మూడేళ్లలో.. పాతిక కోట్ల వ్యాపారం!

చుట్టూ చేతివృత్తుల వాళ్లే! లాక్‌డౌన్‌లో వాళ్ల ఇబ్బందుల్ని కళ్లారా చూసిందామె. వాళ్లకి సాయం చేయాలి.. జంతువధను ఆపాలి.. ఈ రెండు లక్ష్యాలతో వ్యాపారవేత్త అయ్యింది. మూడేళ్లలో రూ.కోట్ల వ్యాపారంగా తీర్చిదిద్దింది.

Published : 09 Aug 2023 00:25 IST

చుట్టూ చేతివృత్తుల వాళ్లే! లాక్‌డౌన్‌లో వాళ్ల ఇబ్బందుల్ని కళ్లారా చూసిందామె. వాళ్లకి సాయం చేయాలి.. జంతువధను ఆపాలి.. ఈ రెండు లక్ష్యాలతో వ్యాపారవేత్త అయ్యింది. మూడేళ్లలో రూ.కోట్ల వ్యాపారంగా తీర్చిదిద్దింది. హరితిమా మిశ్రా..

ఆమె వ్యాపార ప్రయాణమిది.

‘చేతివృత్తుల వారి వద్ద ప్రతిభ ఉంటుంది. దాన్ని సొమ్ము చేసుకోవడమే తెలియదు. అందుకే ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వాళ్లని చూస్తే జాలేసేది. అయితే ఏవిధంగా సాయం చేయాలో మాత్రం అర్థమయ్యేది కాదు. లాక్‌డౌన్‌లో తిండికీ ఇబ్బంది పడ్డప్పుడు మాత్రం వ్యాపారవేత్తని అవ్వాలనుకున్నా’ అంటుంది హరితిమ. అప్పటికి ఈమెకి 18 ఏళ్లే. పుట్టి పెరిగిందంతా ఆగ్రా. మెడికల్‌ విద్యార్థిని. ప్రాణం విలువ వైద్యుల కంటే బాగా ఎవరికి తెలుస్తుంది? వైద్య ప్రయోగాల్లో జంతువుల్ని చంపుతున్నప్పుడు పాపం! వాటిదీ ప్రాణమే కదా అనిపించేది. దీన్ని ఆపాలనుకుంది. పరిశోధిస్తే వీగన్‌ ఉత్పత్తుల గురించి తెలిసింది. దాన్నే తన వ్యాపార సూత్రంగా మలచుకుంది.

‘లెదర్‌ ఉత్పత్తులు తయారు చేసే చేతివృత్తుల వారికి సాయం చేయాలి.. అదీ జంతువుల ప్రాణాలకు ముప్పు కలగకుండా అని ముందే నిశ్చయించుకున్నా. అందుకోసమే వారికి వీగన్‌ లెదర్‌ని పరిచయం చేశా. ఇవీ వినియోగదారులు కోరుకునేలా అందంగా, సౌకర్యంగా ఉండటమే కాదు.. ఎక్కువకాలం మన్నుతాయి, భూమిలోనూ త్వరగా కలిసిపోతా’యనే హరితిమ ఈ వీగన్‌ లెదర్‌ను తయారీదారులకు పరిచయం చేయడానికి చాలానే కష్టపడింది. స్థిర ఆదాయం కల్పిస్తాననే నమ్మకమిచ్చి, వారిని ఒప్పించింది. మార్కెటింగ్‌, డిజైనింగ్‌ల్లో అన్నా వదినల సాయం తీసుకొని 2020లో ‘ఆటిట్యూడిస్ట్‌’ ప్రారంభించింది. ‘లెదర్‌ అందంగా ఉన్నా.. ఖర్చు ఎక్కువ. అందుకే తీసుకోవడానికి ఎక్కువమంది ముందుకు వచ్చేవారు కాదు. మధ్యవర్తులు సమయానికి చెల్లింపులు చేసేవారు కాదు. ఈ ఇబ్బందులన్నింటికీ . నేను పరిష్కారం చూపించాలనుకున్నా. వారికి డిజైనింగ్‌లోనూ శిక్షణ ఇప్పించడంతో  వందల రకాల చెప్పులు, షూలూ ఇప్పుడు వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి’ అంటారు హరితిమ. ప్రస్తుతం ఆమె 100 మందికి ఉపాధి కల్పిస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రచారంతో ఈ ఉత్పత్తులకు గిరాకీ ఏర్పడింది. అలా గత మూడేళ్లలో మూడు లక్షల మందికిపైగా కస్టమర్లను సంపాదించుకుంది. ఈ సంస్థ వ్యాపార విలువ రూ.25 కోట్లు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి డీ2సీ ప్లాట్‌ఫామ్‌లతో పాటు సొంత వెబ్‌సైట్‌ల్లోనూ అమ్మకాలు సాగిస్తోంది.  ఒకవైపు చదువు కొనసాగిస్తోనే వ్యాపారాన్నీ నిర్వహిస్తూ అందరితో శభాష్‌ అనిపించుకుంటోంది 21 ఏళ్ల హరితిమ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని