డైరీతో ప్రయోజనాలెన్నో...

రోజూ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, ఆలోచనలు, కలలు, లక్ష్యాలు వంటివన్నీ డైరీలో పొందుపరచడం అలవరుచుకుంటే ప్రయోజనాలెన్నో. ఏటా మొదటి రోజుల్లో డైరీ రాయడం మొదలు

Updated : 31 Dec 2021 05:31 IST

రోజూ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, ఆలోచనలు, కలలు, లక్ష్యాలు వంటివన్నీ డైరీలో పొందుపరచడం అలవరుచుకుంటే ప్రయోజనాలెన్నో. ఏటా మొదటి రోజుల్లో డైరీ రాయడం మొదలు పెట్టాలనుకోవడం లేదా ప్రారంభించి కొద్దిరోజుల్లోనే మానేయడం చాలామందికి అలవాటు. ఈ ఏడాది నుంచైనా డైరీ రాయడం మొదలు పెట్టి, దాన్ని కొనసాగించమంటున్నారు నిపుణులు. దీనివల్ల దక్కే లాభాలను చెబుతున్నారిలా...

దూరమైంది.. ఏదైనా పర్యాటకానికి వెళ్లినప్పుడు ఆ ప్రాంతం విశేషాలను కొందరు డైరీలో పొందుపరుస్తూ ఉంటారు. ఇది కేవలం ట్రావెల్‌ డైరీగా మారుతుంది. అలాగే మరికొందరు తాము చేయాల్సిన పనులను, ఇంటి ఖర్చులను రాయడానికి డైరీని వినియోగిస్తారు. అలాగే చాలామంది రోజూ జరిగే విశేషాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి అక్కడితో ఆగిపోతున్నారు. లేదా సొంతంగా బ్లాగ్స్‌, వ్లోగ్స్‌లో జీవిత విశేషాలు, అనుభవాలను పొందుపరుస్తున్నారు. సామాజిక మాధ్యమాలకు అలవడిన తీరు అందరినీ దాదాపు డైరీకి దూరం చేసింది.

ఆలోచనలకు... రోజు వారీ విశేషాలకు మాత్రమే డైరీ కాకుండా మనసులో కలిగే ఆలోచనలు, అనుభవాలను పొందు పరచడానికి ప్రయత్నించాలి. అవి భవిష్యత్తులో ముందడుగు వేయడానికి ఉపయోగపడేలా చేస్తాయి. ఖాళీ సమయాల్లో దాన్ని తిరగేసి చూస్తే అప్పటి లక్ష్యాలను గుర్తుకు తెస్తుంది డైరీ. అంతే కాదు రాసే శైలిని పెంపొందేలా చేస్తుంది. రోజురోజుకీ మన ఆలోచనలు, భావాలలో జరిగే పురోభివృద్ధిని చూపిస్తుంది.

లక్ష్యాలు.. లక్ష్యాలతోపాటు వాటిని ఎలా ఛేదించాలనుకుంటున్నారో డైరీలో రాసుకోవాలి. వాటిని అధిగమించడానికి ఎటువంటి కృషి చేస్తున్నారో కూడా రాస్తుంటే చాలు. మనకి మనమే స్ఫూర్తిగా నిలుస్తాం... విజయానికి చేరువ అవుతాం. చిన్నచిన్న లక్ష్యాలను సాధిస్తూ, తిరిగి మరో లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటూ అడుగు వేస్తే చాలు. డైరీ రాయడం ద్వారా జ్ఞాపకశక్తిని, సృజనాత్మకతను కూడా పెంచుకోవచ్చు.

ఒత్తిడికి దూరంగా... మంచి అనుభవాలు, జ్ఞాపకాలను తిరిగి మన ముందుంచుతుంది డైరీ. ఒత్తిడిగా అనిపించినప్పుడు డైరీని తిరగేస్తే చాలు. మనసంతా తేలికగా మారుతుంది. మన భావోద్వేగాల గురించి మనం తెలుసుకునేలా చేసే డైరీని రాయడానికి నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. నిద్రపోయే ముందైతే మనతో మనం మాట్లాడుకున్నట్లుగా అనిపించడమే కాదు, ప్రశాంతంగా నిద్రలోకి జారుకోవచ్చు. దగ్గర స్నేహితురాలిగా నిలుస్తూ ఎన్నో ప్రయోజనాలను అందించే డైరీని రానున్న కొత్త సంవత్సరంలోనైనా రాయడం ప్రారంభిస్తే బాగుంటుంది కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్