7 శిఖరాలను జయించాలని...
చిన్నప్పుడే నాన్నతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళుతూ.. పర్వతారోహణపై ఆసక్తిని పెంచుకుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులూ ఉన్నా వాటన్నింటినీ పట్టుదలతో ఎదుర్కొంది. అంతేనా సామాజిక సేవలోనూ ముందంజే. అమెరికాలో ఎవరెస్టునెక్కిన పిన్న వయస్కురాలు లూసీ వెస్‌ట్లేకే కథనమిది...
చిన్నప్పుడే నాన్నతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళుతూ.. పర్వతారోహణపై ఆసక్తిని పెంచుకుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులూ ఉన్నా వాటన్నింటినీ పట్టుదలతో ఎదుర్కొంది. అంతేనా సామాజిక సేవలోనూ ముందంజే. అమెరికాలో ఎవరెస్టునెక్కిన పిన్న వయస్కురాలు లూసీ వెస్‌ట్లేకే కథనమిది...
చిన్నప్పటి నుంచి లూసీకి నాన్నతోపాటు కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లడం అలవాటు. అదే ఆమెను పర్వతశిఖరాలను చూడాలనే కలను కనేలా చేసింది. తను ఏడో తరగతి వరకు ఇంట్లోనే చదివింది. ఆ తర్వాతే స్కూల్‌లో చేరింది. నలుగురితో కలిసి నేర్చుకునే పాఠాలే అసలైన చదువు అంటుంది లూసీ. ‘హైస్కూల్ స్థాయిలోనే పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యాన్ని అందించే ప్రాజెక్ట్స్‌కు మద్దతునిస్తూ, కెన్యా వెళ్లా. అక్కడ పాఠశాల విద్యార్థులతో కలిసి పరుగుల పోటీలోనూ పాల్గొన్నా. స్కూల్‌లో ఉన్నప్పుడే వారానికి 40 మైళ్ల పరుగు, 50 వెయిట్ లిఫ్టింగ్ సెషన్స్ అలవాటుండేవి. శారీరక సామర్థ్యంతోనే అనుకున్నది సాధించొచ్చని నాన్న చెబుతారు. అవన్నీ ఇప్పుడు పర్వతారోహణలో ఉపయోగపడుతున్నాయి’ అని చెప్పుకొస్తున్న లూసీ తన 13వ ఏటనే అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతాన్నెక్కడానికి సాహసించింది. లక్ష్యాన్ని చేరుకొనే సమయంలో అనుకోని సమస్యలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. కానీ అక్కడితో ఆగలేదు. 17వ ఏట అలాస్కాలోని డెనాలి పర్వతాన్నెక్కి, ‘యంగెస్ట్ ఫిమేల్ క్లైంబర్ ఆఫ్ ఆల్ 50 స్టేట్ హై పాయింట్స్’ టైటిల్ అందుకుంది.
ఒత్తిడికి లోనై..
లూసీ ఆరోగ్యరీత్యా పాల ఉత్పత్తులు పడవు. గ్లూటెన్‌కు దూరంగా ఉండాలి. ఐరన్ పుష్కలంగా ఉండే పదార్థాలను మాత్రం ఆహారంలో చేర్చుకుంటూ తాజా కూరగాయలు, పండ్లకు లూసీ ప్రాముఖ్యతనిస్తుంది. పర్వతారోహణలో మాత్రం ఆవిరిపై ఉడికించే ఆహారాన్ని, చాక్లొట్, గమ్మీస్ తీసుకుంటుంది. ‘ఎవరెస్టు ఎక్కాలనే నా కల తీరాలంటే ఛాలెంజ్‌లెన్నుంటాయో అప్పుడే తెలుసుకున్నా. ఈ ప్రయాణానికి కావాల్సిన రూ.40 లక్షలు నావద్ద లేవు. ‘గోఫౌండ్‌మి’ పేరుతో నెలరోజులు ఓ యాత్ర చేశా. దాని ద్వారా రూ.20 లక్షలు చేతికొచ్చాయి. గ్రేప్‌నట్స్ అనే సంస్థ రూ.10లక్షలు ఇచ్చింది. నా టూర్ గ్రూపు నుంచి మిగతా నగదు సహాయం అందడంతో వెళ్లగలిగా. పర్వతారోహణలో నాతోపాటు 100మందికిపైగా ఉన్నారు. ముఖానికి ఆక్సిజన్ మాస్క్, వీపుపై బరువు, మంచులో ధరించే సూట్.. ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉండేవి. నడుస్తుంటే మగతగా కూడా అనిపించేది. మార్గమధ్యంలో ఒక మృతదేహాన్ని చూసి భయమేసింది. నాన్న లేకుండా నా మొదటి పర్వతారోహణ ఇది. చాలా ఒంటరిగా అనిపించేది. ఎన్నో ప్రయాసలకోర్చి శిఖరాగ్రాన్ని చేరుకున్నప్పుడు అప్పటి వరకూ పడిన కష్టాలన్నీ మర్చిపోయా. ఎవరెస్టు శిఖరమెంతో అందంగా ఉంది. ఏడు ఎత్తైన పర్వతాలెక్కాలనేది నా లక్ష్యం కాగా, ఎవరెస్టుతో నాలుగు పూర్తయ్యాయి’ అని చెబుతున్న చికాగోకు చెందిన లూసీ, తనకు 20 ఏళ్లు నిండేలోపే కాప్పింగ్ ఫీట్ పర్వతాన్ని అధిరోహించిన యువతిగా నిలవాలనుకుంటోంది. త్వరలో అంటార్కిటికాలోని విన్సన్ పర్వతారోహణ చేయడానికి సిద్ధపడుతోంది లూసీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.