ఎత్తులేస్తూ... పంచ్‌ విసురుతూ..!

చెస్‌ బోర్డుపై ప్రత్యర్థికి చెక్‌ చెప్పడమే కాదు, మధ్యమధ్యలో బరిలోకి దిగి బాక్సింగ్‌తో పంచ్‌లు కురిపించాలి. గాయాలెన్నైనా.. లెక్కచేయక చురుకైన మెదడుతో ఆడే ఆటే.. చెస్‌బాక్సింగ్‌.

Published : 09 May 2023 00:27 IST

చెస్‌ బోర్డుపై ప్రత్యర్థికి చెక్‌ చెప్పడమే కాదు, మధ్యమధ్యలో బరిలోకి దిగి బాక్సింగ్‌తో పంచ్‌లు కురిపించాలి. గాయాలెన్నైనా.. లెక్కచేయక చురుకైన మెదడుతో ఆడే ఆటే.. చెస్‌బాక్సింగ్‌. ఈ క్రీడలోకి అడుగుపెట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలను కైవసం చేసుకొంటున్నారు 23 ఏళ్ల స్నేహ సంజయ్‌ వేకర్‌. విమర్శలను దాటి విజేతగా నిలిచి తనలాంటివారికి స్ఫూర్తిదాయకమవుతున్నారు.

బాల్యం నుంచి స్నేహకు క్రీడాస్ఫూర్తి ఎక్కువ. ముంబయికి చెందిన ఈమె కుటుంబమంతా చెస్‌లో ప్రవీణులు. దీంతో అయిదో ఏట నుంచే అమ్మానాన్న చెస్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారామెకు. అయితే, స్కూల్‌ స్థాయిలో బ్యాడ్మింటన్‌, కాలేజీకొచ్చేసరికి పరుగులో ముందుంటూ పలు మారథాన్‌లలోనూ పాల్గొన్నారు. ఇంజినీరింగ్‌ చేస్తున్న సమయంలో బాక్సింగ్‌పై కలిగిన ఆసక్తి స్నేహ కెరియర్‌ను మార్చింది.

బరువు లేదని..

బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి కోచ్‌ కృష్ణ వద్ద చేరారీమె. ‘అప్పట్లో నా బరువు 48 కేజీలు మాత్రమే. సన్నగా పీలగా ఉండే నన్ను చూసి బాక్సింగ్‌కు పనికిరావంటూ విమర్శించేవారు. నిరాశపడినప్పుడు అమ్మ అందించిన ప్రోత్సాహం మరవలేను. లక్ష్యాన్ని సాధించాలంటే శ్రమించడానికి భయపడకూడదని చెప్పేది. తను నింపిన స్ఫూర్తితో నెమ్మదిగా ఎనిమిది కేజీలు బరువు పెరిగాను. నాలుగేళ్లలోపే జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించగలిగా. చెస్‌ కూడా బాగా ఆడగలనని తెలిసిన మా గురువు ఓసారి చెస్‌ బాక్సింగ్‌ గురించి చెప్పి ప్రోత్సహించారు. అలా నా కెరియర్‌లో మరో మలుపు తిరిగిందంటా’రు స్నేహ.

మహిళలు తక్కువ..

చెస్‌ బాక్సింగ్‌లో స్నేహ చేరేటప్పటికి మహిళలు చాలా తక్కువ. ‘చెస్‌ లేదా బాక్సింగ్‌ .. ఏదో ఒకదాన్నే ఎంచుకో. రెండు పడవలపై ప్రయాణిస్తున్నావెందుకంటూ’ చాలామంది తనని విమర్శించేవారు. కానీ, ఆ మాటల్ని తను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇష్టమున్నచోటే రాణించగలమని ఆమె నమ్మకం. ‘ఎడ్‌-టెక్‌లో కోడింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తూ, చెస్‌ బాక్సింగ్‌ శిక్షణ తీసుకొనేదాన్ని. మరోపక్క అమ్మానాన్నల నుంచి చెస్‌లో మెలకువలు తెలుసుకొనేదాన్ని. ఈ క్రీడలో చెస్‌ ఆడుతూ, మధ్యలో బాక్సింగ్‌ చేయడంవల్ల శారీరకంగా అలసటతో పాటూ గాయాలూ అయ్యేవి. అలాంటి క్లిష్ట సమయంలోనూ మెదడు చురుకుగా స్పందించగలగాలి. ఇలా రెండు క్రీడలను ఒకేసారి సమన్వయం చేసుకుంటే విజయం మనదే అవుతుంది. మొదటి టోర్నమెంట్‌లోనే స్వర్ణపతకాన్ని గెలవడంతో నాలో ఉత్సాహం పెరిగింది. క్రమశిక్షణ, ఏకాగ్రత, కృషితో ఈ ఆటకు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చ’ని చెబుతున్న స్నేహ 2019లో అంతర్జాతీయస్థాయిలో ఛాంపియన్‌షిప్‌ పోటీలో స్వర్ణపతకం,  2021 జాతీయస్థాయిలో స్వర్ణపతకం, 2022లో 4వ ప్రపంచ చెస్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌- 50-55 కి.గ్రా క్యాటగిరీలో వెండి పతకం అందుకొన్నారీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్