ఆమె సమస్యలకు.. టెక్‌ పరిష్కారం!

నెలసరి ఇబ్బందులు, పీసీఓడీ, పిల్లలు పుట్టకపోవడం.. వీటి గురించి తోటివారితో చర్చించడానికీ ముందుకు రాని మహిళలెందరో! చెప్పే ధైర్యం చేసినా తననే నిందిస్తారు. ఆ భయంతో మిన్నకుండిపోయేవారే ఎక్కువ. నగరాల్లోనే

Published : 19 Sep 2022 00:33 IST

నెలసరి ఇబ్బందులు, పీసీఓడీ, పిల్లలు పుట్టకపోవడం.. వీటి గురించి తోటివారితో చర్చించడానికీ ముందుకు రాని మహిళలెందరో! చెప్పే ధైర్యం చేసినా తననే నిందిస్తారు. ఆ భయంతో మిన్నకుండిపోయేవారే ఎక్కువ. నగరాల్లోనే పరిస్థితిలా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకెలా ఉంటుందో అర్థమైంది కరీనాకి. తన సంస్థ ‘హమ్‌’ ద్వారా మహిళల సమస్యలెన్నింటికో పరిష్కారం చూపుతోంది!

తనకు 13 ఏళ్లు ఉన్నప్పుడే కరీనా కోహ్లీకి పీసీఓస్‌ అని తేలింది. అమ్మానాన్న ఇద్దరూ వ్యాపారులే. కలిగిన కుటుంబం. దీంతో పెద్ద వైద్యుల వద్ద చికిత్స తీసుకుంది. ఆధునిక కుటుంబం అయినా అవాంఛిత రోమాలు, తల్లయ్యే అవకాశాలు లాంటి విషయాలను ఇంట్లో చర్చించనిచ్చేవారు కాదు. తన సమస్య ఎవరితో చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. దీర్ఘకాలిక చికిత్సతో సైడ్‌ఎఫెక్ట్స్‌, బరువులో పెరుగుదల లాంటివి ఎదుర్కొంది. ఇతరులతో పోల్చుకొని ఆత్మన్యూనతకు గురయ్యేది. తనది ముంబయి. 14 ఏళ్లు పోరాడితే కానీ పీసీఓఎస్‌, బరువు అదుపులోకి రాలేదు కరీనాకి. ఆ తర్వాతే తనలా ఎంతోమంది ఈ విషయంలో సతమతమవుతుండటం గమనించింది. తను స్కాట్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ నుంచి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసింది. అది 2020 కరీనా తన ఆఖరి సెమిస్టర్‌ చదువుతోంది. ఓసారి గర్భిణి అయిన తన స్నేహితురాలు కరోనా కారణంగా ఆసుపత్రికి వెళ్లాలన్నా భయమేస్తోందని తన ఆవేదనను కరీనాతో పంచుకుంది. దీనికితోడు కొవిడ్‌కి సంబంధించి ఎన్నో అపోహలు. నిజమేదో, అబద్ధమేదో తెలీడం లేదని వాపోయింది తను. ఇవన్నీ తనను ఫెమ్‌టెక్‌ వైపు నడిపించాయి. అలా 2020 డిసెంబరులో ఆన్‌లైన్‌లో ‘బేబీ స్పేస్‌’ ప్రారంభించింది.

రెండు సంస్థలు..

‘నాన్నది సెక్యూరీటీ సీల్‌ వ్యాపారం. అమ్మది హాస్పిటాలిటీ రంగం. సెలవుల్లో వాళ్ల సంస్థలో పనిచేసేదాన్ని. ఆ అనుభవం వ్యాపారంపై ఆసక్తి కలిగించింది. ఆరోగ్యరంగం వైపు రావాలనుండేది కానీ.. ఎలా అన్నదానిపై స్పష్టత లేదు. నా స్నేహితురాలి వల్ల బేబీస్పేస్‌ ఆలోచన వచ్చింది. ఇది సమాచారానికి సంబంధించింది. దీనిలో నిపుణులు ఆమోదించిన సమాచారమే ఉంటుంది. దీనికోసం 300 మందికిపైగా గర్భిణులు, తల్లులు, 40 మంది వైద్యులను కలిసి మాట్లాడా. గర్భధారణ, చనుబాలు, వీటిపై కొవిడ్‌ ప్రభావం, శారీరక సాన్నిహిత్యం, సరోగసీ, ఐవీఎఫ్‌ వంటి ఎన్నో అంశాలపై సమాచారం ఉంటుంది. ఏడాదిలోపే దాదాపు 20వేలమంది దీనిలో సభ్యులయ్యారు’ అని చెబుతుంది కరీనా. ఇదిచ్చిన ధైర్యంతో హెల్త్‌కేర్‌ సంస్థ ‘హమ్‌’ని ప్రారంభించింది. అంటే హిందీలో మనం అనర్థం. ‘ప్రసవం వరకూ చాలామంది జాగ్రత్తగా ఉంటారు కానీ.. ఆ తర్వాతా బోలెడు సమస్యలు. దీనిమీద పరిశోధన సాగించినప్పుడు చాలామందికి పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌, గిల్ట్‌ సైకోసిస్‌, చనుబాలివ్వడంలో అపోహలు.. వంటి చాలా సమస్యల గురించి అవగాహనా లేదని గమనించాం. అందుకే 400 మంది వైద్యులతో ‘హమ్‌’ ప్రారంభించా. ఇదో యాప్‌ ఆధారిత సర్వీస్‌. దీనిలో సైకియాట్రిస్ట్‌లు, పీడియాట్రిషన్స్‌, థెరపిస్టులు, న్యూట్రిషనిస్టులు, లైఫ్‌కోచ్‌లు.. ఇలా ఎందరో నిపుణులుంటారు. వీరి నుంచి పోస్ట్‌నాటల్‌, పోస్ట్‌పార్టమ్‌, మెంటల్‌ హెల్త్‌, ఫ్యామిలీ ప్లానింగ్‌ వంటి ఎన్నింటికో వీడియో కన్సల్టింగ్‌ ద్వారా సలహా తీసుకోవచ్చు. ఖర్చూ తక్కువే. దీనిలోనూ 20 వేలకుపైగా సభ్యులున్నారు’ అని చెప్పే కరీనా.. భవిష్యత్తులో ఫ్యామిలీ కన్సల్టింగ్‌ వంటి ఇంకొన్ని సేవల్ని జోడిస్తుందట. ఉద్యోగినులతో పనిచేసే ఒక పైలట్‌ ప్రోగ్రామ్‌నీ రూపొందిస్తోంది. మెటర్నిటీ లీవ్‌ తర్వాత ఉద్యోగినులకు సాయపడే వాతావరణాన్ని ఆఫీసులో ఎలా  రూపొందించొచ్చన్నది దీని ఉద్దేశమట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని