అనాథని కాబట్టే ఆ కష్టాలు తెలుసు..
అమ్మానాన్నలు లేరు.. బంధువులు దూరం పెట్టారు! అనాథాశ్రమంలో చదువుకుని, ఐటీ ఉద్యోగం కొట్టిందా అమ్మాయి. అంతటితో లక్ష్యం నెరవేరిందని.. తన అడుగుల్ని ఆపేయలేదు. ఒంటరి పోరాటం చేస్తున్న అనాథల జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటోంది.
అమ్మానాన్నలు లేరు.. బంధువులు దూరం పెట్టారు! అనాథాశ్రమంలో చదువుకుని, ఐటీ ఉద్యోగం కొట్టిందా అమ్మాయి. అంతటితో లక్ష్యం నెరవేరిందని.. తన అడుగుల్ని ఆపేయలేదు. ఒంటరి పోరాటం చేస్తున్న అనాథల జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటోంది. తన నాలుగు నెలల జీతాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్‌ఫండ్‌కి అందించి, యువతలో స్ఫూర్తిని నింపుతోంది జగిత్యాల అమ్మాయి రుద్ర రచన..
నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు. ఎందుకంటే నేను పుట్టిన మూడు వారాలకే ఆయన కామెర్లతో చనిపోయారు. మా సొంతూరు జగిత్యాల జిల్లాలోని రైకల్. నాన్న చనిపోయాక అమ్మ నన్నూ, అక్క రమ్యనీ తీసుకుని అమ్మమ్మ వాళ్ల ఊరు తాండ్రియాలకు వచ్చింది. బీడీలు చుట్టి మమ్మల్ని పోషించేది. ఆ పని తప్ప మాకే ఆధారం లేదు. దాంతో అమ్మ తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రెక్కలుముక్కలు చేసుకొనేది. డబ్బుల్లేక ఆసుపత్రికీ వెళ్లలేదు. నేను ఐదో తరగతిలో ఉండగా జ్వరంతో చనిపోయింది. అప్పుడే అక్క ఇంటర్ కాలేజీలో చేరింది. బంధువులు ఎవరూ మమ్మల్ని ఆదరించలేదు. ఒంటరివాళ్లమైపోయాం. ఇంటి ఎదురుగా ఉండే అమ్మ స్నేహితురాలే అద్దె తీసుకోకుండా వాళ్ల ఇంట్లో ఉండనిచ్చారు. అక్కడ నుంచి అక్క.. అమ్మలా మారింది. తను బీడీలు చుట్టి, కూలికి వెళ్లి ఇంటి అవసరాలు తీర్చేది. తీరిక సమయంలో తనకి సాయం చేసేదాన్ని. ఆ డబ్బుతోనే ఇద్దరం చదువుకొనేవాళ్లం. కానీ ఎంత కష్టపడ్డా... ఒక్కోసారి తిండిక్కూడా ఇబ్బందయ్యేది. దాంతో అక్క డిగ్రీ రెండో సంవత్సరంలో చదువాపేసింది. ఆ తర్వాత విద్యావాలంటీరుగా మారింది. ఆదివారాలు కూలీకి వెళ్లేది. మా పరిస్థితి చూసి అక్కని కులాంతర వివాహం చేసుకున్నారు మా బావ శేఖర్. ఆ తర్వాత నేను వాళ్లకి భారం కాకూడదని జగిత్యాలలోని బాలసదన్‌లో చేరాను. పదోతరగతి వరకూ అక్కడే చదువుకున్నా. ఆ తర్వాత యూసఫ్‌గూడ స్టేట్ హోంలో ఉంటూ పాలిటెక్నిక్ పూర్తి చేశా. 2019లో ఈసెట్ రాసి హైదరాబాద్‌లోని సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో సీటు సాధించా. అంతవరకూ నా అవసరాలన్నీ అక్కా, బావా చూసేవాళ్లు. ఇంజినీరింగ్ కాలేజీలో చేరాక ఫీజులు కట్టడానికి వాళ్లకీ ఇబ్బంది అయ్యాయి.
సమాజానికి తిరిగి ఇవ్వాలని..
మొదటి సంవత్సరం కొంతమంది అధికారులు, ‘మేము సైతం’, ‘సహాయ’ సహా ఇతర ఎన్జీవోలు నాకు సాయం చేశాయి. రెండో ఏడాదీ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ నాకు అండగా నిలబడ్డారు. నా గురించి తెలిసి చదివిస్తానని మాట ఇచ్చారు. అలా మంచి మనుషుల సహకారంతో నా ఇంజినీరింగ్ పూర్తయ్యింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా కాగ్నిజెంట్, విప్రో, ఎల్‌అండ్‌టీ సహా మరో సంస్థ నుంచీ పిలుపొచ్చింది. తొలి అవకాశం అందుకొని కాగ్నిజెంట్‌లో చేరిపోయా. ఈ విషయం తెలిసి.. కేటీఆర్ పిలిచి అభినందించారు. అంతవరకూ మా ఇంట్లో ఏ పండగలూ లేవు. అందుకే ఆయనకి రాఖీ కట్టి సంతోషపడ్డాను. కాలేజీలో చదివినంత సేపూ కనీసం పాకెట్‌మనీ కూడా లేక చాలా ఇబ్బందులు పడ్డా. అయినా సరే నా తొలి నాలుగు నెలల జీతంలో పైసా కూడా తీయకుండా లక్ష రూపాయలు దాచిపెట్టాను. ఆ డబ్బులు నాలాంటి అనాథలకి ఉపయోగపడాలని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాను. నాకంటే కనీసం అక్కా, బావ అయినా ఉన్నారు. నాతో పాటు స్టేట్‌హోంలో చదువుకున్న చాలామందికి వాళ్లూ లేరు. కనీస అవసరాలు తీరేందుకు వస్త్ర దుకాణాల్లో పనిచేసేవారు. నేనూ అంతకంటే ఎక్కువే ఇబ్బందిపడ్డా. ఫీజు కట్టడానికి నా ఆర్థిక ఇబ్బందుల గురించి చెబితే చాలామంది మంచి మనసుతో స్పందించేవారు. కొందరు అసలు వినేవారు కాదు. అనాథలు ఎవరిపైనో ఆధారపడాల్సిన అవసరం లేకుండా... వాళ్లకు ఉద్యోగాల్లో, చదువులో రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుంది కదా! భవిష్యత్‌లో సివిల్స్ రాసి ఓ అనాథ అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఉంది. కాస్త స్థిరపడ్డాక అనాథ శరణాలయం ఏర్పాటు చేయాలన్నది నా కల.
- అలీమొద్దీన్, ఈటీవీ, కరీంనగర్
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.