ఇది పరీక్షా కాలం!

పిల్లలకే కాదు.. మనకూ ఈ రెండు మూడు నెలలూ ‘పరీక్ష’ సమయమే. ఓ వైపు ఎండలు.. మరోవైపు పరీక్షల ఒత్తిడి. అందుకే కౌన్సెలర్లకు, హెల్ప్‌లైన్లకు ఫోన్ల తాకిడి పెరిగిపోయింది. ఈ ఒత్తిడి నుంచి పిల్లలను బయట పడేయాల్సిన బాధ్యత మనదే!

Published : 09 May 2022 01:47 IST

పిల్లలకే కాదు.. మనకూ ఈ రెండు మూడు నెలలూ ‘పరీక్ష’ సమయమే. ఓ వైపు ఎండలు.. మరోవైపు పరీక్షల ఒత్తిడి. అందుకే కౌన్సెలర్లకు, హెల్ప్‌లైన్లకు ఫోన్ల తాకిడి పెరిగిపోయింది. ఈ ఒత్తిడి నుంచి పిల్లలను బయట పడేయాల్సిన బాధ్యత మనదే! శారీరక, మానసిక ఆరోగ్యాల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలో వసుంధర నిపుణులను అడిగింది... వారేం చెప్పారో చూడండి...


అండగా ఉండాలి..

సానుకూలత.. ఈ సమయంలో పిల్లలకు మన అండ చాలా అవసరం. కంగారు, ఒత్తిడితో అనారోగ్యాల్నీ తెచ్చిపెట్టుకుంటారు. ఇతరులతో పోల్చడం, కోప్పడ్డం.. దెప్పుళ్లకు ఇది సమయం కాదు. ‘నువ్వు బాగా చేయగలవు, నాకు నీపై నమ్మకం ఉంది’ అని ప్రోత్సహించండి. కంగారు పడుతోంటే.. దగ్గరకు తీసుకొని ‘అన్నీ చదివున్నావ్‌.. పరీక్షలో గుర్తొస్తాయి. తప్పక బాగా రాస్తావు’ అన్న భరోసానివ్వండి. టీవీ, ఫోన్‌ వంటివి యువతకు ప్రధాన ఆకర్షణలు. వాళ్లను చదువుకోమని, మనం వాటితో సమయం గడుపుతోంటే పిల్లలు ఎలా ఏకాగ్రత చూపగలరు? కాబట్టి, ఈ కొన్నాళ్లూ మీరూ వాటికి దూరంగా ఉండాలి. కొందరు పక్కన అమ్మో, మరొకరో కూర్చుంటేనే చదవగలరు. అలా కోరితే పక్కన కూర్చోండి. ముఖ్యమైన పాయింట్లు రాసివ్వడం, అప్పజెప్పించుకోవడం చేయండి. వారికదో భరోసా.

ఆ వాతావరణం.. పరీక్షల సమయంలో సహజంగానే పిల్లల మనసులు సున్నితంగా తయారవుతాయి. ఇంట్లో గొడవలు వారిపై ప్రభావం చూపుతాయి. అలాంటివి వాళ్ల దృష్టికి వెళ్లకుండా చూడండి. చదువుకునే ప్రదేశం తలుపు, కిటికీలకు దూరంగా ఉండాలి. టీవీ, గోడమీద ఫొటోలు, బయటి శబ్దాలు.. వారి దృష్టిని మరల్చేవే. కాబట్టి, గోడమీద పాఠాల పాయింట్లు, స్టిక్‌ పేపర్లు పెట్టుకునే వీలుండేలా చూడండి.

విరామం కావాలి.. అస్తమానం చదవమనొద్దు. ఏకాగ్రత ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొందరు గంటల కొద్దీ చదివేస్తే ఇంకొందరికి అరగంటకే అలసటొస్తుంది. కాబట్టి టైమ్‌టేబుల్‌నీ మీరే నిర్ణయించొద్దు. ఎంత సేపు అనే దానికన్నా నాణ్యత ముఖ్యం. ఏకధాటిగా చదువుతున్నా ఊరుకోవద్దు. విశ్రాంతి తీసుకునేలా చూడాల్సిన బాధ్యతా మనదే. ఏకాగ్రత కుదరకపోతే వేరేది చదవమనాలి. లేదా కాసేపు నచ్చిన పనిని చేయనివ్వాలి. గ్యాడ్జెట్లకు మాత్రం దూరంగా ఉంచాలి. వ్యాహ్యాళికి తీసుకెళ్లడం, కాసేపు కబుర్లు చెప్పడం వంటివి ఊరటనిస్తాయి. చాలామందికి రాత్రంతా చదవడం అలవాటు. అది శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపగలదు. మర్చిపోయే అవకాశాలూ ఎక్కువే. అలా కాకుండా తెల్లవారు జామున లేచి చదువుకోమనొచ్చు. నిద్ర విషయంలో రాజీ పడనివ్వద్దు.

సర్దుకోవాల్సిందే.. ఒత్తిడి, భయంతో పిల్లలు కోపం, చిరాకు చూపిస్తే కోపగించుకోవద్దు. కారణం తెలుసుకోండి. తగిన సాయం చేయండి. పరీక్షలు జీవితంలో భాగమే కానీ.. ఇవే ప్రధానం కాదన్న విషయాన్ని చెప్పండి. ‘నింపాదిగా, నీకు వచ్చిందే రాసి రా’.. అని ప్రోత్సహించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు.


అది తింటే.. నిద్రొస్తుంది

దవడం కెలరీలు ఖర్చయ్యే పనేం కాదు. కానీ, అలసటతో కూడుకుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను చూసుకుంటుండాలి. పరీక్షల్లోపడి రోజులపాటు కూర్చొనే ఉంటే బరువులో తేడాలొస్తాయి. కాబట్టి మితంగా, అన్ని పోషకాలూ అందేలా ఆహారాన్ని తీసుకోవాలి. మెదడు, న్యూరో ట్రాన్స్‌మిటర్లకు ఈ సమయంలో మేలైన మాంసకృతులు కావాలి. పప్పుధాన్యాలు, సోయా గింజలు, పెరుగు, పాలు, నూనె గింజల్లో ఇవి లభిస్తాయి. పెసరట్టు, మినపట్టు, కుడుము, గుప్పెడు ఉడకబెట్టిన వేరుశెనగలు, గుగ్గిళ్లు, అలసందలు ఇవ్వొచ్చు. మాంసాహారులు తక్కువ నూనెతో చేసిన గుడ్డు, ఆమ్లెట్‌, చికెన్‌, చేపలు రోజూ తినొచ్చు. అన్నాన్నీ తగ్గించాలి. లేదంటే నిద్ర వచ్చేస్తుంది.

తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. అన్నాన్ని ఒకపూటకు పరిమితం చేసుకొని.. మిగతా వేళల్లో పొట్టుతో ఉన్న జొన్న, సజ్జ, గోధుమ రొట్టెలు లేదా దంపుడు బియ్యం వంటివి తింటే బి కాంప్లెక్స్‌ కొరత ఉండదు. ఆకు, కాయగూరలకు ప్రత్యామ్నాయం లేదు. సరైన పోషకాలు అందట్లేదనిపిస్తే రోజుకో మల్టీవిటమిన్‌ టాబ్లెట్‌, ఫిష్‌ ఆయిల్‌ క్యాప్సూల్స్‌ 5ఎంజీ వరకు రెండు నెలల పాటు తీసుకోవచ్చు. అవిసెలు, వాల్‌నట్స్‌నీ తినాలి.

ఒత్తిడిని తట్టుకొనేందుకు... విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండే నట్స్‌, నువ్వులు, అవిసె లడ్డూ, మరమరాలు, జొన్న పేలాలు, వేయించిన పుట్నాలు, బఠానీలు సాయపడతాయి.

హాస్టళ్లలో ఉంటే... కీరా, క్యారెట్‌, టమాటాతోపాటు.. గోంగూర, కరివేపాకు, మునగాకు, పుదీనా పొడులు తినాలి. రోజూ 300 ఎం.ఎల్‌. పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటే గ్లూకోమిక్స్‌, కాల్షియం లభిస్తుంది. తాగునీరు పక్కనే ఉంచుకోవాలి. వేడి వల్ల శరీరం లవణాలు కోల్పోయి నీరసం, తలనొప్పి వస్తాయి. ఎలక్ట్రాల్‌/ నిమ్మకాయ నీటిని రోజులో రెండు సార్లు తాగాలి. చక్కెర వేసిన జ్యూస్‌లు వద్దు. నేరుగా పండ్లు తినమనండి. ఎక్కువ నూనెలు ఉండే పులిహోర, బిర్యానీ, పూరీ, వడ వంటివొద్దు. బదులుగా పెరుగన్నం, కూరగాయ కర్రీ, ఆకుకూర పప్పు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. సాయంత్రం బ్రెడ్‌, గ్లాసు పాలు, అరటిపండు, జామ్‌/ తేనెతో చపాతీ, చట్నీ, పొడులతో ఇడ్లీ ఇవ్వొచ్చు. పరీక్ష సమయంలో చక్కెర ఉన్న చాక్లెట్‌లు, గ్లూకాన్‌ డీ బిళ్లలు దగ్గర పెట్టుకోవాలి. ఆకలేసినా, నీరసంగా ఉన్నా వీటిని తింటే సరి.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్