాటు ఎవరితోనూ మాట్లాడిందీ లేదు... కలిసిందీ లేదు. దాన్ని చూడలేక వాళ్లమ్మా వాళ్లు ఒలింపిక్‌ ఫైనలిస్ట్‌.. షూటర్‌ జయ్‌దీప్‌ కర్మాకర్‌ని కలిశారు. ఆమె పరిస్థితి విన్న ఆయన మెహులీకి శిక్షణ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ తనపై పెద్ద ఆశలేమీ పెట్టుకోలేదు. కారణం ప్రతి వారూ తను షూటింగ్‌కు పనికి రాదనే వారే! మెహులీ మాత్రం దీన్నో సవాలుగా తీసుకొంది. కోచ్‌ సూచనలను తు.చ. తప్పకుండా పాటించేది. శరీరంతోపాటు మనసుపైనా పట్టు తెచ్చుకుంది. అంతకు ముందు వారాంతాల్లో 2 గంటలు చొప్పున సాధన చేసేది. దాన్ని నాలుగు రోజులకు మార్చుకుంది. కోచింగ్‌ అకాడమీకి వెళ్లడానికే 2 గంటలు పట్టేది. ఇంటికి చేరుకునే సరికి రాత్రి 10 దాటేది. అయినా సాధన కొనసాగించింది.

విజయాలు వరుసకట్టాయి..

చదువుకీ సమప్రాధాన్యమిచ్చేది మెహులీ. పదోతరగతిలో 80 శాతం మార్కులు సాధించింది. తుది పరీక్షకు నెల ముందు కేరళలో భారత జట్టు సెలక్షన్‌ ట్రయల్స్‌. తోడుగా పుస్తకాలనూ తీసుకెళ్లింది తను. ఖాళీ సమయంలో చదివేది. తన శ్రమ ఫలించి 2017లో చెక్‌ రిపబ్లిక్‌లో నిర్వహించిన షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చోటు సాధించి, ఏడో స్థానంలో నిలిచింది. అదే ఏడాది జపాన్‌లో నిర్వహించిన పోటీలో పతకాన్ని సాధించింది. 2018లో మెక్సికోలో జరిగిన వరల్డ్‌కప్‌లో రెండు పతకాలను సాధించింది. మన దేశం నుంచి ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. అంతేకాదు జూనియర్‌ వరల్డ్‌ రికార్డునీ సాధించింది. 2019 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో రజతం, సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకాల్ని సాధించింది. 2020లో ‘ఫిమేల్‌ యంగ్‌ అథ్లెట్‌’ అవార్డునీ అందుకుంది. కొవిడ్‌ తన జోరుకు అడ్డు తగిలింది. దీనికి తోడు మోకాలి గాయం. లాక్‌డౌన్‌లో సాధనా కష్టమైంది. ఇవీ తనపై ప్రభావం చూపాయి. ఫలితంగా 2020 ఒలింపిక్స్‌కు ఎంపిక కాలేకపోయింది. కానీ మెహులీ అంత తేలిగ్గా వదిలిపెట్టేరకం కాదు కదా. వెంటనే మకాం హైదరాబాద్‌కు మార్చింది. బిబశ్వాన్‌ గంగూలీ శిక్షణలో సాధన మొదలుపెట్టింది. చికిత్స తీసుకుంటూనే రోజుకి 10 గం. సాధన చేసేది. ఆ కష్టానికి ఫలితమే ఈ నెలలో కొరియాలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో మిక్స్‌డ్‌ ఎయిర్‌ రైఫిల్‌లో బంగారు పతకం.


‘ఈ గెలుపు ఉత్తేజాన్నిచ్చింది. దాన్ని కొనసాగించడమే నా పని. అయితే నా లక్ష్యం మాత్రం 2024 ఒలింపిక్‌ పతకం. ఈ క్రమంలో ఇంటికి దూరంగా ఉండటం వంటి ఎన్నో త్యాగాలు చేయాలి. కోరుకున్నది దక్కించుకోవాలంటే కష్టం తప్పదుగా మరి! అబ్బాయిల రంగంగా భావించే దీనిలో ప్రతిభ కనబరిచి మరింతమంది అమ్మాయిలు వచ్చేలా ప్రోత్సహిస్తా’ అంటోంది 21 ఏళ్ల మెహులీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని